Sridhar Babu: మరో రెండు నెలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) వెల్లడించారు. ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీల సాంకేతిక సహకారంతో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేస్తున్న ఇంజనీర్లు, చదువులు పూర్తి చేస్తున్న విద్యార్థులకు దీంతో నూతన నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తామని తెలిపారు. కోవాసెంట్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించి మాట్లాడుతూ ప్రస్తుతం 500 మంది ఇంజనీర్లు పనిచేస్తున్న కోవాసెంట్ మరో రెండేళ్లలో 3000 మంది ప్రతిభావంతులను ఉద్యోగావకాశాలు కల్పిస్తుందన్నారు.
పర్యావరణం దేశంలో మరెక్కడా లేదు
ఏఐ సాంకేతిక దూకుడుతో కోడింగ్ లో ఉన్నవారు ఇతర ప్లాట్ ఫారాల్లో పనిచేస్తున్న వారు నైపుణ్యాలను పెంచుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. వారందరికి ఏఐ యూనివర్సిటీ ద్వారా రీస్కిల్, అప్ స్కిల్స్ అందిస్తామని చెప్పారు. టెక్నాలజీ అంటే సిలికాన్ వ్యాలీ, ప్రపంచ ప్రొడక్షన్ సెంటర్ గా చైనాలోని షెంజెన్, క్రమశిక్షణ, సుపరిపాలన కలిగిన దేశంగా సింగపూర్ ల గురించి చెబుతారని, ఈ మూడు లక్షణాలు కలగలిసిన నగరంగా హైదరాబాద్ రూపొందుతోందని తెలిపారు. ఇక్కడ ఉన్న అనుకూల పర్యావరణం దేశంలో మరెక్కడా లేదని పేర్కొన్నారు. అత్యధికంగా గ్లోబల్ సామర్థ్య కేంద్రాలున్న నగరంగా అగ్రస్థానంలో హైదరాబాద్ నిల్చిందన్నారు.
లైఫ్ సెన్సెస్ రంగంలో గణనీయ ప్రగతిని సాధించాం
ప్రపంచంలోని దిగ్గజ బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ ను ఎంచుకున్నాయని, ఇది అత్యంత గర్వించదగ్గ అంశం అన్నారు. లైఫ్ సెన్సెస్ రంగంలో గణనీయ ప్రగతిని సాధించామని, దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లలో మూడో వంతు ఇక్కడే తయారవుతున్నాయన్నారు. హెల్త్ కేర్ ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటవుతున్నాయని, ఇటువంటి ఎకోసిస్టం మరెక్కడా కనిపించదని, తమ ప్రభుత్వ దృఢ సంకల్పం వల్ల ఇవన్నీ సాధ్యమయ్యాయని వెల్లడించారు. సమావేశంలో కోవాసెంట్ ఛైర్మన్ సుబ్రమణ్యం, ఐటీ, ఇండస్ట్రీస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ, యుకె డిప్యూటీ హై కమిషనర్ గ్యారెత్ వయన్ ఓవేన్లు పాల్గొన్నారు.
Also Read: Sridhar Babu: చెరుకు రైతుల సమస్యలపై ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

