AV Ranganath: ఎంత వర్షం పడినా హైడ్రా ఉందని గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు నిర్బయంగా విశ్వాసంతో ఉన్నారు. భారీ వర్షాలు పడినా వరదలు ముంచెత్తకుండా పకడ్బందీగా వరద నివారణ చర్యలు చేపట్టి హైడ్రా మరోసారి ప్రజల పట్ల తన బాధ్యతను నిర్వర్తించి ప్రజల నమ్మకాన్ని పొందింది. హైడ్రా అంటేనే ఓ భరసాగా ప్రజలు హైడ్రాను విశ్వసిస్తున్నారని హైడా కమిషనర్ రంగనాధ్ (AV Ranganath) అన్నారు. క్యాచ్‌పిట్లు, కల్వర్టులతో పాటు నాలాల్లో పూడిక తీసి వరద సాఫీగా సాగేలా మాన్సూన్ ఎమర్జెన్సీ, డిజాస్టర్ టీమ్ లను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అభినందించారు.
వర్షాకాలంలో పని చేసే మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్‌ల కాలపరిమితి 150 రోజులు పూర్తయిన సందర్భంగా జలవిహార్ లో ఏర్పాటు చేసిన అభినందన సభలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ 5 నెలల క్రితం ఇక్కడే సమావేశమై మాన్సూన్ విధుల గురించి వివరించామని, నిర్దేశించిన దానికంటే ఎక్కువ పని చేసి హైడ్రాతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చారని అభినందించారు. వర్షాల వేళ ముప్పు ప్రాంతాల్లో సేవలందిస్తూ ప్రజల ప్రశంసలు అందుకున్నారన్నారు. సమస్య పరిష్కారం వరకే పరిమితం కాకుండా, ఆ సమస్యకు కారణాలను కూడా తెలుసుకుని పని చేసిన తీరు అభినందనీయమన్నారు.
Also Read: AV Ranganath: బతుకమ్మకుంట బాగుందా? వాకర్లతో ముచ్చటించిన హైడ్రా కమిషనర్!
కుండపోత వాన కురిసినా
హైడ్రాలో భాగమైన డిజాస్టర్ రెస్పాన్స్ సిబ్బంది, ఎస్ ఎఫ్ ఓలు, మార్షల్స్‌తో కలసి మెట్ టీమ్‌లు ఎంతో నిబద్ధతతో పని చేశాయని కమిషనర్ అభినందించారు. ఇలా మూడు వేల లారీల పూడికను నాలాల నుంచి తొలగించి వరద సాఫీగా సాగేలా ఆహార్నిశలు పని చేసిన తీరును నగర ప్రజలు గమనించారన్నారు. వర్షాలు కురుస్తున్నపుడు వరద భయం లేకుండా నగర ప్రజలు ప్రయాణాలు సాఫీగా సాగించారు. కాలనీలు నీట మునగకుండా ముందస్తు జాగ్రత్తలో వరద ముప్పు లేకుండా చేశారంటూ హైడ్రా కమిషనర్ మెట్ టీమ్‌లను కొనియాడారు.
మెమొంటోలు అందజేసి సన్మానం
వాతావరణ పరిస్థితుల వల్ల క్లౌడ్‌బరస్ట్‌లు చాలాసార్లు సంభవించి, ఒకే రోజు 10 నుంచి 18 సెంటీమీటర్లు వర్షం పడిన సందర్భాలున్నాయని, కానీ మీరంతా మనసుపెట్టి పని చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో నిరూపించారన్నారు. అందుకే ఒక్క అభినందన సమావేశంలా కాకుండా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలకు అన్ని విధాల ఎదిగేలా వ్యక్తిత్వ వికాసానికి కూడా హైడ్రా ప్రయత్నించిందన్నారు. ఈ క్రమంలోనే ఆర్థిక క్రమశిక్షణ, సరైన జీవన విధానాలను అలవర్చుకునే విధంగా వ్యక్తిత్వ వికాస తరగతులు కూడా నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా వ్యక్తిత్వ, ఆర్థిక వికాస నిపుణులు వంగా రాజేంద్రప్రసాద్, ఎం. నర్సింగ్, చిల్లంచెట్టి గణేష్‌లను హైడ్రా కమిషనర్ మెమొంటోలు అందజేసి సన్మానించారు.
30 మందికి అవార్డులు
మాన్సూన్ ఎమర్జన్సీ టీమ్ (ఎంఈటీ)లలో ఉత్తమ విధులు నిర్వర్తించిన 30 మందికి ప్రశంసాపత్రం, బహుమతిని హైడ్రా కమిషనర్ (Hydra Commissioner) అందజేశారు. శాలువతో సన్మానించారు. నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఊళ్ల నుంచి వచ్చిన వారు ఈ వర్షాకాలం ఎంఈటీలో భాగస్వాములై గొప్ప సేవలందించారని, నిబద్ధతతో పని చేశారని కమిషనర్ కొనియాడారు. ఈ ఏడాది ఎంతో అనుభవం గడించామని, వచ్చే ఏడాది మరింత సమర్థవంతంగా వర్షాకాలం పని చేసేందుకు ఈ అనుభవం ఎంతో దోహదం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇందుకు గల కారణాలు ఏంటీ?
భారీ వర్షాలు పడితే ఏ ప్రాంతాలు నీట మునుగుతాయి? ఇందుకు గల కారణాలు ఏంటీ? ఇలా అన్నిటిపైనా మెట్ టీమ్‌లతో పాటు డీఆర్ఎఫ్, ఎస్ ఎఫ్‌వోలకు స్పష్టమైన అవగాహన ఇప్పటికే వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే అమీర్‌పేటలో నాలాలను పూడిక తీసి వరద ముప్పు తప్పించామని, అలాగే ప్యాట్నీ నాలా ఆక్రమణలను తొలగించి 25 కాలనీలు, బస్తీలకు వరద ముప్పు లేకుండా చేశామని ఆయన గుర్తు చేశారు. ఇలా ఎన్నో విజయాలు సాధించామన్నారు. ఈ వర్షాకాలంలో హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు, ఎస్ ఎఫ్‌వోలు పని చేసిన తీరును హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య వివరించారు. పొదుపు ఆవశ్యకతతో పాటు ఆరోగ్య పరిరక్షణ గురించి హైడ్రా అడ్మిన్ ఎస్పీ ఆర్. సుదర్శన్ పలు సూచనలు చేశారు. ముఖ్యమైన పండగలున్నా సెలవులు పెట్టకుండా వర్షాకాలంలో పని చేశారని అభినందించారు.
Also Read: AV Ranganath: చెరువుల పూర్తి స్థాయి పునరుద్దరణే అసలైన పరిరక్షణ : హైడ్రా కమిషనర్ రంగనాధ్

