Digital Arrest Scam: ‘డిజిటల్ అరెస్ట్’ సైబర్ మోసాలలోనే (Digital Arrest Scam) అత్యంత షాక్‌కు గురిచేస్తున్న ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ కేటుగాళ్లు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 నెలలపాటు డిజిటల్ అరెస్ట్ మోసాన్ని కొనసాగించారు. ఈ దుశ్చర్యకు అమాయకురాలైన ఓ మహిళ ఏకంగా రూ.32 కోట్లు పోగొట్టుకుంది. ఏకంగా నెల రోజుల పాటు బాధితురాలిని వీడియో పర్యవేక్షణలో ఉంచి ఈ భారీ ఆర్థిక మోసానికి తెగబడ్డారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన వెలుగుచూసింది.
బాధితురాలి వయసు 57 ఏళ్లు కావడంతో ఇలాంటి నేరాలపై ఆమె అవగాహన లేదు. దీంతో, ఆమెను సులభంగా బోల్తా కొట్టించారు. 2024 సెప్టెంబర్ 15న డిజిటల్ అరెస్ట్ డ్రామా మొదలుపెట్టారు. డీహెచ్ఎల్ నుంచి కాల్ చేస్తున్నామంటూ తొలుత నమ్మించారు. ఆ తర్వాత సైబర్‌క్రైమ్ విభాగం, సీబీఐ, ఆర్బీఐ సంస్థల పేరిట, ఉన్నతాధికారులమంటూ మహిళను నిండాముంచారు. డీహెచ్ఎల్ కాల్ చేస్తున్నామని నమ్మించిన వ్యక్తి, ముంబైలోని అంధేరి ప్రాంతంలో మీరు బుక్ చేసిన ప్యాకేజీలో 4 పాస్‌పోర్టులు, 3 క్రెడిట్ కార్డులు, నిషేధిత డ్రగ్స్ ఉన్నాయంటూ బెదిరించాడు. అసలు తానెప్పుడూ ముంబై రాలేదని ఆ పెద్దావిడ చెప్పడంతో, మోసగాళ్లు రూటు మార్చారు. తమరి వ్యక్తిగత వివరాలు దుర్వినియోగానికి గురయ్యాయని, దీనిని సైబర్‌క్రైమ్ కేసుగా పరిగణిస్తున్నామంటూ అవతలి వ్యక్తి భయపెట్టాడు. బాధితురాలు తన వాదన వినిపించేలోపే, సీబీఐతో మాట్లాడండి అంటూ మరో వ్యక్తికి కాల్ కనెక్ట్ చేశాడు.
సీబీఐ అధికారినని పరిచయం చేసుకున్న మూడవ వ్యక్తి, అరెస్టు చేస్తామంటూ మరింత భయపెట్టాడు. వ్యక్తిగత వివరాలు దుర్వినియోగానికి గురైనట్టుగా బలమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. నేరగాళ్లు తమరి ఇంటిపై కన్నేసి ఉంచారని, స్థానిక పోలీసులను సంప్రదించవద్దని మరింత భయపెట్టాడు. దీంతో, కుటుంబ సభ్యుల భద్రత గురించి ఆలోచించిన బాధితురాలు, కేటుగాళ్లు చెప్పినట్టు నడుచుకోవడం మొదలుపెట్టింది.
Read Also- Local Body Elections: స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కార్
నెలపాటు స్కైప్‌లో..
సైబర్ మోసగాళ్లు బాధితురాలతో స్కైప్ ఇన్‌స్టాల్ చేయించారు. రెండు ఐడీలను క్రియేట్ చేయాలని ఆదేశించారు. ఈ ఐడీల ద్వారా, మోహిత్ అనే పేరిట ఓ వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. తాను ఆమెను హౌస్ అరెస్ట్ చేస్తున్నానని చెప్పి, కెమెరా ఆన్ చేయించాడు. ఆ విధంగా బాధితురాలపై నిరంతరం వీడియో మోనిటరింగ్ మొదలుపెట్టాడు. 2 రోజుల పాటు అతడను వీడియోలో చూసిన తర్వాత, సీబీఐ అధికారి ప్రదీప్ సింగ్ అంటూ మరొకడు కనెక్ట్ చేశాడు. ఆ వ్యక్తి బాధితురాలిని వీడియోలో పర్యవేక్షించడమే కాకుండా, బూతులు కూడా తిట్టాడు.
ఏ తప్పూ చేయలేదని నిరూపించుకోకపోతే, ఇంటికి వచ్చి అరెస్టు చేస్తామంటూ బెదిరించాడు. క్రమంగా ఒత్తిడి పెంచుతూ వచ్చాడు. ఈ క్రమంలో బాధితురాలి ఫోన్ యాక్టివిటీస్, ఆమె లోకేషన్ గురించి తెలుసుకున్నారు. దీంతో, బాధితురాలు మరింత భయానికి లోనైంది. జరిగిన నేరంతో సంబంధం లేదని నిరూపించుకోవాలంటే ఆర్బీఐ ఆధ్వర్యంలో నడిచే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) ద్వారా ఆస్తుల వివరాలను సమర్పించి, తనవేనంటూ ధ్రువీకరించుకోవడమే ఏకైక మార్గమంటూ ఆమెకు చెప్పారు. ఈ క్రమంలో సైబర్‌క్రైమ్ విభాగం నుంచి లేఖలు వచ్చాయంటూ నకిలీ పత్రాలను చూపించారు. వీటన్నింటినీ బాధితురాలు నమ్మింది.
187 లావాదేవీలు.. రూ.32 కోట్లు హుష్‌కాకి
సైబర్ కేటుగాళ్ల మాటలు నమ్మిన ఆ పెద్దావిడ 2024 సెప్టెంబర్ 24 నుంచి 2024 అక్టోబర్ 22 మధ్యకాలంలో తన అకౌంట్లకు సంబంధించిన వివరాలన్నీ అందించింది. దీంతో, 90 శాతం శాతం ఆస్తులను ధృవీకరణ కోసం డిపాజిట్ చేయాలని డిమాండ్ చేశారు. వాళ్లు అన్ని విధాలా భయపెట్టడంతో ఆమె చివరికి అంగీకరించింది. ఆ తర్వాత ష్యూరిటీగా మరో రూ.2 కోట్లు డిపాజిట్ చేయాలని, ట్యాక్స్ కోసం మరికొంత ఈ విధంగా భారీ మొత్తంలో డబ్బులు కొట్టేశారు. చివరికి, 2024 డిసెంబర్ 1 నకిలీ క్లియరెన్స్ లెటర్ ఇచ్చారు. అప్పటికి కూడా ఆమె స్కైప్ పర్యవేక్షణలోనే ఉంది. ఈ ఒత్తిడిలో ఉంటూనే డిసెంబర్ 6న బాధితురాలు తన కొడుకు వివాహ నిశ్చితార్థాన్ని నిర్వహించింది. ఈ క్రమంలో మానసికంగా, శారీరకంగా ఆమె చాలా ఒత్తిడికి గురైంది. నెలపాటు అనారోగ్యం బారినపడింది.
Read Also- Saudi Bus Accident: సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. హైదరాబాద్ వాసులు దుర్మరణం
అయినప్పటికీ, సైబర్ మోసగాళ్లు ఆమె వదల్లేదు. 2025 ప్రారంభం వరకు డబ్బు డిమాండ్ చేస్తూనే వచ్చారు. డిపాజిట్ చేసిన డబ్బును ఫిబ్రవరి లోగా తిరిగి చెల్లిస్తామంటూ ఆమెను నమ్మిస్తూ వచ్చారు. డబ్బు తిరిగి ఇవ్వాలంటూ బాధితురాలు కోరుతూ రాగా, కాస్త ఆలస్యం అవుతుందని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో 2025 మార్చి 26న కమ్యూనికేషన్ మొత్తం సడెన్‌గా ఆగిపోయింది. దీంతో, మోసం జరిగిపోయిందని ఆమె గుర్తించింది. మొత్తంగా, బాధితురాలు 187 లావాదేవీల ద్వారా ఏకంగా రూ.31.83 కోట్లు సైబర్ నేరగాళ్లకు ట్రాన్స్‌ఫర్ చేసింది. ఇంత డబ్బు పోవడంతో మానసిక ఆవేదన, అనారోగ్యం నుంచి కోలుకోవడానికి సమయం పట్టడం, మరోవైపు కొడుకు పెళ్లి (జూన్ 8) కారణంగా ఆమె అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. వీటన్నింటి నుంచి బయటపడిన తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవంబర్ 14న ఎఫ్‌ఐఆర్ నమోదయింది. ఈ సైబర్ మోసంపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
