Cyber Crime: సైబర్ క్రిమినల్స్ మరోసారి తమ మోసాల స్థాయిని పెంచారు. ఈసారి ఏకంగా ఆదాయపు పన్ను శాఖ కమిషనర్‌ను లక్ష్యంగా చేసుకుని రూ. 40 వేలు కొల్లగొట్టారు. ఆన్‌లైన్ ద్వారా వైన్ కొనుగోలు చేయబోయిన అధికారికి క్యూఆర్ కోడ్(QR code) పంపించి ఈ మోసానికి పాల్పడ్డారు. బంజారాహిల్స్ ప్రాంతంలో నివాసముంటున్న ఐటీ కమిషనర్, ఈ నెల 9న వైన్ తాగాలని అనిపించడంతో ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాల వెబ్‌సైట్ కోసం సెర్చ్ చేశారు. ఈ క్రమంలో ఆయనకు ‘జూబ్లీహిల్స్ వైన్స్ స్పాట్ డాట్ ఇన్’ అనే వెబ్‌సైట్ కనిపించగా, దానిని క్లిక్ చేశారు. వెబ్‌సైట్‌లో ఉన్న నంబర్‌కు ఆయన ఫోన్ చేయగా, అవతలి వ్యక్తి వైన్ బాటిల్ ధర రూ.2,320 అని చెప్పాడు.
Also Read: Rohini Acharya: ఎన్నికల్లో ఓటమి వేళ.. లాలూ ఫ్యామిలీతో బంధాన్ని తెంచుకున్న కూతురు.. ఎందుకంటే?
క్యూఆర్ కోడ్‌ను స్కాన్..
అదనంగా రూ.100 చెల్లిస్తే డోర్ డెలివరీ చేయిస్తానని చెప్పి, డబ్బు ట్రాన్స్‌ఫర్ కోసం క్యూఆర్ కోడ్‌ను పంపించాడు. దానికి అంగీకరించిన అధికారి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి డబ్బు పంపించారు. ఆ వెంటనే అవతలి వ్యక్తి మరో క్యూఆర్ కోడ్‌ను పంపి, రూ.100 పంపమని సూచించాడు. దాన్ని స్కాన్ చేయగానే, ఐటీ అధికారి ఖాతా నుంచి ఏకంగా రూ.19 వేలు ట్రాన్స్‌ఫర్ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. డబ్బు ఎక్కువ ట్రాన్స్‌ఫర్ అయిన విషయాన్ని గమనించిన అధికారి, వెంటనే ఫోన్ చేసి ప్రశ్నించారు. ‘ఏదో పొరపాటు జరిగి ఉంటుంది, డబ్బు వాపసు పంపిస్తాను’ అని చెప్పిన సైబర్ క్రిమినల్, మరో క్యూఆర్ కోడ్‌ను పంపి, దానిని స్కాన్ చేస్తే డెలివరీ ఓటీపీ జనరేట్ అవుతుందని నమ్మబలికాడు.
ఆ అధికారి ఆ క్యూఆర్ కోడ్‌ను కూడా స్కాన్ చేయగా, ఆ వెంటనే ఆయన ఖాతా నుంచి మరో రూ.19 వేలు ట్రాన్స్‌ఫర్ అయినట్టుగా మెసేజీ వచ్చింది. మొత్తమ్మీద రూ.40 వేలు కోల్పోయిన తర్వాత జరిగిన మోసాన్ని గుర్తించిన ఐటీ కమిషనర్, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: Telangana Congress: కాంగ్రెస్ ఉప ఎన్నికల వ్యూహం.. సీఎం రేవంత్ రెడ్డి నయా స్ట్రాటజీ!
