Hidma Funerals: మావోయిస్టు అగ్రనేత హిడ్మా అంత్యక్రియలు గురువారం ఛత్తీస్ గఢ్ లోని స్వగ్రామంలో జరిగాయి. ఏపీలోని అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో హిడ్మాతో పాటు ఆయన భార్య, మరో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో హిడ్మా మృతదేహాన్ని ఉంచిన అధికారులు.. అనంతరం ఇవాళ స్వగ్రామమైన ఛత్తీస్ గఢ్ లోని సుక్మాజిల్లా పూవర్తి ప్రాంతానికి తరలించారు.
హిడ్మా తల్లి కన్నీరుమున్నీరు..
హిడ్మాతో పాటు ఆయన భార్య మృతదేహాన్ని సైతం.. పూవర్తి గ్రామానికి అధికారులు తరలించారు. దీంతో ఒక్కసారిగా గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. దశాబ్దాల క్రితం ఉద్యమమంటూ ఊరి వదిలి వెళ్లిన హిడ్మా.. శవంగా తిరిగిరావడంతో తల్లి మాంజుతో పాటు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. భార్య, భర్తల మృతదేహాలను పక్క పక్కన పెట్టి రోధించారు. మరోవైపు హిడ్మాను కడసారి చూసుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంది వేలాదిగా ఆదివాసీలు తరలివచ్చారు.
मांडवी हिड़मा का शव लाया गया। #हिडमा #hidma pic.twitter.com/RrdPvdepwm
— Aditya Bhileparia. (@journalistADB) November 20, 2025
బలగాలు ఉన్నా.. లెక్కచేయకుండా
మావోయిస్టు అగ్రనేత హిడ్మా అంత్యక్రియల నేపథ్యంలో పూవర్తి గ్రామాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మావోయిస్టులు సైతం రహస్యంగా అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశముందన్న సమాచారంతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశాయి. అయితే గ్రామంలో పెద్ద ఎత్తున బలగాలు.. తుపాకులతో పహారా కాస్తున్నప్పటికీ ఆదివాసీలు బెదరలేదు. ఎలాంటి భయాందోళన లేకుండా హిడ్మాను చివరిసారి చూసేందుకు పూవర్తికి పోటెత్తారు. దీనిని బట్టి హిడ్మాకు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజాధరణ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
ఆదివాసీ సంప్రదాయంలో..
కాగా, ఆదివాసీ సంప్రదాయం ప్రకారం.. హిడ్మా దంపతుల అంత్యక్రియలను నిర్వహించారు. ఇద్దరిని ఒకే చితిపై ఉంచి.. జరిపించారు. అయితే హిడ్మా మృతదేహం వచ్చినప్పటి నుంచి.. అంత్యక్రియలు పూర్తయ్యేవరకూ వేలాది మంది ప్రజలు గ్రామంలోనే ఉండటం గమనార్హం.
Yerli halktan binlerce kişi Hidma'yı uğurluyor
🔻HKP (Maoist) MK üyesi ve HKGO Komutanı Hidma'nın cenazesi Puvarthi köyüne getirildi. Farklı bölgelerden binlerce kişi köye akın etti. Polis köyü ablukaya aldı, köye girişlere isim ve adres verildiği sürece izin veriliyor. pic.twitter.com/jomOlM3QaW
— Yeni Demokrasi Gazetesi (@yeni_demokrasi3) November 20, 2025
మావోయిస్టుల పురిటిగడ్డ
హిడ్మా స్వగ్రామమైన పూవర్తిని మావోయిస్టులకు పురిడి గడ్డగా కూడా చెబుతుంటారు. పూర్తిగా ఆదివాసీలు నివసించే ఈ గ్రామంలో 50 ఇళ్లు మాత్రమే ఉంటాయి. హిడ్మా స్ఫూర్తితో ఎంతోమంది గ్రామం నుంచి ఉద్యమంలోకి వెళ్లారు. ఇప్పటివరకూ 90 మంది యువకులు మావోయిస్టుల దళంలో చేరినట్లు సమాచారం. హిడ్మా తర్వాత ఆ స్థాయి మోస్ట్ వాంటెడ్ గా ఉన్న బార్స దేవా కూడా ఈ గ్రామానికి చెందిన వారు కావడం గమనార్హం.
మావోయిస్టుగా హిడ్మా ప్రస్థానం
హిడ్మా విషయానికి వస్తే.. ఆయన 1981లో చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామంలో జన్మించారు. 10వ తరగతి వరకు చదువుకున్న తర్వాత 1990ల చివరలో మావోయిస్ట్ ఉద్యమంలో చేరాడు. తొలినాళ్లలో పీపుల్స్ లిబరేషన్ గెరిలా ఆర్మీ (PLGA) బటాలియన్ లో కమాండర్‌గా పనిచేశారు. ఆ తర్వాత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) సభ్యుడిగా, సెంట్రల్ కమిటీలో అతి పిన్ని సభ్యుడిగా పదవి పొందాడు. సుక్మా, బిజాపూర్, దంతేవాడ జిల్లాలలోని మావోయిస్ట్ కార్యకలాపాల్లో అతడు ముఖ్య భూమిక పోషించాడు.
Also Read: Maredumilli Encounter: మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో తుపాకుల మోత.. వారిద్దరూ తెలంగాణ ఎస్ఐబీ అదుపులో ఉన్నారా?
26 దాడులకు మాస్టర్ ప్లాన్
2004 నుంచి ఇప్పటివరకూ జరిగిన 26 దాడులకు హిడ్మా మాస్టర్ మైండ్ గా పనిచేశాడు. 200 మందికి పైగా భద్రతా బలగాల మరణాలకు అతడు కారణమయ్యాడు. ముఖ్యంగా 2021 బిజాపూర్ జరిగిన భారీ దాడి వెనుక హిడ్మా పాత్ర ఉంది. STF, DRG, CRPF బృందాలపై మావోలు జరిపిన మెరుపు దాడిలో 22 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో అప్పట్లో హిడ్మా పేరు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది. దీంతో అతడ్ని పట్టుకునేందుకు దాదాపు 2000 మందితో కూడిన బృందాలను ఉన్నతాధికారులు రంగంలోకి దింపినట్లు సమాచారం. అటువంటి హిడ్మాను తాజాగా మట్టుబెట్టడం ద్వారా మావోయిస్టులపై పోలీసులు అతి భారీ విజయాన్ని సాధించారని చెప్పవచ్చు.

