Prashant Kishor: ఇటీవలే జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన సురాజ్ పార్టీ చతికిలపడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 243 సీట్లు ఉండగా, అన్నింటిలోనూ జన సురాజ్ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. కానీ, ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవలేదు. కనీసం ప్రశాంత్ కిశోర్ కూడా విజయం సాధించలేదు. అస్సలు ఏమాత్రం ఊహించని ఈ పరాభవం నుంచి ప్రశాంత్ కిశోర్ ఇప్పుడిప్పుడు కోలుకుంటున్నారు. భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన కీలక ప్రకటన చేశారు.
ఎన్నికల్లో తన పార్టీ ఓటమి పాలైనప్పటికీ, పార్టీ తరపున తాను చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇందుకోసం, బీహార్ నవనిర్మాణ్ సంకల్ప్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానని, రాబోయే ఐదేళ్లలో తాను సంపాదించిన దానిలో కనీసం 90 శాతం మొత్తాన్ని జన సూరాజ్ నిర్వహించే ఈ కార్యక్రమానికి విరాళంగా ఇస్తానని ప్రకటించారు. బీహార్ ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. తన కుటుంబం కోసం ఢిల్లీలో కొనుక్కున్న ఒక ఇంటిని మినహా, గత 20 ఏళ్లలో సంపాదించిన తన ఆస్తులన్నింటినీ ఈ కార్యక్రమానికి విరాళంగా ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. డబ్బు లేకపోవడంతో ఈ కార్యక్రమం ఆగిపోదని, బీహార్ ప్రజలు కూడా జన సూరాజ్ పార్టీకి కనీసం రూ.1,000 చొప్పున విరాళం ఇవ్వాలని ఆయన కోరారు.
Read Also- DGP Shivadhar Reddy: బాక్సర్ నిఖత జరీన్‌పై తెలంగాణ డీజీపీ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?
బీహార్ ఎన్నికల్లో జన సురాజ్ పార్టీకి ఇలాంటి ఫలితాలు ఎదురవుతాయని తాను అస్సలు ఊహించలేదని, పొరపాటు ఎక్కడ జరిగిందో అంచనా వేస్తామన్నారు. తమ పార్టీకి 4 శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయంటే ఊహకు అందడంలేదని ప్రశాంత్ కిశోర్ విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే తన నిర్ణయం తప్పుగా అనిపించవచ్చునేమోనని, కానీ, సానుకూలమైన ఫలితాన్ని సాధించడానికి ఇంకా చాలా కృషి చేయాల్సి ఉందని విశ్లేషించారు.
బీహార్‌ను గెలిచేవరకు ప్రయత్నం
బీహార్‌ను గెలిచేవరకు తన ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని ప్రశాంత్ కిశోర్ పునరుద్ఘాటించారు. బీహార్‌ను గెలవకుండా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ఎంత సమయం పడుతుందో తనకు తెలియదు గానీ కచ్చితంగా సాధిస్తానంటూ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక, బీహార్ నవనిర్మాణ్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, జనవరి 15 తర్వాత ఇంటింటికీ వెళ్తామని, ప్రతి కుటుంబానికి రూ.2 లక్షలు అందేలా చూసేందుకు అవసరమైన ఫారమ్‌లు నింపుతామని వివరించారు. ప్రలోభాలకు గురై మొదటి విడతగా రూ.10,000 తీసుకున్న వ్యక్తులందరి వద్దకు జన సురాజ్ పార్టీ వెళ్తుందని, ప్రభుత్వ ట్రాప్‌లో చిక్కుకోకుండా చూసుకోవడం తమ పార్టీ బాధ్యతేనని ఆయన అన్నారు.

