Bay of Bengal Earthquake: బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Centre for Seismology–NCS) విడుదల చేసిన వివరాల ప్రకారం, ఉదయం 7.26 గంటలకు 4.2 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది. సముద్రంలోని టెక్టానిక్ ప్లేట్‌ల కదలికల కారణంగానే ఈ ప్రకంపనలు నమోదైనట్టు భూకంప నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఈ భూకంపం జనాలు నివశించే ప్రాంతాలకు దూరంగా ఉండటం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఆసియా ప్రాంతానికి చెందిన తజికిస్తాన్‌లో కూడా వరుసగా భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం తెల్లవారుజామున 3.9 తీవ్రతతో అక్కడ మరో భూకంపం సంభవించింది. ఇది 75 కిలోమీటర్ల లోతులో నమోదైనట్టు NCS ఒక ప్రకటనలో పేర్కొంది. X ప్లాట్‌ఫారమ్‌లో సంస్థ పోస్ట్ చేసిన సందేశంలో, “EQ of M: 3.9, On: 02/12/2025 04:35:14 IST, Lat: 37.15 N, Long: 72.43 E, Depth: 75 Km, Location: Tajikistan” అని వివరించారు.
తజికిస్తాన్‌లో ఇదే ప్రాంతంలో గత వారం కూడా మరో భూకంపం సంభవించింది. నవంబర్ 26న 4.2 తీవ్రతతో, 90 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వరుస భూకంపాలు చోటుచేసుకోవడం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదు.
భూకంప శాస్త్రజ్ఞులు ఈ ప్రాంతాల్లో టెక్టానిక్ ప్లేట్‌ల మార్పులను గమనిస్తూ, పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రకంపనల అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం రెండు ప్రాంతాల్లోనూ పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
