Mumbai Airport: ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (CSMIA) నవంబర్ 20న నిర్వహణ పనుల కోసం తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం ఆరు గంటలపాటు రన్‌వే కార్యకలాపాలు నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ సమయంలో రన్‌వే ఉపరితలం , నీరు వెళ్లే డ్రైనేజ్ లైన్‌లు, అలాగే భద్రతకు సంబంధించిన సిస్టమ్‌లను ఒకసారి పూర్తిగా చెక్ చేస్తారు. రోజూ వందల ఫ్లైట్లు ల్యాండ్ అవుతూ, టేకాఫ్ అవుతూ ఉండే ముంబై ఎయిర్‌పోర్ట్‌కి ఇలాంటి మెయింటెనెన్స్ చాలా ముఖ్యం అని అధికారులు చెబుతున్నారు. గ్లోబల్ సేఫ్టీ ప్రమాణాల ప్రకారం సేఫ్టీను మెయింటైన్ చేయాలంటే, ఇంకా వింటర్‌లో ట్రావెల్ రష్ ఎక్కువగా ఉండే సమయంలో పెద్ద సమస్యలు రాకుండా ముందే జాగ్రత్త కోసం ఈ ఆరు గంటల బ్రేక్ తీసుకుంటున్నామని అన్నారు.
అసలు ఎందుకు ఈ సేవలు నిలిపి వేస్తున్నారంటే?
విమానాశ్రయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, వర్షాకాలం తర్వాత రన్‌వేలో జరిగే పరిణామాలను అంచనా వేసి, వర్షాల వల్ల ఏర్పడే దెబ్బతిన్న ప్రాంతాలను సరిచేయడానికి ఈ పరిశీలన ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు.
ప్రయాణికులు గమనించాల్సిన విషయాలు
మూసివేత సమయంలో ప్రయాణించేవారు తమ ఫ్లైట్ స్థితిని సమీప ఎయిర్‌లైన్‌తో నేరుగా చెక్ చేసుకోవాలని సూచించారు. కనెక్టింగ్ ఫ్లైట్లతో ప్రయాణించే వారు ముందుగానే మార్పులు ఉంటే నిర్ధారించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు, సాయంత్రం 5 గంటల నుంచి సాధారణ కార్యకలాపాలు పునఃప్రారంభమవుతాయని తెలిపారు.
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) నుంచి ఇండిగో సేవలు డిసెంబర్ 25 నుంచి
ఇదిలా ఉంటే, ఇండిగో ఎయిర్‌లైన్స్ డిసెంబర్ 25 నుంచి నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (NMIA) నుంచి విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ప్రారంభంలోనే దేశంలోని 10 ప్రధాన నగరాలకు కనెక్టివిటీ కల్పించనుంది.
ఇండిగో తొలి రూట్లు ఇవే..
ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నో, నార్త్ గోవా (మోపా), జైపూర్, నాగ్‌పూర్, కొచ్చి, మంగళూరు. ఆపరేషన్లు విస్తరించడంతో మరిన్ని నేరుగా వెళ్లే రూట్లను కూడా ప్రారంభించనున్నట్లు ఇండిగో తెలిపింది. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబైలో పెరుగుతున్న విమాన రద్దీని తగ్గించడంతో పాటు, పెరుగుతున్న డిమాండ్ తీర్చడానికి నిర్మించబడింది. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. దేశ అభివృద్ధిలో ఇది అత్యంత ముఖ్యమైన మైలురాయి అని ఆయన అభివర్ణించారు.
