Jubilee Hills By Election (imagecredit:swetcha)
తెలంగాణ, హైదరాబాద్

Jubilee Hills By Election: స్వల్ప సంఘటనల మినహా.. పోలింగ్ అంతా ప్రశాంతం

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ మంగళవారం స్వల్ప సంఘటనల మినహా ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు 4 లక్షల 1365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు 139 ప్రాంతాల్లోని మొత్తం 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఉదయం అయిదు గంటల నుంచి దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లలో మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత సాధారణ పోలింగ్ ను ఉదయం ఏడు గంటల నుంచి అనుమతించారు. ఉదయం ఏడు నుంచి పది గంటల వరకు కొన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద అసలు ఓటర్లే కన్పించలేదు. పదిన్నర పదకొండు గంటల నుంచి నమ్మెదిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నాం రెండు గంటల వరకు మందకోడిగా సాగింది. ఆ తర్వాత సాయంత్రం నాలుగున్నర అయిదు గంటల తర్వాత పోలింగ్ పుంజుకుంది. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నాం రెండు గంటల వరకు చాలా పోలింగ్ స్టేషన్ల వద్ద వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొందరు వయోవృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీల్ చైర్లలో ఎంతో ఆసక్తిగా రాగా, మధ్యాహ్నాం మూడు గంటల తర్వాత యువ ఓటర్లు ఓటింగ్ కోసం కదిలారు.

ప్రలోభాలకు గురి..

షేక్ పేట(Sheikh Peta,), యూసుఫ్ గూడ(Yusuf Guda,), ఎర్రగడ్డ(Erragadda) డివిజన్లలో పలు చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్(Congress) నేతల మధ్య స్వల్ప వివాదాలు చోటుచేసుకున్నాయి. షేక్ పేట డివిజన్ లోని అజీజ్ బాగ్, పారామౌంట్ కాలనీలోని పోలింగ్ స్టేషన్ల వద్ద కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియుద్దిన్ హల్ చల్ చేశారు. కాంగ్రెస్ కు ఓట్లు వేయాలని ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ బీఆర్ఎస్(BRS) ఆరోపించింది. దీంతో అక్కడ వాగ్వాదం చోటుచేసుకుంది. ఓటర్లను, పోలింగ్ ఏజెంట్లను ప్రలోభాలకు గురి చేసేలా డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ పలు పోలింగ్ స్టేషన్ల బయట బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పర ఆరోపణలు, ఫిర్యాదులను చేసుకున్నారు. ముఖ్యంగా ఎన్నికల బరిలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వెంగళరావునగర్ కాలనీలో, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ యూసుఫ్ గూడలో బీజేపీ అభ్యర్థి లంకెల దీపక్ రెడ్డి శ్రీనగర్ కాలనీలో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. అభ్యర్థులు నియోజకవర్గంలోని పలు పోలింగ్ స్టేషన్లను సందర్శించి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. సాయంత్రం మూడు తర్వాత యువ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు.

Also Read: Gold Price Today: ఒక్క రోజే భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్? ఈ దెబ్బతో ఇక బంగారం కొనలేరేమో ..?

ఉత్సాహంగా పాల్గొన్న యువ‌త‌

వాస్త‌వానికి గ్రేట‌ర్ హైద‌రాబాద్ అంతటా ఏ ఎన్నిక జ‌రిగినా ఓటింగ్ శాతం 50 శాతం లోపే పోలింగ్ శాతం నమోదవుతుంది. కానీ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రెండేళ్ళ క్రితం సాయంత్రం అయిదు గంటల కల్లా పోలింగ్ స్టేషన్ లోకి వచ్చిన వారిని ఓటింగ్ కు అనుమతించగా 48.82 శాతం మాత్ర‌మే పోలింగ్ శాతం నమోదైంది. 2014 లో మాత్ర‌మే 50 శాతం పోలింగ్ దాట‌గా, అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ పోలింగ్ శాత త‌గ్గుతూ వ‌చ్చింది. ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం అధికారులు నిర్వహించిన స్వీప్ కార్యక్రమాలు మంచి ఫలితాలనిచ్చాయనే చెప్పారు. ఉదయం నుంచి ఓటింగ్ కు రాని యువత మధ్యాహ్నాం తర్వాత ఒక్కసారిగా కదిలారు. మొత్తం 4 ల‌క్ష‌ల‌కు పైగా ఓట‌ర్‌లుంటే వీరిలో 46 శాతం 18 నుంచి 39 లోపు వారే. ఇందులో 18 నుంచి 29 వ‌య‌సున్న వారు 21 శాతం ఉంటే, 30 నుంచి 39 వ‌ర‌కు వ‌య‌స్సున్న వారు 25 శాతం. ఈ 46 శాతం నుంచి ఈ సారి భారీగానే ఓటింగ్ న‌మోదైంద‌ని అధికారులు అంఛనాలు వేస్తున్నారు. సాయంత్రం ఆరు గంటల కల్లా నమోదైన 48.42 శాతం నమోదు కాగా, ఇందులో 46 శాతం లోనే యువ‌త ఓటింగ్‌లో పాల్గొంటుంద‌ని ముందే ఎన్నికల సంఘం అధికారులు అంచ‌నా వేశారు. అంఛనాలు తగిన విధం

పోలింగ్ సరళి కొనసాగిందిలా…

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా ఉదయం ఏడు గంటల నుంచి సాధారణ పోలింగ్ కోసం ఓటర్లను అనుమతించినా, పది గంటల వరకు చాలా పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు కన్పించలేదు. ముఖ్యంగా ఈ సారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని సాయంత్రం అయిదు గంటల నుంచి ఆరు గంటల వరకు అదనంగా ఓ గంటను పెంచినా, పెద్దగా ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం పెరగలేదనే చెప్పవచ్చు. సాయంత్రం ఆరు గంటల కల్లా పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన ఓటర్లకు ఓటింగ్ కు అనుమతించాల్సి ఉన్నా, కొన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు పలు పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లను వెనక్కి పంపించేసినట్లు ఓటర్లు వాపోయారు. ఉదయం తొమ్మిది గంటలకు పోలింగ్ శాతం 9.2 గా నమోదు కాగా, 11 గంటలకు 20.76 గా, ఆ తర్వాత ఒంటి గంటలకు 31 శాతం కాగా, మూడు గంటలకు 40.20 శాతంగా, సాయంత్రం అయిదు గంటలకు 47.16 శాతంగా నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. పలు పోలింగ్ స్టేషన్లలో ఆరు గంటల్లోపు వచ్చిన ఓటర్లను ఓటింగ్ కు అనుమతించటంతో రాత్రి వరకు ఓటింగ్ కొనసాగింది. 

Also Read: Neutral Voters: తటస్థ ఓటర్లపై అన్ని పార్టీల దృష్టి.. అందరి చూపు అటువైపే..!

పోలింగ్ ముగిసిన సమయంలో తీవ్ర ఉద్రిక్తత

పోలింగ్ ముగిసే సమయానికి యూసుఫ్ గూడలోని ఒక ఫంక్షన్ హాల్ వద్ద తీవ్ర ఉద్రిక్తతత చోటుచేసుకుంది. అక్కడ గుంపులు గుంపులుగా వందలాది మంది జనం గుమిగూడటం, వారికి కాంగ్రెస్ అభ్యర్థి ఆశ్రయమివ్వటం తీవ్ర దుమారం రేపింది. వారందర్నీ పోలీసులు చెదరగొట్టారు. రోజువారి ప్రచారం కోసం, కార్యకర్తలుకు భోజన వసతి కోసం ఫంక్షన్ హాల్ తీసుకున్నామని, ఈరోజు కొత్తగా వచ్చిన వారు కాదని కాంగ్రెస్ నేతలు వాదిస్తుండగా, పోలింగ్ రోజు ఎలా ఉండనిస్తారంటూ బీఆర్ఎస్ నేతలు వాదనకు దిగటంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ రోజున ఇతర ప్రాంతాల వ్యక్తులను ఒక ఫంక్షన్ హాల్ లో ఉంచి భారీగా దొంగ ఓట్లు వేయించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఉద్రిక్తత చోటుచేసుకుందన్న విషయాన్ని తెల్సుకున్న కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ అక్కడకు చేరుకోగా, పోలీసులు జోక్యం చేసుకుని, ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలను అక్కడి నుంచి పంపించేశారు. కాంగ్రెస్ నేతలు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కృష్ణానగర్ లో థర్నా నిర్వహించటంతో అక్కడ కూడా అలజడి నెలకొంది.

మరో అయిదు కోడ్ ఉల్లంఘన కేసులు

పోలింగ్ జరిగిన మంగళవారం మరో అయిదు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసులను నమోదు చేసినట్లు ఎలక్షన్ అధికారులు తెలిపారు. ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, శ్రీరామదాసు, రామ్ చందర్ నాయక్ లపై మధురానగర్ పోలిస్ స్టేషన్ పరిధిలో కోడ్ ఉల్లంఘన కేసు నమోదు కాగా, మాజీ ఎమ్మెల్యే మెత్కు ఆనంద్, వినయ్ భాస్కర్ లపై బోరబండ పోలీస్ స్టేషన్ లో కోడ్ ఉల్లంఘన కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Also Read: Islamabad Blast: ఇస్లామాబాద్ కోర్టు ప్రాంగణంలో భారీ పేలుడు.. 12 మంది మృతి, 20 మందికి గాయాలు

Just In

01

Varanasi Glimpse: ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే.. మహేష్ బాబు ఇరగదీశాడుగా

New Bus Stations: ప్యాసింజర్లకు గుడ్‌న్యూస్.. గ్రేటర్ హైదరాబాద్‌లో మరో 3 బస్‌స్టాండ్లు.. ఎక్కడెక్కడో తెలుసా?

Farooq Abdullah: ఉగ్రదాడిలో వైద్యుల ప్రమేయంపై ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు… తీవ్ర వివాదాస్పదం

AV Ranganath: బతుకమ్మకుంట బాగుందా? వాకర్లతో ముచ్చటించిన హైడ్రా కమిషనర్!

Rahul Gandhi: వెరీ గుడ్ రేవంత్ టీమ్ వర్క్ సూపర్ గో హెడ్.. రాహుల్ గాంధీ కాంప్లిమెంట్!