Jubilee Hills By Election: బీఆర్ఎస్ పార్టీ ఒక వైపు ప్రచారం, మరోవైపు సోషల్ మీడియాను నమ్ముకున్నది. సోషల్ మీడియాలో పోస్టులతో ప్రజలను ఆకట్టుకోవచ్చని భావించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కంటే సోషల్ మీడియాకే మొగ్గుచూపారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో ప్రధాన అస్త్రంగా వాడారు. కాంగ్రెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలపై స్టంట్లు చేయించారు. మొబైల్ ఉన్నవారు ఓపెన్ చేస్తే చాలు బీఆర్ఎస్ చేసిన వీడియోలు దర్శనం ఇచ్చాయి. రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ఏఐతో వీడియోలు చేయించారు. కానీ, ఇవేమీ వర్కవుట్ కాలేదు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ వర్గాలు షాక్‌కు గురయ్యాయి.
Also Read: Jubilee Hills By Election: పోలింగ్ ముగిసిన తర్వాత సర్వేలు రిలీజ్ చేసిన సంస్థలు.. ఎలా ఉన్నాయంటే..!
ఎంత చేసినా పోయిన పరువు
నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారంలో ఏఐ వీడియోలతో పాటు ప్రభుత్వ హామీలు, గ్యారెంటీలపై ఎల్ఈడీ స్క్రీన్లతో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ వైఫల్యాలు అంటూ ప్రజలకు వివరించారు. కానీ ప్రజలు మాత్రం విశ్వసించలేదు. అంతేకాదు ప్రజల ఓపినియన్‌తో అనుకూలమైన యూట్యూబ్ ఛానళ్లతో ఇంటర్య్వూలు చేయించి విస్తృత ప్రచారం చేశారు. గడగడపకు వెళ్లారు. కరపత్రాలతోనూ ప్రచారం నిర్వహించారు. ఏదీ ఫలించలేదు. బీఆర్ఎస్ పార్టీకి పట్టున్న నియోజకవర్గంలోనూ విజయం సాధించలేకపోవడంతో పరువు పోయింది.
బీఆర్ఎస్‌ను నమ్మని ప్రజలు
బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను పటిష్టం చేసింది. ప్రభుత్వం చేసే ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు నిలదీస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ఉన్న సోషల్ మీడియా టీం విస్తృత ప్రచారం చేస్తున్నది. అయినప్పటికీ ప్రజల నుంచి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఫలితాలను రాబట్టడంలో చతికిలపడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రజలు ఎందుకు విశ్వసించ లేదని నేతలు చర్చించుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీపై పూర్తి స్థాయిలో ప్రజల్లో పూర్తిగా వ్యతిరేక రాలేదని, ఇంకా ఇచ్చిన హామీలను అమలు చేస్తుందనే విశ్వసంతో ఉన్నారని స్పష్టమవుతున్నది. ఏది ఏమైనప్పటికీ జూబ్లీహిల్స్‌లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ పార్టీ తెల్లముఖం వేసినట్లయింది.
Also Read:Jubilee Hills By Election: స్వల్ప సంఘటనల మినహా.. పోలింగ్ అంతా ప్రశాంతం
