India – Pak: అయోధ్య రామమందిరంలో ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొని గర్భగుడి శిఖరంపై కాషాయ రంగును ఎగురవేశారు. అయితే ఇలా చేయడంపై పాక్ తన అక్కసును వెళ్లగక్కింది. ముస్లింల వారసత్వాన్ని చెరిపేసేందుకు జరిగిన కుట్రగా అభివర్ణించింది. పాక్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండిపడింది. తనదైన శైలిలో పాక్ కు చురకలు అంటించింది.
మీరా నీతులు చెప్పేది..
పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంక శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Randhir Jaiswal) స్పందించారు. ‘పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలను మేము గమనించాము. వాటిని పూర్తిగా ఖండిస్తున్నాం. విద్వేషం, అణచివేత, మైనారిటీల పట్ల దురహంకారం ప్రదర్శించే దేశంగా ఉంటూ ఇతరులకు నీతి వాక్యాలు బోధించే నైతిక హక్కు పాక్ లేదు. మీ దేశంలో దారుణంగా ఉన్న మానవ హక్కుల ఉల్లంఘనలపై మెుదట మీరు దృష్టి సారించండి. ఇది మీకు మేలు చేస్తుంది’ అని జైస్వాల్ చురకలు అంటించారు.
పాక్ ఏమన్నదంటే?
అంతకుముందు అయోధ్యలోని రామాలయంపై కాషాయ జెండా ఎగురవేయడాన్ని పాక్ తీవ్రంగా తప్పుబట్టింది. భారత్ లోని మైనారిటీ సముదాయలను ఆందోళనకు గురిచేసే ప్రయత్నంగా దీనిని అభివర్ణించింది. ముస్లింల వారసత్వాన్ని చెరిపేసేందుకు జరుగుతున్న కుట్ర అంటూ ఆరోపించింది. 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదును కూల్చివేసిన అంశాన్ని ఈ సందర్భంగా పాక్ లేవనెత్తింది. తద్వారా భారత్ లోని ముస్లింలను రెచ్చగొట్టాలని కుయుక్తులు పన్నింది.
అయోధ్య ఆలయం గురించి..
1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేశారు. దీనిపై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు కొనసాగగా.. 2019లో హిందువుల పక్షాన తీర్పు వెలువడింది. ఈ తీర్పు వచ్చిన ఏడాది తర్వాత 2020లో రామమందిరం నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. నాలుగేళ్ల తర్వాత గతేడాది ఆలయంలో విగ్రహ ప్రతిష్ట చేశారు. తాజాగా మంగళవారం 22 అడుగుల ఎత్తైన కాషాయరంగు జెండాను ఆలయంలో ఎగురవేసి.. రామాలయ నిర్మాణ ప్రక్రియను పూర్తి చేశారు.
Also Read: Hydra: ‘చెరువుల పునరుద్ధరణ అద్భుతం’.. హైడ్రాపై కర్ణాటక బృందం ప్రశంసలు
500 ఏళ్ల సంకల్పం..
కాషాయ జెండాను ఎగురువేసిన అనంతరం ప్రధాని మోదీ (PM Modi) దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 500 ఏళ్ల భారతీయుల సంకల్పం నెరవేరిందని అన్నారు. యావత్ దేశం రామమయంగా మారిపోయిందని పేర్కొన్నారు. మరోవైపు ధర్మ ద్వజంగా పిలువబడుతున్న కాషాయ జెండాలో మూడు పవిత్ర చిహ్నాలను పొందుపరిచారు. జెండాలోని ఓం, సూర్యుడు, కోవిదర వృక్షం చిహ్నాలను ఏర్పాటు చేశారు. భారతీయ సనాతన ధర్మంలో పాతుకుపోయిన లోతైన ఆధ్యాత్మిక విలువలకు ఇవి అద్దం పడుతున్నాయి.

