Student Sucide: విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. టీచర్ కొట్టిందని, తల్లిదండ్రులు తిట్టారని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మరణానికి ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్ లోని అంశాలు ప్రస్తుతం చర్చకు తావిస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలో ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న 11వ విద్యార్థిని (17) ఆత్మహత్య చేసుకుంది. నవంబర్ 16న ఆమె బలవన్మారణానికి తాజాగా ఆమె రాసిన సూసైడ్ నోటును పోలీసులు బహిరంగ పరిచారు. అందులో ఆమె చేసిన ఆరోపణలను వెల్లడించారు. విద్యార్థిని ఆత్మహత్య కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఏఎస్పీ ఆర్తి సింగ్ వివరించారు. చనిపోయిన విద్యార్థినికి సంబంధించిన నోట్ బుక్ లో తమకు సూసైడ్ నోట్ దొరికిందని ఎస్పీ తెలిపారు.
సూసైడ్ నోట్‌లో ఏముందంటే?
స్కూల్లోని టీచర్ తనను శారీరకంగా, మానసికంగా వేధించినట్లు సూసైడ్ నోట్ లో విద్యార్థిని వాపోయింది. కూర్చున్న బెంచ్ వద్దకు వచ్చి టీచర్.. తన చేయి పట్టుకునేవారని తెలిపింది. ‘నా చేయి చల్లగా ఉందా?’ అంటూ ప్రశ్నించేవారని పేర్కొంది. తర్వాత తన చేతి వేళ్లను వెడల్పుగా చాచమని చెప్పేవారని.. అలా చేసిన తర్వాత వేళ్ల మధ్య పెన్సిల్ పెట్టి బలంగా నొక్కేవారని ఆరోపించింది. ఈ కారణం చేతనే యువతి ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని ఏఎస్పీ ఆర్తి సింగ్ అంచనా వేశారు.
తల్లిదండ్రులు ఏమన్నారంటే?
కూతురు ఆత్మహత్యతో ఆమె తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. తమ బిడ్డ ఇంట్లో చాలా మామూలుగానే ఉండేదని వారు పేర్కొన్నారు. స్కూలులో ఆమెను ఎవరో హింసించారని ఆరోపించారు. అందుకే తమ కూతురు ఇలా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని అన్నారు. తమ బిడ్డను దూరం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు యువతి ఆత్మహత్యకు దారి తీసిన మరిన్ని కారణాల గురించి దర్యాప్తు కొనసాగుతోందని ఏఎస్పీ ఆర్తి సింగ్ తెలిపారు.
Also Read: Kalvakuntla Kavitha: ఆర్ఆర్ఆర్ భూసేకరణలో అక్రమాలు.. రీసర్వే చేయాల్సిందే.. కవిత అల్టిమేటం!
దేశవ్యాప్తంగా పలువురు సూసైడ్..
ఇటీవల దిల్లీలో ఓ పదో తరగతి క్లాస్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ప్రాణాలు విడిచాడు. ఆ విద్యార్థి కూడా తన సూసైడ్ నోట్ లో టీచర్ల గురించి ప్రస్థావించడం గమనార్హం. వారి వేధింపుల వల్లే చనిపోతున్నట్లు అతడు పేర్కొన్నాడు. మహారాష్ట్ర థానేలోనూ 19 ఏళ్ల విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. మరాఠీలో మాట్లాడలేదని రైల్లో జరిగిన వివాదం కారణంగా సూసైడ్ చేసుకున్నాడు. ఈ నెలలోనే రాజస్థాన్ జైపూర్ లో ఓ విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక ఆమె ప్రాణాలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

