Automobile Facts: మన దేశంలోని రద్దీ రహదారులపై దూసుకుపోతూ, బిజీ వీధుల్లో సులభంగా ప్రయాణించే ఆటో రిక్షాలు మన రోజువారీ జీవన విధానంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, కార్లలా నాలుగు చక్రాలు కాకుండా, ఆటో రిక్షాలకు ఎందుకు మూడు చక్రాలే ఉంటాయన్న ఈ ప్రశ్నకు నిపుణులు ఇచ్చిన వివరణ ఆసక్తికరంగా ఉంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
తక్కువ తయారీ ఖర్చు
నాలుగో చక్రం జతచేస్తే వాహనం బరువు పెరగడం తయారీ ఖర్చు కూడా భారీగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మూడు చక్రాల డిజైన్ వాహనాన్ని తేలికగా ఉంచడం వల్ల తయారీ వ్యయం తగ్గుతుంది. దీని వలన ఆటో రిక్షాలు డ్రైవర్లు కొనుగోలు చేయగలిగేంతగా అందుబాటులో ఉంటాయి. భారతదేశం వంటి దేశాల్లో ఇది ఎంతో ముఖ్యమైన అంశం.
ట్రాఫిక్‌లో చాకచక్యంగా నడపగలిగే సామర్థ్యం
మూడు చక్రాలు ఉండడం వల్ల ఆటో రిక్షాలు రద్దీ వీధుల్లో మరింత చురుకుగా నడుస్తాయి. ముఖ్యంగా, ముందు ఒకే చక్రం ఉండటం వల్ల వాహనం మలుపుల సమయంలో తేలికగా తిరుగుతుంది. ట్రాఫిక్‌లోనూ, వీధుల్లోనూ డ్రైవర్లు సులభంగా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది.
ఇంధన పొదుపు
మూడే చక్రాల కారణంగా వాహనం బరువు తక్కువగా ఉంటుంది. బరువు తక్కువగా ఉండటం ఇంజిన్‌పై లోడ్ తగ్గించి, ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది. రోజంతా వాహనాన్ని నడుపే డ్రైవర్లకు ఇది పెద్ద ఆర్థిక లాభంగా మారుతుంది. నాలుగు చక్రాల వాహనాలతో పోలిస్తే మూడుచక్రాల ఆటోలు తక్కువ ఇంధనంతో ఎక్కువ ప్రయాణం చేయగలవు.
సులభమైన మెయింటెనెన్స్
మూడు చక్రాలే ఉండటం వల్ల టైర్లు కూడా తక్కువ అవుతాయి. దాంతో మెయింటెనెన్స్ ఖర్చులు కూడా చాలా తగ్గిపోతాయి. సస్పెన్షన్‌పై కూడా ఎక్కువగా ఒత్తిడి పడదు కాబట్టి వాహనం ఎక్కువకాలం బాగా పనిచేస్తుంది. రోజూ ఆటో నడిపే డ్రైవర్లు, చిన్న వ్యాపారులకి ఇది పెద్ద సాయం.
సేఫ్టీ & స్టబిలిటీ
మూడు చక్రాలు కాబట్టి కొంచెం స్టబిలిటీ తక్కువగా ఉంటుందనిపించినా, ఆటోలను తక్కువ స్పీడ్‌కు, చిన్న దూరాలకు అనుకూలంగా డిజైన్ చేశారు. బరువు సరిగ్గా పెట్టడం, స్పీడ్ పరిమితులు ఉండటం వల్ల నగర రోడ్లపై ఇవి సేఫ్‌గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
పట్టణ రవాణాలో కీలక పాత్ర
ఖర్చు తక్కువ, ఇంధన పొదుపు, చురుకైన రైడింగ్. ఈ అన్ని కారణాల వల్ల మూడు చక్రాల ఆటోలు నగరాల్లో చాలా నమ్మకమైన ట్రాన్స్‌పోర్ట్‌గా మారాయి. అందుకే భారత్‌లోనే కాకుండా, మరెంతో దేశాల్లో కూడా ఆటోలు సాధారణంగా కనిపిస్తాయి.

