Rohini Acharya: బీహార్‌లో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్న ఆర్జేడీ (RJD) ఆశలు గల్లంతయ్యాయి. శుక్రవారం వెలువడిన బీహార్ అసెంబ్లీ ఫలితాల్లో ఆ పార్టీ దారుణ ఓటమిని మూటగట్టుకుంది. రాష్ట్రంలో 243 శాసన సభ స్థానాలు ఉండగా, మహాఘట్‌బంధన్‌లో భాగస్వామిగా ఉన్న ఆ పార్టీకి కేవలం 25 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో, పార్టీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), పార్టీని అన్నీతానై నడిపిస్తున్న తేజశ్వి యాదవ్ (Tejaswi Yadav) తీవ్ర విచారంలో మునిగిపోయారు. ఈ బాధ నుంచి కనీసం తేరుకోక ముందే లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాజకీయాల నుంచి నిష్ర్కమిస్తున్నట్టు లాలూ కూతురు, తేజశ్వి సోదరి రోహిణి ఆచార్య (Rohini Acharya) శనివారం ప్రకటించారు. తన కుటుంబంతో సంబంధాలను పూర్తిగా తెంచుకున్నట్టు ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన మరుసటి రోజే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్జేడీ రెబల్ నేత సంజయ్ యాదవ్, తన భర్త రమీజ్ ఆలం సలహా మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు ఆమె వెల్లడించారు. నిందలన్నీ తన మీదే వేసుకుంటున్నానని ఆమె వ్యాఖ్యానించారు.
Read Also- PM Narendra Modi: నితీష్ మిత్రపక్షాలకు అభినందనలు: ప్రధాని మోదీ
ఎన్నికల ముందు నుంచే వివాదం
కుటుంబంలో వివాదం ఏమిటో బహిరంగంగా తెలియరాలేదు. కానీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే రోహిణి వైఖరి చర్చనీయాంశంగా మారింది. ఆమె ప్రవర్తనపై చర్చ జరిగింది. ఎన్నికలకు ముందే లాలూ ప్రసాద్ యాదవ్, సోదరుడు తేజస్వి యాదవ్‌ల ఎక్స్ హ్యాండిల్స్‌ను అన్‌ఫాలో చేశారు. అప్పటినుంచి భావోద్వేగంతో, నిగూఢార్థాలతో వరుసగా పెడుతున్నారు. ఆర్జేడీకి, తేజస్వి యాదవ్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ వచ్చారు. రోహిణి వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీలో, కుటుంబంలో నెలకొన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. నిజానికి 2022లో విబేధాలు వెలుగుచూశాయి. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు రోహిణి కిడ్నీ దానం చేశారంటూ వార్తలు వచ్చాయి. కానీ, ఆమె కిడ్నీ దానం చేసిన మాట అవాస్తవమని, అవన్నీ పుకార్లేనంటూ ప్రచారం జరిగింది. తేజస్వి యాదవ్‌కు విశ్వాసపాత్రుడైన ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్ కూడా వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని రోహిణితో పాటు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా జీర్ణించుకోలేకపోయారు.
Read Also- Mahesh Babu: నాన్న.. నువ్వు గుర్తొస్తున్నావ్.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్, ఫ్యాన్స్ కన్నీళ్లు
కాగా, రోహిణి ఆచార్య వృత్తిరీత్యా ఒక డాక్టర్. అయితే, కొన్నాళ్లు పార్టీలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని సారన్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ, బీజేపీ అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూడీ చేతిలో భారీ వ్యత్యాసంతో ఓటమి పాలయ్యారు.
ఫ్యామిలీ వివాదాలు కొత్తేం కాదు
లాలూ యాదవ్ కుటుంబంలో రాజకీయాలు చిచ్చుపెట్టడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మే నెలలో లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. అనుష్క యాదవ్ అనే మహిళతో 12 ఏళ్లుగా తాను రిలేషన్‌లో ఉన్నానంటూ తేజ్ ప్రతాప్ యాదవ్ ఫేస్‌బుక్‌లో ప్రకటన చేయడం వివాదాస్పదం అయింది. భార్యతో విడాకుల కేసు కొనసాగుతుండగానే ఈ ప్రకటన చేయడంతో ప్రత్యర్థి పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. దీంతో, నైతిక విలువలు తప్పారనే కారణాన్ని చూపుతూ 12 ఏళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ పార్టీ నిర్ణయించుకుంది. కుటుంబ విలువలకు విరుద్ధంగా వ్యవహరించాడని లాలూ ఫ్యామిలీ మండిపింది.
