Panchayat Elections: ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నది. దీంతో గ్రామ పంచాయతీల్లో కోలాహలం మొదలైంది. ఎవరు పోటీచేయాలనేదానిపై పార్టీల గ్రామ కమిటీలు భేటీలు నిర్వహిస్తున్నాయి. ప్రజల్లో ఎవరికి మంచి పేరుంది.. ఎవరిని పోటీ చేయిస్తే గెలుస్తామని అభిప్రాయాలు సేకరిస్తున్నారు. గ్రామానికి రిజర్వేషన్ ఏం వస్తే ఎవరిని నిలబెట్టాలనే దానిపైనా కసరత్తు స్టార్ట్ చేశారు. ఒక్కో కులం నుంచి ఇద్దరు ముగ్గురు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వారందరి నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. వారిలో ఒకరిని బెస్ట్ అనుకున్న తర్వాత ఎంపిక చేసి నియోజకవర్గం నేతలకు, జిల్లా పార్టీ కమిటీకి పంపించనున్నట్లు సమాచారం.
ఒక్క ఛాన్స్ అంటూ…
సర్పంచ్‌గా పోటీ చేసి తన కళను నెరవేర్చుకోవాలని ఏళ్ల తరబడి గ్రామాల్లో ఎదురుచూస్తున్న నేతలు ఉన్నారు. అయితే, ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించింది. సర్పంచ్ ఎన్నికలకు రిజర్వేషన్లు సైతం చేయాలని ప్రభుత్వం జీవో సైతం జారీ చేయడంతో తమ కళను నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. గ్రామ కమిటీలతో కొందరు.. మరికొందరు నేరుగా స్థానిక ఎమ్మెల్యే గానీ, మాజీ ఎమ్మెల్యే గానీ, ఇతర ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. వారికి విజ్ఞప్తులు చేస్తున్నట్లు తెలిసింది. తనకు అవకాశం కల్పిస్తే గెలుస్తానని.. పార్టీని సైతం బలోపేతం చేస్తానని, ప్రభుత్వ పథకాలు సైతం గ్రామానికి అందేలా కృషిచేస్తానని పేర్కొంటున్నట్లు సమాచారం. ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు తెలిసింది.
Also Read: Panchayat Elections: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే తేదీ అదేనా?
ఎవరు పోటీ చేయించాలనేదానిపై ఆరా
గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించబోతుందనేగానే గ్రామ పార్టీల అధ్యక్షుల ఇళ్లలో భేటీలు షురూ చేశారు. మధ్య రాత్రి వరకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థులతో పాటు గ్రామ పంచాయతీ వార్డుల్లోనూ ఎవరిని పోటీ చేయించాలనేదానిపై ఆరా తీస్తున్నారు. నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. అంతేకాదు ఎప్పటికప్పుడు నియోజకవర్గ పార్టీ నేతలకు సైతం సమాచారం అందజేయాలని పార్టీ సూచించినట్లు సమాచారం. ఇప్పటికే మెజార్టీ సీట్లపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. గ్రామస్థాయిలో బలనిరూపణ చేసుకుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు దోహదపడతాయని పార్టీలు భావిస్తున్నాయి. అందుకోసం గ్రామాలపై దృష్టిసారించాయి.
ఒక్కో క్యాస్ట్ నుంచి ముగ్గురు, నలుగురి పేర్లు
ఇంతకు ముందు ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, ఎస్సీ, ఎస్టీలకు గత రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించింది. అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు సిద్ధం చేసింది. రిజర్వేషన్లను సైతం గ్రామం, మండలాల, జెడ్పీ స్థానాల వరకు ప్రకటించింది. అయితే, ఈ రిజర్వేషన్లు 50శాతం దాటడంతో కోర్టు తీర్పు ప్రకారం వాయిదా వేసింది. అయితే, తిరిగి బీసీ డెడికేషన్ కమిషన్ 50 శాతం లోబడి రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలుపై నివేదిక ఇవ్వడం, దానికి క్యాబినెట్ ఆమోదించింది. దీంతో మళ్లీ సర్పంచ్, వార్డుల వారీగా రిజర్వేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం జీవో జారీ చేయడంతో ఏ గ్రామంలో ఏ రిజర్వేషన్ అవుతుందోనని నేతల్లో సైతం ఉత్కంఠ నెలకొంది. అందుకోసమే గ్రామ కమిటీల్లో ఒక్కో క్యాస్ట్ నుంచి ముగ్గురు, నలుగురి పేర్లను తీసుకుంటున్నట్లు సమాచారం. రిజర్వేషన్లు తేలిన తర్వాత గ్రామంలో అభ్యర్థులపై క్లారిటీ రానున్నట్లు సమాచారం. ఏది ఏకమైనప్పటికీ పంచాయతీ ఎన్నికల నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేయడంతో గ్రామాల్లో మాత్రం కోలాహలం మొదలైంది.
Also Read: Panchayat elections: కుటుంబ ఓట్లు ఇతర వార్డుల్లో ఉంటే మార్పు చేర్పులు
