Shocking Crime: ఒకప్పుడు అన్యోన్యానికి మారు పేరుగా నిలిచిన భార్య, భర్తలు.. ప్రస్తుత రోజుల్లో బద్ద శత్రువులను తలపిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే తీవ్రస్థాయిలో గొడవపడి.. జీవిత భాగస్వామిని దారుణంగా హత మారుస్తున్నారు. తాజాగా దేశంలో ఇలాంటి ఘోరమే ఒకటి చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన ఓ భర్త.. భార్యను అతి దారుణంగా కత్తితో పొడిచి హతమార్చాడు. ఆపై ఆమె డెడ్ బాడీతో సెల్ఫీ సైతం దిగాడు. ప్రస్తుతం ఈ మర్డర్ తమిళనాడులో తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది.
వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడు తిరునల్వేలి (Tirunelveli)కి చెందిన శ్రీప్రియ కోయంబత్తురు (Coimbatore)లో భర్త బాల మురుగన్ కు దూరంగా జీవిస్తోంది. హాస్టల్ లో ఉంటూ తన పనేదో తను చూసుకుంటోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం ఆమె ఉంటున్న హాస్టల్ వద్దకు బాలమురుగన్ వచ్చాడు. శ్రీప్రియతో మాట్లాడుతుండగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను కసితీరా పొడిచాడు. రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న భార్య మృతదేహంతో సెల్ఫీ దిగాడు.
పరుగులు తీసిన హాస్టల్ మహిళలు..
శ్రీప్రియపై బాలమురుగన్ దాడి చేయడంతో హాస్టల్ లోని మహిళలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అక్కడి నుంచి తలో దిక్కు పరిగెత్తారు. పోలీసులకు వెంటనే సమాచారం ఇచ్చారు. అయితే బాలమురుగన్ పోలీసులు వచ్చే వరకూ ఎక్కడికి కదల్లేదు. భార్య మృతదేహం వద్దే కూర్చొని ఉన్నాడు. ఈ క్రమంలో ఘటనాస్థలికి చేరుకున్న కోయంబత్తూరు పోలీసులు.. బాలమురుగన్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న మారణాయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
భార్యపై అనుమానంతో..
భార్యపై అనుమానంతోనే బాలమురుగన్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమికంగా తేల్చారు. శ్రీప్రియకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని బాలమురుగన్ అనుమానం పెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ విషయమై ఇద్దరి మధ్య ఎంతో కాలంగా గొడవలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటి నుంచి బయటకు వచ్చేసి శ్రీప్రియ విడిగా హాస్టల్ లో జీవిస్తోందన్నారు. అయితే ఆమెపై మరింత కోపం పెంచుకున్న బాలమురుగన్ ఈ దారుణానికి పాల్పడ్డాడని స్పష్టం చేశారు.
Also Read: Parliament Winter Session 2025: సమావేశాలకు ముందే రచ్చ షురూ.. విపక్షాలపై విరుచుకుపడ్డ ప్రధాని!
హత్యపై రాజకీయ రగడ..
మరోవైపు శ్రీప్రియ హత్య కేసు ఘటన తమిళనాడులో రాజకీయ వివాదానికి దారి తీసింది. అధికార డీఎంకే (DMK) ప్రభుత్వంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. రాష్ట్రంలో మహిళలపై దాడులు, నేరాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. స్త్రీలను రక్షించడంలో సీఎం ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
