Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలో రోజురోజుకు కుక్కలు పెరగడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కుక్కల వల్ల ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని బిక్కు బిక్కుమంటున్నారు. పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు తిరిగి ఇంటికి వచ్చే వరకు ఎక్కడ కుక్క కాటుకు గురవుతారోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని పలు మార్లు మున్సిపల్ అధికారులకు, పంచాయతీల సెక్రెటరీలకు ఎన్నిసార్లు మోర పెట్టుకున్నా కుక్కలను పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల నుంచి తరలించే ప్రక్రియ చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా కుక్కల మంద కనబడితే అయ్య బాబోయ్ కుక్కలు అంటూ పరుగులు పెడుతున్నారు.
Also Read: Jogulamba Gadwal: సిసిఐ కొనుగోలు ఊపందుకునేనా..! పత్తి రైతుకు ప్రకృతి సహకరించేనా..!
పట్టించుకోని పంచాయతీ సిబ్బంది
గ్రామాల్లో కుక్కల బెడద తీవ్ర మవుతున్నా.. పంచాయతీ సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదు. పలు మార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. వీధి కుక్కల కుటుంబ నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పటికైనా గ్రామాల్లో పెరిగిపోతున్న వీధి కుక్కల సంఖ్యను తగ్గించి వాటి నుంచి తమ పిల్లలను కాపాడాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాలలో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది చికెన్ మటన్ సెంటర్ల నిర్వాహకులు మాంసం వ్యర్థాలను రోడ్లపైనే పారేస్తుండటంతో వాటిని తినడానికి షాప్‌ల వద్ద కుక్కలు గుంపులుగా కాపు కాస్తున్నాయి.
ఐదు నెలల్లో 720 కేసులు
జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో గడిచిన ఐదు నెలలలోనే 720 కేసులు నమోదయ్యాయి. అంటే కుక్కలు ఏ విధంగా విజృంభిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. వీధి కుక్కలు కరిచిన వెంటనే సకాలంలో వైద్యం చేయించుకోవాలని, వ్యాక్సిన్ వేయని కుక్కలు కరిస్తే రేబీస్ వ్యాధి వ్యాపించి మనిషి మరణానికి కారణం అవుతుందనే కారణంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కుక్కలు గుంపులుగా తిరుగుతూ ఒంటరి మహిళలు, చిన్నారులపై తరచు దాడులకు తెగ పడుతున్నాయి. రోడ్లపై నుంచి వెళ్లే వాహనదారులపై కూడా దాడులు చేస్తున్నాయి. దాంతో కుక్కలను చూస్తేనే జనాలు జంకుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో దాడుల్లో అధికంగా ఉంటున్నాయని బాధితులు వాపోతున్నారు. అంతేకాకుండా గొర్రెలు, మేకలపై సైతం దాడి చేసి చంపుతున్నాయని, గ్రామాల్లో కుక్కల నివారణకు పంచాయతీ అధికారులు చొరవ తీసుకోవాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
ఇటీవల పెరుగుతున్న కేసులు
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. గద్వాలలోని వీధులలో కుక్కల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. అలంపూర్ నియోజకవర్గంలోని వల్లూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తిపై వీధి కుక్క దాడి చేయడంతో ముఖంపై తీవ్రమైన గాయాలయ్యాయి. ఇటిక్యాల మండలం ఉదండపురం గ్రామంలో చికెన్ షాప్ దగ్గరలో ఆ షాప్ నిర్వాహకులు వేసిన వ్యర్థాల కోసం కుక్కల గుంపు వాటికోసం కొట్లాడుతుండగా సమీపంలో వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసింది.
చర్యలు తీసుకుంటాం.. గద్వాల జానకి రామ్ సాగర్, మున్సిపల్ కమిషనర్
గద్వాల మున్సిపాలిటీలో వీధి కుక్కలు నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే వాటి గుర్తింపు ప్రక్రియ మొదలైంది. రానున్న రోజుల్లో వాటిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తాం.
