Shalibanda Fire Accident: షాకింగ్ నిజాలు వెలుగులోకి..!
Shalibanda Fire Accident (Image Source: Twitter)
హైదరాబాద్

Shalibanda Fire Accident: గోమతి ఎలక్ట్రానిక్స్‌ అగ్నిప్రమాదం.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

Shalibanda Fire Accident: హైదరాబాద్ పాతబస్తీలోని శాలిబండ ప్రాంతంలో గల గోమతి ఎలక్ట్రానిక్స్​ షోరూంలో జరిగిన అగ్నిప్రమాదంపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. షార్ట్​ సర్క్యూట్​ కారణంగా దుర్ఘటన జరిగిందా? ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం ప్రమాద స్థలానికి వచ్చిన క్లూస్ టీం సిబ్బంది పలు ఆధారాలను సేకరించారు. హైదరాబాద్ జాయింట్ కమిషనర్ తఫ్సీర్​ ఇక్భాల్ మీడియాతో మాట్లాడుతూ ప్రమాదానికి కారణాలు ఏమిటన్నది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమన్నారు. ఇప్పటివరకు జరిపిన విచారణలో షార్ట్​ సర్క్యూట్​ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోందన్నారు. క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారని, వాటిని విశ్లేషించిన తరువాతే అసలు జరిగిందేమిటి? అన్నది స్పష్టం కాగలదన్నారు.

సరిగ్గా రాత్రి 10.24గంటలకు…

చార్మినార్​ నుంచి ఆలియాబాద్ వెళ్లే రోడ్డులోని శాలిబండ ప్రాంతంలో కొన్నేళ్లుగా గోమతి ఎలక్ట్రానిక్స్​ షోరూం నడుస్తోంది. అత్తాపూర్​ వాస్తవ్యుడైన శివకుమార బన్సల్​ (49) దీని యజమాని. షాపులో పని చేస్తున్న ఎనిమిది మందిలో ఆరుగురు ఇళ్లకు వెళ్లిపోగా గణేశ్, కార్తిక్​ లు షాపు వెనక వైపు ఉన్న షట్టర్​ దగ్గర నిలబడి ఉన్నారు. ఇక, కౌంటర్​ లో కూర్చోని ఉన్న శివకుమార్ బన్సల్ మెట్రో రైలు నిర్మాణం నేపథ్యంలో అందిన డెమాలిషన్ నోటీస్​ ను చూస్తున్నారు. అప్పుడు సమయం రాత్రి 10.25 గంటలవుతోంది. సరిగ్గా అదే సమయంలో షాపు లోపలి వైపు నుంచి పేలుడు శబ్ధం వినిపించింది. ఏం జరిగిందా? అని ఆలోచిస్తుండగానే కొన్ని నిమిషాల తేడాలో మరో రెండు పేలుళ్లు జరిగాయి.

అగ్నికీలల్లో చిక్కుకొని..

పేలుడు అనంతరం దుకాణంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అగ్నికీలల్లో చిక్కుకుని శివకుమార్​ బన్సల్ తోపాటు షాపులో పని చేస్తున్న గణేశ్​, కార్తిక్​ లకు గాయపడ్డారు. కాగా, పేలుళ్ల ధాటికి షాపు ముందు నుంచి బైక్ పై వెళుతున్న భార్యాభర్తలు అజ్మీన్ బేగం, మహ్మద్​ జావేద్​ లు గాయపడ్డారు. వీరితోపాటు షేక్​ అహమద్​, సయ్యద్​ సాబేర్ లకు కూడా గాయాలయ్యాయి. దారిన వెళుతున్న మరో ఇద్దరికి కూడా స్వల్ప గాయాలైనట్టు తెలిసింది.

పల్టీ కొట్టిన కారు..

గోమతి ఎలక్ట్రానిక్స్​ షాపులో పేలుళ్లు జరిగినపుడు ఉబేర్​ సంస్థలో క్యాబ్ డ్రైవర్​ గా ఉన్న మణికంఠ అదే దారిన వెళుతున్నాడు. పేలుళ్ల ధాటికి కారు ఓ పక్కకు పల్టీ కొట్టింది. అందులో చిక్కుకుపోయిన మణికంఠ ముందు వైపు ఉన్న అద్దాలను పగులగొట్టుకుని మణికంఠ బయటకు వచ్చాడు. ఆ వెంటనే మంటలు వ్యాపించటంతో కారు కూడా అగ్నికి ఆహుతయ్యింది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే కారులో సీఎన్జీ సిలిండర్ ఉన్నా అది పేలక పోవటం. అది కూడా పేలి ఉంటే మరింత విధ్వంసం జరిగి ఉండేది.

ముక్కలైన షట్టర్లు..

షాపు మూసివేసే సమయం కావటంతో గోమతి ఎలక్ట్రానిక్స్​ లో ఉన్న సిబ్బంది షట్టర్లను సగం వరకు కిందకు దించి పెట్టారు. పేలుళ్ల ధాటికి షట్టర్లు ముక్కలు ముక్కలయ్యాయి. వీటిలో కొన్ని ముక్కలు దాదాపు 70 అడుగుల దూరంలో పడ్డాయి. ఇక, షాపు ముందు పార్క్ చేసి ఉన్న హోండా యాక్టీవాతోపాటు మరో బైక్​ కూడా ప్రమాదంలో దగ్ధమయ్యాయి. రెండు కార్లు కూడా పాక్షికంగా దెబ్బ తిన్నాయి. ఈ రెండు కార్లు గోమతి ఎలక్ట్రానిక్స్​ దుకాణానికి దాదాపు 70 అడుగుల దూరంలో పార్క్ చేసి ఉండటం గమనార్హం.

ఘటనలో ఒకరు మృతి..

పేలుళ్లు జరిగినపుడు షాపు ముందు నుంచి దాదాపు 55 సంవత్సరాల వయసున్న వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్నాడు. పేలుళ్ల ధాటికి ఎగిరి రోడ్డుకు అవతలి వైపు పడ్డ ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. షాపులోని ఎలక్ట్రానిక్ పరికరాలు ముక్కలు ముక్కలై పోగా కొన్ని విడిభాగాలు విసురుగా వచ్చి రోడ్డుపై పడ్డాయి. పక్కనే ఉన్న మరో దుకాణానికి.. గోమతి ఎలక్ట్రానిక్స్​ లో ఎగిసిన మంటలు షాపు వెనక వైపు ఉన్న గోడౌన్ తోపాటు పక్కనే ఉన్న లక్ష్మీ దుస్తుల షారూంకు కూడా వ్యాపించాయి. దాంతో దుకాణంలోని దుస్తులు కాలి బూడిదయ్యాయి. దాని పక్కనే ఓ జువెలరీ షాపు ఉంది. ప్రమాదం గురించి తెలియగానే హుటాహుటిన షాపు వద్దకు వచ్చిన దాని యజమాని విలువైన సొత్తును బయటకు తీసుకెళ్లాడు.

దెబ్బ తిన్న క్లాక్​ టవర్​..

గోమతి ఎలక్ట్రానిక్స్​ షోరూంలో జరిగిన పేలుళ్లతో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శాలిబండ క్లాక్​ టవర్​ దెబ్బతిన్నది. దీనిపై ఉన్న గడియారం రాత్రి 10.24గంటల సమయం వద్ద ఆగిపోయింది. పేలుళ్ల ధాటికి రోడ్డుకు మరోవైపు ఉన్న మరో గోమతి ఎలక్ట్రానిక్స్​ దుకాణం మొదటి అంతస్తులోని బాల్కనీతోపాటు చుట్టుపక్కల ఉన్న కొన్ని ఇళ్లల్లో కిటికీల ఆద్దాలు ధ్వంసమయ్యాయి. కొన్నిళ్లల్లో అయితే గిన్నెలు కింద పడిపోయాయి. ఇక, ప్రమాదానికి గురైన షోరూం నడుస్తున్న రెండంతస్తుల భవనం పూర్తిగా దెబ్బతిన్నది. స్థానికుల ద్వారా సమాచారం అందగానే ముందుగా అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో ప్రమాద స్థలానికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అంతకంతకు ఎగిసి పడటంతో మరో ఎనిమిది ఫైరింజన్లను రప్పించారు. కొన్ని గంటలపాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

అదృష్టవశాత్తు బతికి బయటపడ్డా..

జరిగిన ప్రమాదం నుంచి రెప్పపాటులో మృత్యువు నుంచి తప్పించుకున్న క్యాబ్​ డ్రైవర్ మణికంఠ మాట్లాడారు. గోమతి ఎలక్ట్రానిక్స్​ ముందుకు రాగానే చెవులు చిల్లులు పడే శబ్ధంతో పేలుడు జరిగిందన్నారు. ఆ వెంటనే తన కారు ఓ పక్కకు పల్టీ కొట్టిందని చెప్పారు. ముందు వైపు ఉన్న అద్దం పగులగొట్టి తాను బయటపడ్డట్టు తెలిపాడు. ఆ వెంటనే కారు కూడా మంటలకు ఆహుతైపోయిందన్నాడు. కారులోని సీఎన్​జీ సిలిండర్​ పేలలేదని తెలియచేశాడు.

Also Read: T20 World Cup Schedule: భారత్-పాకిస్థాన్ మధ్య మరో మ్యాచ్.. తేదీ ఖరారు.. టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

ఆధారాలు సేకరించిన క్లూస్ టీం…

ప్రమాద స్థలం నుంచి మంగళవారం క్లూస్ టీం సిబ్బంది పలు ఆధారాలను సేకరించారు. జాయింట్​ కమిషనర్ తఫ్సీర్​ ఇక్భాల్​ తోపాటు సౌత్ జోన్​ డీసీపీ దుర్ఘటనా స్థలాన్ని సందర్శించారు. అగ్నిమాపక శాఖకు చెందిన అధికారులు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. జరిగిన సంఘటనపై మొఘల్ పురా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాయింట్ సీపీ తఫ్సీర్​ ఇక్భాల్ మాట్లాడుతూ ప్రమాదానికి నిర్ధిష్ట కారణాలు ఏమిటన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. ఆధారాలను విశ్లేషించిన తరువాత చెప్పగలమన్నారు. ఇప్పటివరకైతే షార్ట్​ సర్క్యూట్​ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నామన్నారు.

Also Read: AP New Districts: ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు.. 5 రెవెన్యూ డివిజన్లు.. సీఎం చంద్రబాబు పచ్చజెండా

Just In

01

Chamal Kiran Kumar Reddy: ట్రిపుల్ఆర్ మూసీ రీజువెనేషన్ కు కేంద్రం సహకరించాలి : ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!