New Advanced Bus: రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ సేవలను విస్తరించేందుకు మరో మూడు అధునాతన బస్ టెర్మినల్స్ (బస్ స్టేషన్లు) ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. నగరంలో పెరుగుతున్న జనాభాకు ఎలాంటి రాకపోకల ఇబ్బందులు కలుగకుండా, నగరం నాలుగు వైపులా బస్ స్టేషన్లు ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే అధికారులకు స్థల సేకరణపై ఆదేశాలు జారీ చేయగా, త్వరలోనే వారు ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. అధికారుల నుంచి నివేదిక అందగానే బస్సు డిపోల ఏర్పాటు పనులు ప్రారంభం కానున్నాయి.
Also Read: Amberpet Drug Bust: భారీగా గంజాయి డ్రగ్స్ సీజ్.. ఎక్సయిజ్ సిబ్బందిపై కత్తులతో దాడికి యత్నం!
సీఎం ఆలోచనలకు అనుగుణంగా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా, గ్రేటర్‌లోని జేబీఎస్ (జూబ్లీ బస్ స్టేషన్) మాదిరిగా అధునాతన బస్సు టెర్మినల్స్‌ను ఉప్పల్, ఆరంఘర్, ఫోర్త్ సిటీలలో నిర్మించాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆరంఘర్‌లో టెర్మినల్ నిర్మాణం కోసం ఆర్టీసీ, పోలీసు శాఖలకు సంబంధించిన భూ బదలాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ఉప్పల్, ఫోర్త్ సిటీలలో బస్ టెర్మినల్ నిర్మాణం, బస్ సౌకర్యాలపై అధ్యయనం చేయాలని సూచించారు. పెరుగుతున్న కొత్త కాలనీలకు రవాణా సౌకర్యాలు కల్పించడానికి, డిమాండ్‌కు అనుగుణంగా కొత్త రూట్లలో బస్సులు నడిపించేందుకు చర్యలు చేపడుతున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అధికారుల నుంచి నివేదిక అందిన వెంటనే ఈ బస్సు డిపోల ఏర్పాటు పనులు ప్రారంభం కానున్నాయి.
లాభాల బాట కోసం
మరోవైపు, నష్టాల్లో ఉన్న తాండూరు, వికారాబాద్, బీహెచ్ఈఎల్, మియాపూర్, దిల్ సుఖ్ నగర్ వంటి పలు డిపోలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నష్టాలకు గల కారణాలు, వాటిని లాభాల బాట పట్టించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీని వేయనున్నారు. ఈ కమిటీలో డ్రైవర్, కండక్టర్‌లకు సైతం అవకాశం కల్పించడం ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవాలని భావిస్తున్నారు. అలాగే, ప్రమాదాలను తగ్గించడానికి, తొలి దశలో లహరి, రాజధాని, గరుడ బస్సుల్లో అమలవుతున్న డ్రైవర్ మానిటరింగ్ సిస్టం పనితీరును మెరుగుపర్చాలని నిర్ణయించారు. అద్దె బస్సు డ్రైవర్లకు నిరంతరం శిక్షణ ఇచ్చి, ప్రతి బస్సుకి ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరి అనే నిర్ణయాన్ని కఠినతరం చేయబోతున్నారు.
Also Read: Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం.. వి. కావేరి ట్రావెల్స్ యజమాని అరెస్ట్
