Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ బాలుర సంక్షేమ వసతి గృహంలో రాత్రి భోజనం చేసి అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించినట్లు, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ తెలిపారు. గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఉదయం కలెక్టర్ పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలువురు విద్యార్థులతో మాట్లాడి, చికిత్స అనంతరం వసతి గృహానికి వెళ్లవచ్చు అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం జరుగుతుందని వారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.
Also Read: Jogulamba Gadwal: ఆ జిల్లాలో మాముళ్ల మత్తులో అధికారులు.. రహదారి పక్కనే సిట్టింగ్‌లు!
54 మంది విద్యార్థులు అస్వస్థత
వసతి గృహంలో మొత్తం 140 మంది విద్యార్థులకు గాను 110 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. రాత్రి క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మొదటిసారి కలిపి వండడంతో ఈ ఆహారం పడని 54 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. విషయం తెలిసిన వెంటనే అంబులెన్స్లను పంపించి విద్యార్థులను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. తమ అధికార యంత్రాంగం రాత్రంతా ఆసుపత్రిలోనే ఉండి ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించినట్లు తెలిపారు. తాను కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించినట్లు చెప్పారు. చికిత్స అనంతరం 32 మంది విద్యార్థులు బాగుండడంతో ఉదయం వారిని డిశ్చార్జి చేసినట్లు పేర్కొన్నారు.
ఫుడ్ పాయిజన్ కు బాయిలర్ ఎగ్ కూడా కారణం
మిగిలిన 22 మంది విద్యార్థులను కూడా వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి మధ్యాహ్నం వరకు డిశ్చార్జి చేయడం జరుగుతుందన్నారు. ఫుడ్ పాయిజన్ కు బాయిలర్ ఎగ్ కూడా కారణమని ఆరోపణలు వస్తుండడంతో శాంపిల్స్ ఉంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ కు పంపించి పరీక్షలు చేయిస్తామన్నారు. ఈ సంఘటనపై సమగ్రంగా విచారణ జరిపించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే బాధ్యులైన వారిని సస్పెండ్ చేస్తామన్నారు. నెల క్రితం తాను ఈ వసతి గృహాన్ని సందర్శించానని, వారానికి కనీసం మూడు విద్యాసంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ సమస్యలు ఉంటే పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
ఆయా వసతి గృహాల్లో ఇప్పటికే ఫుడ్ కమిటీలను ఏర్పాటు చేసి అందులోని సభ్యులు వండిన భోజనం తిన్నాకే, మిగతా విద్యార్థులకు వడ్డించడం జరుగుతుందన్నారు. కూరగాయలు, సరకుల నాణ్యతను ఫుడ్ కమిటీ సభ్యులు తనిఖీ చేస్తారని, నాణ్యత లేనివి సరఫరా చేసే గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని వసతి గృహాలకు ప్రత్యేక అధికారులను నియమించామని, స్థానిక తహసిల్దార్లు సైతం నెలలో రెండు రోజులు సంబంధిత వసతి గృహాలను సందర్శిస్తారన్నారు. ఇకనుంచి వారానికోసారి సందర్శించేలా ఆదేశాలు జారీ చేస్తామని, అలసత్వం వహించే అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ ఇందిర, గద్వాల తహసిల్దార్ మల్లికార్జున్ తదితరులున్నారు.
విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యేలు
ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ బాలుర వసతి గృహంలో ఆహ్వానంతిని అస్వస్థకు గురికాగా ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి విజయుడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇందిరను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వారి ఈ సందర్భంగా వైద్యులకు సూచించారు. అదేవిధంగా బిఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జ్ బాసు హనుమంతు నాయుడు, జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి స్నిగ్ధ రెడ్డి, ఎర్రవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ విద్యార్థులను పరామర్శించారు. హాస్టల్లో నాణ్యతమైన పౌష్టిక ఆహారాన్ని అందించే విషయంలో హాస్టల్ వార్డెన్, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
ఎస్సి గురుకుల హాస్టల్ లో ముగ్గురికి అస్వస్థత
ఎర్రవల్లి మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ గురుకుల హాస్టల్ లో సైతం ఉదయం అల్పాహారం జీరా రైస్ తిన్న ముగ్గురు విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి రావడంతో ఆ విద్యార్థులను హుటాహుటిన గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read: BJP Jogulamba Gadwal: పార్టీ పటిష్టతకు కృషి చేయాలి.. జిల్లా బిజెపి అధ్యక్షుడు రామాంజనేయులు
