Shubman Gill injury: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens Test) మైదానం వేదికగా భారత్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ శుక్రవారమే పూర్తయింది. టీమిండియా పరాజయాన్ని చవిచూసింది. అయితే, మూడవ రోజు ఆట ప్రారంభం కావడానికి ముందే భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగలింది. మెడకు గాయం కావడంతో శనివారం మైదానాన్ని వీడిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఆదివారం ఆటకు పూర్తిగా (Shubman Gill injury) దూరమయ్యాడు. గాయానికి చికిత్స కోసం కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం గిల్‌ను ఐసీయూలో (ఇంటెన్సివ్ కేర్ యూనిట్) ఉంచినట్టు బీసీసీఐ వర్గాలు ధృవీకరించాయి. అయితే, పర్యవేక్షణ కోసం మాత్రమే ఐసీయూలో ఉంచినట్టు తెలుస్తోంది. ఆదివారం అంతా ఆసుపత్రిలోనే ఉండనున్నాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
గాయం కారణంగా గిల్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేదు. ఇక, గువాహటి వేదికగా జరగనున్న తదుపరి టెస్ట్‌లోనైనా ఆడతాడా?, లేదా? అనే దానిపై అనిశ్చితి నెలకొంది. సప్తర్షి బసు అనే క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, న్యూరోసర్జన్, న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో గిల్‌ను ఉంచారని తెలిసింది. గిల్ ఆరోగ్యం దృష్ట్యా ముందస్తు జాగ్రత్తగా ఒక మెడికల్ ప్యానల్‌ను కూడా ఏర్పాటు చేశారని, ప్రతి విషయంలోనూ నిశితంగా పర్యవేక్షిస్తున్నారని ‘రెవ్‌స్టోర్ట్స్’ కథనం పేర్కొంది.
కాగా, గిల్ కోలుకునే వేగాన్ని బట్టే అతడు గువాహటి టెస్ట్‌లో ఆడతాడా?, లేదా? అనేది ఆధారపడి ఉంటుందని బీసీసీఐ అధికారులు తెలిపారు. అందుబాటులో ఉంటాడా లేదా, ఫిట్‌గా ఉంటాడో లేదా అనేది ఇప్పుడే అంచనా వేయడం అసాధ్యమని అంటున్నారు. అంచనా కంటే వేగంగా కోలుకోవచ్చుననే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
కాగా, కోల్‌కతా టెస్ట్ రెండో రోజు ఆటలో శుభ్‌మన్ గిల్ కేవలం మూడు బంతులు ఎదుర్కొని రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. సైమన్ హార్మర్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడాడు. దాంతో, మెడ పట్టేసి మైదానంలోనే ఇబ్బందిపడ్డాడు. మెడికల్ సాయం కోరాడు. బాధ ఎక్కువగా ఉండడంతో మైదానాన్ని వీడాడు. వెంటనే స్కానింగ్, పర్యవేక్షణ కోసం ఆసుపత్రికి తరలించారు. మెడ కండరాలు పట్టేశాయని బీసీసీఐ ధృవీకరించింది. ఆ తర్వాత సర్వైకల్ కాలర్ ధరించి గిల్ కనిపించాడు.
గిల్ అందుబాటులో లేకపోవడం భారత ప్రదర్శనపై ప్రభావం చూపింది. ఒక బ్యాటర్ లేకుండానే టీమిండియా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో రిషభ్ పంత్‌ను కూడా ముందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది.
