Jewelry Theft Case: జువెలరీ షాపు చోరీ కేసులో నిందితుల అరెస్ట్
15 కిలోల వెండి, బొలేరో కారు సీజ్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఇటీవల సంచలనం సృష్టించిన సోమేశ్వర్ జువెలరీ చోరీ కేసులో (Jewelry Theft Case) దుండిగల్ పోలీసులు మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ముగ్గురిని కటకటాల వెనక్కి పంపించిన అధికారులు వారి నుంచి 15 కిలోల వెండి, ఒక బొలేరో కారు, ఒక పలుగును స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జోన్ అదనపు డీసీపీ కే.పురుషోత్తం , మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, సీసీఎస్ ఏసీపీ నాగేశ్వరరావుతో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
Read Also- New Rule: డిలీట్ చేయడానికి వీలులేకుండా ఫోన్లలో కొత్త యాప్.. తయారీ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు!
పక్కగా స్కెచ్ వేసి…
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన చేతన్ ప్రకాశ్, సిరాజుద్దీన్ కొంతకాలం క్రితం హైదరాబాద్ వచ్చారు. ఇక్కడికి వచ్చిన తరువాత మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాలూరాంతో వీరికి చర్లపల్లిలో పరిచయం ఏర్పడింది. ముగ్గురు కలిసి తేలికగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలు చేయాలని పథకం వేసుకున్నారు. దాని ప్రకారం చోరీకి అనువుగా ఉన్న జువెలరీ షాపుల కోసం రెక్కీ నిర్వహించారు. ఈ క్రమంలో బౌరంపేటలోని సోమేశ్వర్ జువెలర్స్ వారి కంట పడింది. దాని పక్కనే ఉన్న ఓ షాపు ఖాళీగా ఉండటంతో ముగ్గురు కలిసి దానిని అద్దెకు తీసుకున్నారు. గతనెల 7న రాత్రి సమయంలో తాము అద్దెకు తీసుకున్న దుకాణానికి వెళ్లి షట్టర్లను లోపలి నుంచి వేసుకున్నారు. ఆ తరువాత పలుగు సహాయంతో గోడకు రంధ్రం చేసి జువెలరీ షాపులోకి చొరబడ్డారు. దుకాణంలో ఉన్న 15 కిలోల వెండి ఆభరణాలను అపహరించి, వచ్చిన బొలేరో కారులో అక్కడి నుంచి ఉడాయించారు.
తొలుత 3.5 కేజీల వెండి స్వాధీనం
మరుసటి రోజు ఉదయం చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన జువెలరీ షాపు యజమాని ఫిర్యాదు చేయడంతో దుండిగల్ సీఐ సతీష్ కేసులు నమోదు చేశారు. డీఐ బాల్ రెడ్డి, సీసీఎస్ సీఐ డాలి నాయుడు, క్రైమ్ ఎస్ఐ ఈశ్వర్, సీసీఎస్ ఎస్ఐ శంకర్, హెడ్ కానిస్టేబుళ్లు వెంకటయ్య, లచ్చయ్య, కానిస్టేబుళ్లు రజనీకాంత్, బాల్ రెడ్డి, హరీష్‌లతో కలిసి వేర్వేరు బృందాలుగా విడిపోయి విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో మొదట కాలూరాంను అరెస్ట్ చేసి అతని నుంచి 3.5 కిలోల వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అతడు వెల్లడించిన వివరాల మేరకు చేతన్ ప్రకాశ్, సిరాజుద్దీన్ లను అదుపులోకి తీసుకున్నారు. తస్కరించిన వెండి నగలను బెంగళూరులో అమ్మినట్టుగా ఈ ఇద్దరు వెల్లడించటంతో అక్కడికి వెళ్లిన ప్రత్యేక బృందం వాటిని స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో మరికొందరు నిందితులు ఉన్నారని చెప్పిన అదనపు డీసీపీ పురుషోత్తం వారి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.
