SriDevi: టాలీవుడ్‌లో ‘కోర్టు’ సినిమా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టింది. ఇక ఈ మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చిన నటి శ్రీదేవి. తన సహజ నటనతో చిత్ర విజయంలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో శ్రీదేవికి వరుస అవకాశాలు వస్తున్నాయి. కోర్టు సినిమా తర్వాత ఆమె లైఫ్ మొత్తం మారిపోయింది.
ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళంలో రెండు సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల మరో తమిళ చిత్రానికి కమిట్ అయినట్లు తెలుస్తుంది. తమిళ ఇండస్ట్రీలో ‘జో’ అనే సూపర్ హిట్ మూవీని రూపొందించిన విజన్ సినిమా హౌస్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ‘ఏగన్’ హీరోగా నటిస్తున్నాడు. ‘మిన్నల్ మురళి’ ఫేమ్ ఫెమినా జార్జ్ హీరోయిన్‌గా చేస్తోంది. ‘ఆహా కళ్యాణం’ తమిళ వెబ్ సిరీస్‌తో గుర్తింపు పొందిన దర్శకుడు యువరాజ్ చిన్నసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
యూత్‌ఫుల్, ఎమోషనల్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో కీలక పాత్రలో శ్రీదేవిని ఎంపిక చేశారు మేకర్స్. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘బేబీ’, ‘కోర్టు’ చిత్రాలకు తన సంగీతంతో ఆకట్టుకున్న విజయ్ బుల్గానిన్ ఈ ప్రాజెక్టుకూ సంగీతం అందిస్తున్నాడు.
ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. ” కథ మీ అందరికి నచ్చుతుంది. తమిళ్, తెలుగు వెర్షన్లను షూట్ చేయాలని నిర్ణయించాం. ఎక్కడా కూడా రాజీ పడకుండా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం అని తెలిపారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని ” తెలిపారు.
