Kalvakuntla Kavitha: హైదరాబాద్ కు కంఠాహారంగా ఉన్నప్పటికీ రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పేరుకే ఈ జిల్లాలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని.. ప్రజలకు మాత్రం సరైన ఫలాలు అందడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలో తన రెండో రోజు జనం బాట కార్యక్రమం సందర్భంగా కవిత మాట్లాడారు. ఫ్యాబ్ సిటీ, ఫ్యూచర్ సిటీ ఇలా ఏ పెద్ద ప్రాజెక్ట్ వచ్చినా రంగారెడ్డి జిల్లాకే వస్తుందన్న కవిత.. ఇక్కడి ప్రజలకు మాత్రం రూపాయి లాభం లేదని, ఉద్యోగాలు కూడా లభించడం లేదని వాపోయారు.
‘చెరువులు కబ్జాకు గురయ్యాయి’
తెలంగాణ రాకముందు రంగారెడ్డి జిల్లాలో 64 చెరువులు ఉంటే ఇప్పుడు చాలా చెరువులు కబ్జాకు గురయ్యాయని కవిత ఆరోపించారు. ‘గోపన్ పల్లి, గచ్చిబౌలి పెద్ద చెరువు, ఖానామెట్, చందానగర్, మియాపూర్, మదీనా గూడలో చెరువులు కబ్జా అయ్యాయి. ఎక్కడ చెరువు చూసిన ఎమ్మెల్యే గాంధీ గారు కబ్జా పెట్టారని చెబుతున్నారు. మరి హైడ్రా అధికారులు నిద్రపోతున్నారా? ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తర్వాత కబ్జా చేసిన సరే ఊరుకుంటున్నారు. గాజుల రామారంలో 14 ఎకరాలు కబ్జా చేసి కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. అదే ప్లేస్ లో 60 వడ్డెర కుటుంబాలను మాత్రం వెళ్లగొట్టారు. పెద్దవాళ్లను కాపాడి పేదవాళ్లను ఇబ్బంది పెట్టటమేనా హైడ్రా పని. కబ్జాలకు సంబంధించిన అన్ని వివరాలు హైడ్రాకు ఇస్తాం. ఎలా పనిచేస్తారో మేము చూస్తాం’ అని కవిత అన్నారు.
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుపై..
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ కు సంబంధించి భూములు పోతున్నాయంటే బాధిత గ్రామాల వద్దకు వెళ్లినట్లు కవిత చెప్పారు. ‘నేను ఈ అంశానికి సంబంధించి ఆలైన్ మెంట్ మారిందని మెదక్ లో మాట్లాడితే నా మీద విరుచుకుపడుతున్నారు. కానీ ఇక్కడ నాలుగు సార్లు ఆలైన్ మెంట్ మారింది. బీఆర్ఎస్ హయాంలో రెండుసార్లు, కాంగ్రెస్ వచ్చాక రెండుసార్లు మారింది. ఆలైన్ మెంట్ మారటం కారణంగా పేద, చిన్న రైతుల భూమి పోతోంది. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఒక్కో చోట ఒక్క విధంగా ఆలైన్ మెంట్ చేస్తున్నారు. ఇక్కడ నాలుగు సార్లు ఆలైన్ మెంట్ మారటానికి పెద్దోళ్ల భూములు ఉండటమేనని స్థానికులు చెబుతున్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలోని అమన్ గల్, మాడుగుల మండలాల్లో సీఎం సోదరులు, అదే విధంగా మంత్రి పొంగులేటి కుటుంబ సభ్యులకు సంబంధించి భూములు ఉన్నాయి. ఇంకా బీఆర్ఎస్ నేతల భూములు కూడా ఉన్నాయి. అసలు ఆర్ఆర్ఆర్ మనకు ఎంత అవసరమన్న దానిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలుస్తాం’ అని కవిత చెప్పారు.
Also Read: Hyderabad: హైడ్రా మరో సంచలనం.. బడాబాబుల ఆగడాలకు చెక్.. రూ.700 కోట్ల భూమి సేఫ్
‘కేంద్రమంత్రికి లేఖ రాస్తా’
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును చాలా అశాస్త్రీయంగా చేపడుతున్నారని కవిత ఫైర్ అయ్యారు. మళ్లీ రీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై నితీన్ గడ్కరీకి లేఖ రాస్తామని కవిత పేర్కొన్నారు. ‘అభివృద్ధికి నేను వ్యతిరేకం కాదు. కానీ ఆ పేరుతో అన్యాయం జరగవద్దు. అవసరమైతే ఆరు నెలలు ఆలస్యమైన పర్వాలేదు. మళ్లీ సర్వే చేసి ప్రభుత్వ భూమి ఎక్కువ, ప్రజల భూములు తక్కువ ఉండే విధంగా చూడాలని కోరుతా. ఒరిజినల్ ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ ను మెదక్ లో వంకర టింకర తిప్పారు. షాబాద్, షాద్ నగర్ లో కూడా అలాగే చేశారు. ఈ విషయంలో కచ్చితంగా మేము లీగల్ ఫైట్ కూడా చేస్తాం. తొమ్మిది రేకుల గ్రామంలో ఆడబిడ్డల బాధ చూస్తే గుండె చెరవయ్యింది. అందరికీ సమన్యాయం జరగాలి’ అని కవిత పేర్కొన్నారు.

