Nowgam Blast: నౌగాం ఘటనపై అధికారుల క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ పేలుడు ఘటనను ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కి లింకు పెట్టి ఎన్నో వార్తలు రాశారు. కానీ, వాటిలో ఎలాంటి నిజం లేదని చెప్పారు. జమ్మూ –కాశ్మీర్ నౌగాం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. అయితే, ఈ విషయంలో ఇతర కారణాలు ఏంటా అని ఆలోచించాల్సిన అవసరం లేదని జమ్ము & కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ నలిన్ ప్రభాత్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
Also Read: Delhi Blast: ఉగ్రదాడులకు ప్లాన్ చేసింది ఎక్కడ?, ఎంత డబ్బుతో?, కెమికల్స్ ఎక్కడివి?.. వెలుగులోకి అసలు!
నౌగాం ఘటనపై అధికారుల క్లారిటీ..
శనివారం శ్రీనగర్ PCRలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడిన DGP, పేలుడు పదార్థాలను భారీ మొత్తంలో స్వాధీనం చేసి కాశ్మీర్‌కు తరలించి, నౌగాం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓపెన్ ఏరియాలో భద్రంగా ఉంచినట్లు తెలిపారు. ఈ పదార్థాల ఫోరెన్సిక్, కెమికల్ అనాలిసిస్ కోసం శాంపిలింగ్ ప్రక్రియ నిన్నటి నుంచే కొనసాగుతున్నట్లు ఆయన వివరించారు. అయితే, పదార్థాల స్వభావం అస్థిరంగా ఉండటం వల్ల అత్యంత జాగ్రత్తగా శాంపిలింగ్ జరుగుతున్న సమయంలోనే, శుక్రవారం ఉదయం 11:20 గంటలకు ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. “ ఈ ఘటనకు మరేదైనా కారణం ఉందని చెప్పే ఊహాగానాలు పూర్తిగా అవసరం లేవు,” అని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 27 మంది గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో ఒక స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (SIA) అధికారి, FSLకు చెందిన 3 మంది, 2 ఫోటోగ్రాఫర్లు, 2 రెవెన్యూ అధికారులు, మరియు ఒక టైలర్ ప్రాణాలు కోల్పోయినట్లు DGP వెల్లడించారు. అదేవిధంగా, 27 మంది పోలీసులు, 2 రెవెన్యూ సిబ్బంది, సమీప ప్రాంతాల నుంచి 3 మంది పౌరులు గాయపడ్డారని తెలిపారు. గాయపడిన వారందరినీ దగ్గర్లో ఉన్న ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
పేలుడు తీవ్రతతో నౌగాం పోలీస్ స్టేషన్ భవనం దెబ్బతిందని, సమీప భవనాలు కూడా నష్టపోయాయని DGP పేర్కొన్నారు. “ఈ దుర్ఘటనకు దారి తీసిన అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. బాధిత కుటుంబాలకు ఈ కష్ట సమయంలో జమ్మూ –కాశ్మీర్ పోలీస్ పూర్తి మద్దతుగా నిలుస్తుంది,” అని నలిన్ ప్రభాత్ వెల్లడించారు.
