G20 Summit – PM Modi: దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 దేశాల 20వ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ 4 కీలక ప్రతిపాదనలను సభ్య దేశాలకు చేశారు. గ్లోబల్ ట్రెడిషనల్ నాలేడ్ రిపోజిటరీ (Global Traditional Knowledge Repository), ఆఫ్రికా స్కిల్స్ మల్టీప్లయర్ ఇన్షియేటివ్ (Africa Skills Multiplier Initiative), గ్లోబల్ హెల్త్ కేర్ రెస్పాన్స్ టీమ్ (Global Healthcare Response Team), డ్రగ్ – టెర్రర్ నెక్సస్ ఎదుర్కొవడం (Countering the Drug-Terror Nexus)పై జీ20 దేశాలు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. స్థిరమైన, సమ్మిళిత అభివృద్ధికి ఈ నాలుగు కార్యక్రమాలు దోహదం చేస్తాయని మోదీ అన్నారు.
‘ఆఫ్రికా అభివృద్ధికి కృషి చేద్దాం’
‘గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీ’ ద్వారా సంప్రదాయ జ్ఞానాన్ని, శతాబ్దాలుగా ఆచరణలో ఉన్న సుస్థిర జీవన విధానాలను ఆకలింపు చేసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఇది భవిష్యత్ తరాలకు ఆరోగ్యం, శ్రేయస్సుతో పాటు జ్ఞానాన్ని సైతం అందిస్తుందని జీ20 ప్రసంగంలో పేర్కొన్నారు. మరోవైపు దక్షిణాఫ్రికాలో జరుగుతున్న తొలి జీ20 సమావేశం కావడంతో ఆ దేశ అభివృద్ధికి సభ్య దేశాలు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఆఫ్రికా అభివృద్ధి ప్రపంచ ప్రగతికి చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఆఫ్రికా ఖండంతో భారత్ ఎల్లప్పుడూ సత్సంబంధాలను కలిగి ఉందని అన్నారు. ‘ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లయర్ ఇనిషియేటివ్’ ద్వారా వచ్చే దశాబ్దం నాటికి ఆఫ్రికాలో ఒక మిలియన్ సర్టిఫైడ్ ట్రైనర్లను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.
మహమ్మారులను తట్టుకునేలా..
మరో ప్రతిపాదనగా ‘G20 గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్’ ఏర్పాటు చేయాలని మోదీ సూచించారు. ఇది ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన అందించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, సహజ విపత్తుల సమయంలో కలిసికట్టుగా పనిచేస్తేనే మనం బలంగా నిలబడగలం. ఆరోగ్య సంక్షోభం లేదా సహజ విపత్తుల సమయంలో తక్షణ సేవలకు సిద్ధంగా ఉండేలా G20 దేశాల వైద్య నిపుణులతో కూడిన బృందాలు ఉండాలి’ అని మోదీ అన్నారు.
Also Read: Koratla MLA: ఇందిరమ్మ ఇండ్లకు డబ్బు అడిగితే.. రోకలి బండతో కొట్టండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే
‘ఆర్థిక మూలాలు దెబ్బతీద్దాం’
అంతే కాకుండా డ్రగ్ – టెర్రర్ ముప్పు ఎదుర్కొనే కార్యక్రమంను సైతం చేపట్టాలని జీ-20 సదస్సులో ప్రధాని మోదీ ప్రతిపాదించారు. మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టి, ఫెంటనిల్ వంటి ప్రమాదకర పదార్థాల వ్యాప్తిని నిరోధించాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్, ఉగ్రవాదానికి సంబంధించిన ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ప్రధాని మోదీ సూచించారు. వాటి ఆర్థిక వనరులను దెబ్బతీయడం ద్వారా డ్రగ్స్, ఉగ్రవాద వ్యవస్థలను బలహీన పరచవచ్చని అభిప్రాయపడ్డారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిర్వీర్యం చేయడం, అక్రమ డబ్బు ప్రవాహాలను అడ్డుకోవడం మరింత ముఖ్యమని పేర్కొన్నారు.
Spoke at the first session of the G20 Summit in Johannesburg, South Africa, which focussed on inclusive and sustainable growth. With Africa hosting the G20 Summit for the first time, NOW is the right moment for us to revisit our development parameters and focus on growth that is… pic.twitter.com/AxHki7WegR
— Narendra Modi (@narendramodi) November 22, 2025
