Jagtial: నిందిత వ్యక్తిపై కేసు నమోదు
రిమాండ్‌కు తరలించిన పోలీసులు
జగిత్యాల, స్వేచ్ఛ: జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. ఓ గ్రామంలో 7 ఏళ్ల బాలికపై 45 సంవత్సరాల వయసున్న వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, 2 రోజులక్రితం రాత్రి ఆరుబయట ఆడుకుంటున్న బాలికను, ఇంట్లోకి తీసుకెళ్లిన నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో, బాధిత చిన్నారి రోదిస్తూ ఘటనా స్థలం నుంచి ఇంటికి వెళ్లింది. ఏడుస్తూ జరిగిన విషయాన్ని తల్లితండ్రులకు చెప్పింది. దీంతో, బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితుడిపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. అనంతరం పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
Read Also- Satish death Case: సీఐ మృతి కేసు దర్యాప్తు వేగవంతం.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా అర్థమైంది ఏంటంటే?
నిందితుడిని కఠినంగా శిక్షించాలి
అభం శుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా, చిన్నపిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులు కలవరానికి గురిచేస్తున్నాయి. చిన్నారులపై అత్యాచారాలను నిరోధించేందుకు అన్ని స్థాయిల్లో అవగాహన రావాల్సిన అవసరం ఉంది. అలాగే, సమగ్ర చర్యలు తీసుకోవాలి. మొదటగా, పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వంటి కనీస అవగాహన చిన్న వయసు నుంచే నేర్పించాలని నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే పిల్లలు భయపడకుండా చెప్పే వాతావరణాన్ని ఇంట్లో సృష్టించాలని సూచిస్తున్నారు.
ఇక, స్కూళ్లలో సేఫ్టీ క్లాసులు, కౌన్సెలింగ్, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు తప్పనిసరి చేయాలని అంటున్నారు. ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని సీసీ కెమెరాల ఏర్పాటు, కోర్టుల్లో వేగవంతమైన విచారణ, పిల్లలపై జరిగిన నేరాలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాలు, కోర్టుల ఉండాలని అంటున్నారు. అలాగే, నిందితులకు కఠినమైన శిక్షలు, అది కూడా త్వరగా పడేలా చర్యలు తీసుకుంటే ప్రభావం కాస్త మెరుగ్గా ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ల గురించి, పిల్లలు, జనాల్లో అవగాహన పెంచాలని అంటున్నారు. చిన్నారులను రక్షించడం కేవలం పోలీసు బాధ్యతగా భావించకుండా, తల్లిదండ్రులు, స్కూళ్లు, సమాజం కలిసి బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
