Parliament Winter Session 2025: నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సభల ప్రారంభానికి ముందు పార్లమెంటు ఆవరణలో ప్రధాని మోదీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ వింటర్ సెషన్ జరగాల్సిన తీరును వివరించారు. అదే సమయంలో విపక్ష పార్టీలను మోదీ టార్గెట్ చేశారు. బిహార్ లో ఎదురైన ఓటమి భయానికి ఈ సమావేశాలు కేంద్ర బిందువు కాకూడదని సూచించారు. పార్లమెంటులో ‘డ్రామా కాదు, డెలివరీ అవసరం’ అంటూ చురకలు అంటించారు.
‘కేవలం ఒక ఆచారం కాదు’
అంతకుముందు మీడియా సమావేశం ప్రారంభంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విలువలకు భారత్ కేంద్ర బిందువుగా ఉందని కొనియాడారు. శీతాకాల సమావేశం కేవలం ఒక ఆచారం కాదన్న మోదీ.. భారతదేశ ప్రజాస్వామ్యపు విలువలు అందులో ఇమిడి ఉన్నాయని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించే ఉల్లాసం, ఉత్సాహం దేశమంతా చూస్తున్నామని అన్నారు. వీటన్నింటిని చూస్తుంటే ప్రజాస్వామ్యంపై నమ్మకం మరింత బలపడుతోందని పేర్కొన్నారు.
‘విపక్షాలకు చిట్కా ఇస్తా’
మరోవైపు విపక్ష పార్టీలకు ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. వింటర్ సెషన్ సజావుగా సాగేందుకు, అర్థవంత చర్చలకు సహకరించాలని కోరారు. ఓటమి భయాలు చర్చలకు కారణం కాకూడదని అన్నారు. ప్రజాప్రతినిధులుగా దేశ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. బిహార్ ఎన్నికల్లో ఓటమిని కొన్ని పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని చురకలు అంటించారు. మరోవైపు సభలో ఏ విధంగా నడుచుకోవాలో విపక్షాలకు చిట్కాలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మోదీ అన్నారు. వింటర్ సెషన్ లో ఉభయ సభల పనితీరుకు విపక్షాలు ఆటంకం కలగకుండా వ్యవహరించాలని సూచించారు.
‘సభలో డ్రామాలు చేయవద్దు’
మరోవైపు ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై సానుకూల చర్చ జరుగుతుందని తాను ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ అన్నారు. తమ ప్రధాన లక్ష్యం దేశాభివృద్ధి మాత్రమేనని తేల్చి చెప్పారు. వికసిత్ భారత్ సాధించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్న మోదీ.. అందుకు అనుగుణంగా జరిగే చర్చలను స్వాగతిస్తామని అన్నారు. అంతేకాని చట్టసభల్లో డ్రామాలు చేయవద్దని ఘాటుగా సూచించారు. నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుగా నిలవొద్దని విజ్ఞప్తి చేశారు. దేశ ప్రగతి కోసం సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. దేశాభివృద్ధికి జరిగే ప్రయత్నంలో విపక్షాలను కలుపుకొని పోతామని మోదీ చెప్పుకొచ్చారు.
#ParliamentWinterSession | Delhi: PM Narendra Modi says, "…I urge all parties that the winter session should not become a battlefield for frustration caused by defeat, or an arena for arrogance after victory. As public representatives, we should handle the responsibility and… pic.twitter.com/k4uYlb6qij
— ANI (@ANI) December 1, 2025
Also Read: Samantha Wedding: మళ్లీ తెరపైకి సమంత పెళ్లి వ్యవహారం.. నేడు పెళ్లి అంటూ వార్త వైరల్.. రాజ్ మాజీ భార్య షేర్ చేసింది ఇదే..
సభ ముందుకు 10 కీలక బిల్లులు
ఇదిలా ఉంటే పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటి నుంచి ఈ నెల 19 వరకూ జరగనున్నాయి. మెుత్తం 10 బిల్లులను కేంద్రం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. అలాగే 4 ఆర్థిక సవరణ బిల్లులను సైతం సభ ముందు ఉంచనున్నారు. అదే సమయంలో 120 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. హోమ్ శాఖ, అణుశక్తి, విద్య, రహదారులకు చెందిన బిల్లులు.. ప్రభుత్వం ప్రవేశపెట్టే వాటిలో ఉండనున్నట్లు సమాచారం.
