Smriti Mandhana: భారత క్రికెటర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్న సమయంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ మంధాన ఆదివారం ఉదయం ఆకస్మికంగా గుండెపోటుకు గురయ్యారు. సంగ్లీ సమీపంలోని సమ్దోల్ ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న వివాహ ఏర్పాట్ల మధ్య ఈ ఘటన జరిగిందని ఆమె బిజినెస్ మేనేజర్ తుహిన్ మిశ్రా వెల్లడించారు.
గుండెపోటు వచ్చిన వెంటనే ఆయనను సంగ్లీ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి నియంత్రణలో ఉన్నప్పటికీ వైద్యులు ఆయనను క్లోజ్ మానిటరింగ్‌లో ఉంచారు. సంఘటన జరిగిన వెంటనే స్మృతి సహా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని ఆయన పక్కనే ఉన్నారు.
తుహిన్ మిశ్రా తాజా అప్‌డేట్‌లో, “స్మృతి తండ్రి బ్రేక్‌ఫాస్ట్ సమయంలో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం ఆయన పరిశీలనలో ఉన్నారు. ఈ కారణంగా, స్మృతి కోరిక మేరకు వివాహాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ సమయంలో కుటుంబ ప్రైవసీకి గౌరవం ఇవ్వాలి,” అని తెలిపారు.
Also Read: Mandhana Wedding: సంగీత్‌లో రొమాంటిక్ డ్యాన్స్‌తో అదరగొడుతున్న స్మృతి మంధానా, పలాష్ ముచ్చల్..
గత కొన్ని రోజులుగా స్మృతి–పలాష్ వివాహం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. 2019 నుంచి ఈ జంట కలిసి ఉన్నట్లు సమాచారం. నవంబర్ 23న వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతుండగా, పలాష్ ముచ్చల్ డీవై పాటిల్ స్టేడియంలో మోకాళ్లపై కూర్చొని పూలు, డైమండ్ రింగ్‌తో చేసిన ప్రపోజల్ వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. తండ్రి ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగించినప్పటికీ, ఆయన త్వరగా కోలుకోవాలన్న ఆశతో వివాహాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కుటుంబం స్పష్టం చేసింది.

