WhatsApp: దేశంలో మెసేజింగ్ యాప్‌ల వినియోగంపై కేంద్రం కీలక మార్పులను తీసుకొస్తోంది. టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం, WhatsApp సహా అన్ని మెసేజింగ్ ప్లాట్‌ఫార్మ్‌లు ప్రతి ఆరు గంటలకు యూజర్లను ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ చేయాలి. ఈ కొత్త నిబంధనలో భాగంగా, యూజర్ రిజిస్ట్రేషన్ సమయంలో ఉపయోగించిన సిమ్ కార్డ్‌ను తప్పనిసరిగా ఆ యాప్ సేవలకు బైండ్ చేయాలి. అంటే WhatsApp, Telegram, Signal, Arattai, Snapchat, ShareChat వంటి యాప్‌లు ఇప్పుడు యూజర్‌కు చెందిన అదే సిమ్ ఫోన్‌లో ఉండి ఉండేలా చూడాలి.
సిమ్ బైండింగ్ తప్పనిసరి కావడంతో, WhatsApp Web ఇతర వెబ్ కంపానియన్‌లు కూడా ప్రతి ఆరు గంటలకు లాగ్ అవుట్ అవుతాయి. ఇప్పటివరకు రోజు మొత్తం WhatsApp Webని ఓపెన్‌గా ఉంచి వర్క్ చేయడం సాధ్యమయ్యేది. అయితే, కొత్త రూల్స్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆ సౌకర్యం ఉండదు.
DoT సర్క్యులర్ ప్రకారం, 90 రోజుల్లో కొత్త నియమం పూర్తిగా అమల్లోకి వస్తుంది. ఒరిజినల్ సిమ్ ఫోన్‌లో లేకపోతే WhatsApp వంటి యాప్‌లకు యాక్సెస్ ఇవ్వరు. అంతేకాదు, అన్ని వెబ్-బేస్డ్ ప్లాట్‌ఫార్మ్‌లు నాలుగు నెలల్లోపుగా తమ కంప్లైయన్స్ రిపోర్ట్ సమర్పించాలి. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం .. మెసేజింగ్ యాప్‌లను దుర్వినియోగం చేసే సైబర్ మోసగాళ్లను గుర్తించడం. తమ వద్ద సిమ్ లేకుండానే, విదేశాల నుంచి కూడా WhatsApp ఖాతాలను ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిన నేపథ్యంలో ఈ చర్య అవసరమైందని అధికారులు భావిస్తున్నారు. సిమ్‌ను యాప్ సేవలకు బైండ్ చేయడం వల్ల యూజర్ కార్యకలాపాలను ఫిజికల్ సబ్స్క్రైబర్ వద్దకు ట్రేస్ చేసే వీలుంటుంది.
ఈ మార్పులు టెలికమ్యూనికేషన్ సైబర్‌సెక్యూరిటీ సవరణ నియమాలు 2025 ప్రకారం అమలవుతున్నాయి. ఇందులో Telecommunication Identifier User Entity అనే కొత్త కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టారు. ఇకపై WhatsApp వంటి గ్లోబల్ ప్లాట్‌ఫార్మ్‌లు యూజర్ సిమ్‌లో ఉండే IMSI (International Mobile Subscriber Identity) వివరాలకు యాక్సెస్ తీసుకోవాల్సి వస్తుంది. దీని కోసం అవి ప్రత్యేకంగా భారతీయ యూజర్ల కోసం తమ సిస్టమ్‌లను తిరిగి డిజైన్ చేయాల్సి ఉంటుంది.
టెక్నాలజీ కంపెనీలు ఈ నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారి అభిప్రాయం ప్రకారం, నిరంతరం సిమ్ చెక్ చేయడం యూజర్ ప్రైవసీకి భంగం కలిగిస్తుంది, మల్టీ-డివైస్ సపోర్ట్ పూర్తిగా దెబ్బతింటుంది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు యాక్సెస్ మరింత క్లిష్టమవుతుంది. అయితే, టెలికాం ఆపరేటర్లు మాత్రం ఈ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు.
