Delhi Blast: యావత్ దేశం ఉలిక్కిపడేలా గత సోమవారం రాత్రి జరిగిన ‘ఢిల్లీ పేలుడు’ (Delhi Blash) ఘటనపై దర్యాప్తు ముందుకు సాగుతున్నాకొద్దీ మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. డిసెంబర్ 6న దేశవ్యాప్తంగా పేలుళ్లు జరపాలని భారీ ఉగ్రకుట్ర పన్నగా, ఇందుకోసం ప్రణాళికలు రూపొందించింది ఎక్కడ?, ఎంత డబ్బు సిద్ధం చేసుకున్నారు?, ఇందుకు సంబందించిన కీలక విషయాలను దర్యాప్తు ఏజెన్సీలు (Delhi Blash Investigation) గుర్తించాయి. ఢిల్లీ పేలుడు ఘటనలో కారుతో ఆత్మహుతి దాడికి పాల్పడిన మొహమ్మద్ ఉమర్ నబీతో (Mohammad Umar) పాటు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మరో ముగ్గురు డాక్టర్లు డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ అదీల్ రథర్, డాక్టర్ షహీద్ సయీద్ పేలుళ్ల కుట్రలో భాగస్వాములుగా ఉన్నారు.
ఈ నలుగురు డాక్టర్లు కలిసి ఢిల్లీ అంతటా ఉగ్రదాడులు నిర్వహించడానికి రూ.20 లక్షల డబ్బును సమకూర్చారని దర్యాప్తు వర్గాలు పసిగట్టాయి. 1992లో అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత రోజైన డిసెంబర్ 6న ఈ పేలుళ్లు జరపాలని స్కెచ్ వేశారు. కానీ, అది వర్కౌట్ కాకపోవడంతో సైలెంట్ అయ్యారు. దీంతో, ఆ డబ్బును భద్రంగా ఉంచాలని డాక్టర్ ఉమర్‌కు బాధ్యతలు అప్పగించారు.
కెమికల్స్ ఎక్కడ కొన్నారు?
డిసెంబర్ 6 ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో సిద్ధం చేసుకున్న రూ.20 లక్షల డబ్బుతో గురుగ్రామ్, నూహ్, సమీప పట్టణాల మార్కెట్ల నుంచి దగ్గరదగ్గరగా 26 క్వింటాళ్ల ఎన్‌పీకే (Nitrogen (N), Phosphorus (P), and Potassium ) ఎరువును పెద్ద పరిమాణంలో కొన్నారు. ఇందుకుగానూ సుమారు రూ. 3 లక్షలు ఖర్చు పెట్టారు. ఈ రసాయన పదార్థాలను శుద్ధి చేసి పేలుడు పదార్థాలు తయారీలో ఉపయోగించాలని ప్లాన్ చేశారు.
Read Also- Emerging New AP: ఏపీకి నూతన శకం!.. పెరుగుతున్న పెట్టుబడులు.. భవిష్యత్‌పై చిగురిస్తున్న ఆశలు!
అల్ ఫలా వర్సిటీ.. రూమ్ నంబర్ 13
హర్యానా – ఢిల్లీ సరిహద్దు నుంచి కేవలం 27 కి.మీ దూరంలో ఉండే అల్ ఫలా యూనివర్సిటీలో ఉగ్రదాడులకు ప్లాన్లు జరిగాయని దర్యాప్తు బృందాలు ఒక అంచనాకు వచ్చాయి. వర్సిటీ క్యాంపస్‌లో డాక్టర్లు సమావేశమయ్యే రూమ్ ఉగ్ర ప్రణాళికలకు వేదికైంది. ఆత్మహుతికి పాల్పడ్డ డాక్టర్ ఉమర్, అతడి సహచరులు 17వ నంబర్ బిల్డింగ్‌లోని హాస్టల్‌లో రూమ్ నంబర్-13లో రహస్యంగా సమావేశమయ్యేవారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ రూమ్ డాక్టర్ ముజామ్మిల్‌కు చెందినదని, ఉగ్రవాదులు రెగ్యులర్‌గా ఇక్కడ కలుసుకునేవారని, యూపీతో పాటు ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో దాడులు జరపాలని ఈ గదిలోనే చర్చలు జరిపి, ప్రణాళికలు వేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
బాంబులు తయారీకి యూనివర్సిటీ ల్యాబ్ నుంచి కెమికల్స్‌ను అక్రమంగా తరలించాలని మొదట ప్లాన్ వేసుకున్నారు. వర్సిటీ ల్యాబ్ డాక్టర్ ముజామ్మిల్ రూమ్ నుంచి కొన్ని మీటర్ల దూరంలోనే ఉంది. అందులోనూ డాక్టర్ ఉమర్, డాక్టర్ షాహీన్ ఇద్దరూ వర్సిటీ ఫ్యాకల్టీ మెంబర్లుగా ఉండడంతో కెమికల్స్‌ను ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వాటిని ఫరీదాబాద్‌లోని ధౌజ్, తగా గ్రామాలలో రెంట్‌కు తీసుకున్న గదుల్లో నిల్వ చేశారు. ప్రస్తుతం డాక్టర్ ముజామ్మిల్ రూమ్‌ను దర్యాప్తు అధికారులు సీజ్ చేశారు. అయితే, ఆ గదిలో పలు ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఏవో కొన్ని కోడ్ పదాలు, ఎన్‌క్రిప్టెడ్ మెసేజులతో కూడిన రెండు డైరీలను కూడా దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ డైరీల్లో ‘ఆపరేషన్’ అనే పదాన్ని పదేపదే ప్రస్తావించినట్టు దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి.
