Jubilee Hills By poll: జూబ్లీహిల్స్‌లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం స్వీప్ కార్యక్రమాలను నిర్వహించినా ఫలితం దక్కలేదు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం నామినేషన్ల స్వీకరణ చివరి తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదుకు ఛాన్స్ ఇచ్చింది. అంతేకాదు పోలింగ్ సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు అదనంగా ఓ గంట పెంచింది. ఇలా ఎన్నికల సంఘం చేసిన ప్రయత్నాలన్నీ కేవలం ఒక్క శాతం పోలింగ్ పెంపునకే పరిమితమైంది.
కొత్తగా నమోదైన 6 వేల పై చిలుకు
జూబ్లీహిల్స్ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ జారీ కాక ముందు నుంచే 18 ఏళ్ల వయస్సు నిండిన వారు ఓటరుగా వివరాలను నమోదు చేసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న విషయంపై స్వీప్ కార్యక్రమాలను నిర్వహించారు. అయినా ఓటర్లలో ఆశించిన చైతన్యం రాలేదు. కానీ, ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్‌లో వయోవృద్ధులు, దివ్యాంగులు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తగా నమోదైన 6 వేల పై చిలుకు ఓటర్లలో కనీసం సగం మంది యువత కూడా ఓటు హక్కును వినియోగించుకోలేదు.
పెరిగింది ఒక్క శాతం కన్నా తక్కువే
2023 అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న 4లక్షల 1365 ఓటర్ల కన్నా తక్కువగా 3,75,430 ఓటర్లు ఉండగా, ఉన్న ఓటర్లు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో 47.58 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ నెల 11న జరిగిన పోలింగ్‌లో 48.49 శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం బుధవారం అధికారికంగా ప్రకటించింది. అదీ పోలింగ్‌కు సాయంత్రం గంట సమయం పెంచినా ఏ మాత్రం ప్రభావం చూప లేకపోయింది. అంటే ఎన్నికల షెడ్యూల్ రాక ముందు నుంచే స్వీప్, ఓటరు అవగాహన, చైతన్య కార్యక్రమాలతో కనీసం ఓటింగ్ శాతాన్ని 50 దాటుతుందని ఎన్నికల సంఘం అధికారులు వేసిన అంచనాలన్నీ తారు మారై కేవలం ఒక్క శాతం లోపే అంటే నియోజకవర్గంలోని 407 పోలింగ్ స్టేషన్లలో కలిపి కేవలం నాలుగు వేల ఓట్లు మాత్రమే పెరిగినట్లు అంకెలు చెబుతున్నాయి.
84, వికలాంగులు 19 మంది హోమ్ ఓటింగ్
పోలింగ్ శాతాన్ని పెంచాలన్న ఎన్నికల సంఘం ప్రయత్నాల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ వరకు కొత్త ఓటర్ల నమోదు, 80 ఏళ్ల వయస్సు దాటిన వారికి హోమ్ ఓటింగ్ కల్పించగా, వారిలో 103 మంది పోలింగ్ కేంద్రాలకు రాలేని వృద్ధులు 84, వికలాంగులు 19 మంది హోమ్ ఓటింగ్ కు దరఖాస్తు చేసుకోగా, వీరిలో ఒకరు మినహా మిగిలిన వారంతా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవటంపై మహిళలు, వృద్దులు, వికలాంగులు చూపిన చొరవ కొత్త ఓటర్లు, యువ ఓటర్లు చూపలేదన్న విషయం నమోదైన పోలింగ్ శాతంతో తేలిపోయింది. అయితే, మున్ముందు జరిగే పలు ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు స్వీప్, స్వయం సహాయక బృందాలు ఎలా పని చేస్తాయోనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ రాకముందు నుంచి చేసిన అన్ని ప్రయత్నాలు కనీసం ఒక్క శాతం సంపూర్ణ పోలింగ్ ను పెంచలేకపోయిన అంశంపై జిల్లా ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు కూడా తెలిసింది.
