Kabaddi World Cup 2025: భారత మహిళల కబడ్డీ జట్టు మరోసారి విశ్వవిజేతగా అవతరించింది. వరుసగా రెండోసారి ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్‌ను ముద్దాడింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ జట్టుని భారత అమ్మాయిలు మట్టికరిపించారు. స్కోర్ భారత్-35, చైనీస్ తైపీ-28గా నమోదవ్వడంతో భారత అమ్మాయి 7 పాయింట్ల తేడాతో గెలిచారు. చైనీస్ తైపీ క్రీడాకారిణులు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, భారత రైడర్లు, డిఫెండర్లు వ్యూహాత్మకంగా ఆడి, చివరికి ఏడు పాయింట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. కెప్టెన్ రీతూ నేకి నాయకత్వంలో జట్టు అద్భుతమైన సమన్వయంతో ఆడింది. తొలి సగంలో బలమైన డిఫెన్స్, వేగవంతమైన రైడింగ్ కాంబినేషన్లతో స్వల్ప ఆధిక్యం సాధించినప్పటికీ, రెండో సగంలో దూకుడు పెంచి ఆడారు.
టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారిణి
చైనీస్ తైపీకి కోలుకునే అవకాశం ఇవ్వకుండా విజయాన్ని సాధించారు. కెప్టెన్ రీతూ నేగి, వైస్ కెప్టెన్ పుష్పా రాణా జట్టుని అద్భుతంగా ముందుకునడిపారు. పుష్పా రాణా తన వేగవంతమైన రైడింగ్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టింది. టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారిణి సంజు దేవి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా ఎంపికైంది. కాగా, ఈ టోర్నమెంట్ అసాంతం భారత మహిళల జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. మొత్తం టోర్నమెంట్‌లో అజేయంగా నిలిచి భారత్ ఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్ దశలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి గ్రూప్-ఏ టేబుల్ టాపర్‌గా నిలిచింది. సెమీఫైనల్‌లో పటిష్టమైన ఇరాన్ జట్టును కూడా భారత అమ్మాయిలు మట్టికరిపించారు. భారత్ 33–21 ఇరాన్ పాయింట్ల తేడాతో స్పష్టమైన ఆధిపత్యం చెలాయించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. కాగా, మహిళ కబడ్డీ వరల్డ్ కప్-2025లో భారత్, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, చైనీస్ తైపీ, ఇరాన్ సహా మొత్తం 11 దేశాలు పాల్గొన్నాయి.
దేశానికి గర్వకారణం : ప్రధాని మోదీ
ఉమెన్స్ కబడ్డీ ప్రపంచకప్ 2025 గెలిచిన భారత జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ‘‘దేశానికి గర్వకారణంగా నిలిచిన మన భారత మహిళా కబడ్డీ జట్టుకు నా అభినందనలు!. ప్లేయర్లు అద్భుతమైన ధైర్యం, నైపుణ్యాలు, అంకితభావాన్ని ప్రదర్శించారు. వారి విజయం అసంఖ్యాకమైన యువతకు కబడ్డీని ఒక ప్రొఫెషన్‌గా ఎంచుకోవడానికి, పెద్ద కలలు కనడానికి, ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి స్ఫూర్తినిస్తుంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
