Hamood Ahmed Siddiqui: ఢిల్లీ పేలుడు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫరీదాబాద్‌లోని అల్ ఫలా యూనివర్సిటీ(Al Falah University) ఛాన్సలర్ సోదరుడు హమూద్ అహ్మద్ సిద్ధిఖీ(Hamood Ahmed Siddiqui)ను పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 25 ఏళ్ల నాటి ఒక పాత మోసం కేసులో అతడి పాత్ర ఉందని గుర్తించిన పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, 25 ఏళ్ల కిందట మహూలో నకిలీ బ్యాంక్‌ను స్థాపించాడు. ప్రజల డబ్బును రెట్టింపు చేస్తామని నమ్మబలికి, వందలాది జనం నుంచి కోట్లలో డిపాజిట్లుగా సేకరించాడు. ఈ స్కామ్ బయటికి రాగానే 2000వ సంవత్సరంలో అహ్మద్ ఫ్యామిలీతో సహా మహూ నుంచి పరారయ్యారు. నాటి నుంచి అతడి కోసం వేట సాగిస్తుండగా ఆదివారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.
షేర్ ట్రేడింగ్..
లో ప్రొఫైల్‌ను మెయింటైన్ చేస్తూ షేర్ ట్రేడింగ్ చేస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. కాగా, ఈ కేసు నమోదైనప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు. దర్యాప్తు జరుగుతున్నప్పటికీ, నిందితుడు న్యాయస్థానానికి హాజరు కాకుండా పదే పదే తప్పించుకున్నాడు. దీంతో కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఛాన్సలర్ సోదరుడిగా, ఉన్నత వర్గాలతో సంబంధాలు ఉన్నప్పటికీ, చట్టం ముందు అందరూ సమానులేనని పోలీసులు స్పష్టం చేశారు. అహ్మద్ అరెస్టు అనంతరం స్థానిక కోర్టులో హాజరుపర్చారు. తదుపరి దర్యాప్తు కోసం అతడిని పోలీస్ కస్టడీకి తరలించే అవకాశం ఉంది. ఈ కేసులో అతడితో పాటు ఇంకెవరైనా ఉన్నారా?, మోసానికి సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
Also Read: Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలు
ఉమర్ ఫ్రెండ్ అరెస్ట్
ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ మరో కీలక అరెస్టు చేసింది. జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir)కు చెందిన జాసిర్ బిలాల్ వాణీ(Jasir Bilal Vani) అలియాస్ డానిష్‌ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ యువకుడు, డా. ఉమర్ ఉన్ నబీ(Dr. Umar un Nabi) ప్రభావంతో తీవ్రవాద భావజాలానికి గురై, అత్యాధునిక దాడికి సంబంధించిన పరికరాలను తయారు చేసేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుడు బిలాల్ టెక్నాలజీపై మంచి పట్టు ఉన్న వ్యక్తి. ఉగ్రవాదుల తరపున అతడు సాధారణ డ్రోన్లను సైతం పేలుడు పదార్థాలు మోసుకెళ్లేందుకు వీలుగా మార్పులు చేశాడు.
చిన్న తరహా రాకెట్లు
అంతేకాకుండా, పెద్ద ఎత్తున దాడులకు ఉపయోగపడేలా చిన్న తరహా రాకెట్లను కూడా తయారు చేసేందుకు ప్రయత్నించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఈ ప్రయత్నాలన్నీ ‘డీ6 మిషన్’లో భాగంగానే జరిగాయని అధికారులు భావిస్తున్నారు. ఆత్మాహుతి బాంబర్ డా. ఉమర్ ఉన్ నబీ ఈ యువకుడిని బెస్ట్ ఫ్రెండ్‌గా భావిస్తుండే వాడు. డానిష్‌ను ఉగ్ర కార్యకలాపాల్లోకి తీసుకురావడంలో ఉమర్ కీలక పాత్ర పోషించాడు. ఉమర్ నిర్దేశాల మేరకే జాసిర్ ఈ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధాలను తయారు చేసేందుకు ప్రయత్నించాడని దర్యాప్తు సంస్థలు తెలిపాయి. బిలాల్ అరెస్టుతో ఈ ఉగ్ర మాడ్యూల్ యొక్క సాంకేతిక విభాగాన్ని ఛేదించినట్లు భావిస్తోంది. జమ్మూ కశ్మీర్ నుంచి అరెస్టు చేసిన అతడిని విచారణ నిమిత్తం ఢిల్లీకి తరలించారు.
Also Read: Saudi Bus Accident: సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. హైదరాబాద్ వాసులు దుర్మరణం
