Bowrampet Land Dispute: బౌరంపేట్‌లో 40 ఏళ్లుగా సతీష్ లే అవుట్ సమస్య కొనసాగుతున్నది. ప్రభుత్వాలు మారుతున్నా బాధితులకు న్యాయం జరగడం లేదు. తాజాగా మరోసారి ఇక్కడ భూ దందా మొదలైంది. రాజకీయ పలుకుబడితో కొందరు చక్రం తిప్పుతున్నారు. టైటిల్ లేకుండానే పాత తేదీల్లో సాదాబైనామాలో నమోదు చేసుకున్నామని చెబుతున్నారు. ప్లాట్స్ అయిన తర్వాత తెల్ల కాగితాలపై కొనుగోలు చేసిన వారంతా ఓనర్స్‌ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.
వేధింపులు భరించలేక 400 మంది ఆందోళన
అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 20 ఏండ్లుగా ట్యాక్స్ కడుతూ, నివాసం ఉంటున్న వారికి కరెంట్ తీసివేయిస్తున్నారు. బడా బాబులు కట్టుకున్న పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్స్‌కు మాత్రం అన్నీ రెడీ చేసి పెడుతున్నారని ఆగ్రహంతో ఊగిపోతున్న బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు. వేధింపులు భరించలేక 400 మంది ఆందోళన చేపట్టారు. అధికారుల తీరును దుయ్యబడుతున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తమ ప్లాట్స్‌ను కబ్జా చేసుకుని అపార్ట్‌మెంట్ నిర్మించేలా ప్రయత్నాలు చేస్తున్నారని వాపోతున్నారు. 40 ఏండ్ల క్రితం కొనుగోలు చేసిన ప్లాట్స్‌ను కబ్జా పెట్టేందుకు సిద్ధమవుతున్నారని విమర్శిస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
బౌరంపేట్‌లో భూస్వామి బీవీ ప్రకాశ్ రెడ్డికి మొత్తం 700 ఎకరాలు ఉండేది. సతీష్ లే అవుట్‌కు సంబంధించి సర్వే నెంబర్ 246 నుంచి 269 వరకు 200 ఎకరాలకు పట్టాదారుడు. ఇందులో 160 ఎకరాలు పీటీ యాక్ట్ ద్వారా రైతులు సర్టిఫికెట్స్ పొందారు. 1982 నుంచి 1992 వరకు అటు పట్టాదారుడి లీగల్ హెయిర్ అల్లుడు టీ గోపాల్ రెడ్డి, ఇటు రైతుల నుంచి జీపీఏ చేసుకున్న పోలీస్ లక్ష్మారెడ్డి లే అవుట్ చేసి ప్లాట్స్ అమ్ముకున్నారు. నాలా కన్వర్షన్ లేకుండానే 1200 ప్లాట్స్ రిజిస్ట్రేషన్ ద్వారా అమ్మేశారు. జీపీఏ హోల్డర్స్ పేరుపై మ్యూటేషన్ కాలేదు. దీంతో పొజిషన్‌లో లేకుండానే సాదాబైనామా పేరుతో కొనుగోలు చేశామని కొంత మంది దొంగ పత్రాలతో మళ్లీ ఆర్వోఆర్ యాక్ట్ ప్రకారం పాస్ బుక్స్ తెచ్చుకున్నారు. తర్వాత వాటిని గుర్తించిన అప్పటి రంగారెడ్డి కలెక్టర్ సతీష్ చంద్ర ప్లాట్స్ ఓనర్స్ బాధలను చూసి వారికి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చారు.
అధికారులు నిర్లక్ష్యం
అందుకే ఆ 200 ఎకరాలకు సతీష్ లే అవుట్ అని పేరు పెట్టుకున్నారు. అన్నీ తెలిసి సాదాబైనామాతో ముగ్గురు బడాబాబులు 50 ఎకరాల చొప్పున 150 ఎకరాలకు ఆర్వోఆర్ యాక్ట్ ప్రకారం ఇచ్చిన పాస్ బుక్స్‌ను 1997లో రద్దు చేశారు. దీంతో కోర్టుల చుట్టూ ఈ భూములపై తిరుగుతూనే ఉన్నారు. ప్లాట్ ఓనర్స్‌కు అనుకూలంగా తీర్పులు వచ్చినా అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కానీ, రైతుల పేర్లతో ఉన్న భూములు అంటూ బడా నాయకులు నిర్మాణం చేపడితే అనుమతులు ఇస్తున్నారు. ఎల్ఆర్ఎస్ చెల్లించుకుని, ట్యాక్స్ కడుతున్న ప్లాట్ ఓనర్స్‌ను మాత్రం ఎంతో కొంతకు అమ్ముకుని వెళ్లాలని బెదిరిస్తున్నారు.
ఇప్పుడు పావులు కదుపుతున్నదెవరు?
ప్లాట్‌లో రేకుల షెడ్డుతో ఉన్న రూమ్స్, ఖాళీగా ఒకేచోట ల్యాండ్ బ్యాంక్ ఉండడంతో అనేక మందికి ఆశ చూపించారు. ప్లాట్ ఓనర్స్ మధ్య విభేదాలు తీసుకొచ్చారు. అంతా మనదే అంటూ ప్రభుత్వాల పెద్దల వద్దకు వెళ్లి బురిడీ కొట్టిస్తున్నారు. దీంతో అప్పనంగా వస్తుందని ఆశ పడుతున్న బడా భూ వ్యాపారులకు ప్లాట్ ఓనర్స్ ఎదురు తిరుగుతున్నారు. జీవిత కష్టార్జీతం అంతా పోగేసి కొనుగోలు చేసిన తాము, ఇప్పుడు ముసలి వయసులో కూడా దక్కించుకోలేమా అంటూ వాపోతున్నారు. చావో రేవో తెగించి కొట్లాడుతామని హెచ్చరిస్తున్నారు. 1200 మంది బాధితులకు న్యాయం జరుగుతుందా లేదా? ఎప్పటి లాగానే కోర్టుల్లో కేసులు ఉండగానే చక్రం తిప్పేస్తున్న లీడర్స్‌కు అనుకూలంగా రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తారా అనేది అసక్తిగా మారింది. కొత్తగా బౌన్సర్స్‌ను పెట్టి ప్లాట్స్ వద్దకు రానివ్వకుండా అడ్డుకోవడాన్ని ఓనర్స్ జీర్ణించుకోవడం లేదు. దీనిపై ఫైట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read: Farmers Land Dispute: నవాపేట్ భూ వివాదం.. రైతుల హక్కుల కోసం పోరాటం
