30 Vote Victory: ఎన్నికల్లో మెజారిటీ లక్ష ఓట్లు అయినా, ఒక్క ఓటు అయినా గెలిచినట్టే. నరాలు తెగే ఉత్కంఠ మధ్య, భరించలేనంత టెన్షన్‌తో అత్యుల్ప స్థాయి మెజారిటీ గట్టెక్కిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మన దేశంలో చాలామందే ఉన్నారు. అయితే, శుక్రవారం వెలువడిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Bihar Election Result) ఓ అభ్యర్థి కేవలం 30 ఓట్ల అతి స్వల్ప మెజారిటీతో (30 Vote Victory) విజయం సాధించి, ఎమ్మెల్యే అయ్యారు.
రామ్‌ఘర్ సీటులో బహుజన సమాజ్‌వాదీ పార్టీ (BSP) తరపున పోటీ చేసిన సతీష్ కుమార్ యాదవ్ అనే అభ్యర్థికి ఈ లక్కీ గెలుపు దక్కింది. ఈ స్థానానికి సంబంధించిన కౌంటింగ్ నరాల తెగే ఉత్కంఠ మధ్య జరిగింది. బీజేపీకి (BJP) చెందిన తన సమీప అభ్యర్థి అశోక్ కుమార్ సింగ్‌పై కేవలం 30 తేడాతో సతీష్ గట్టెక్కారు. ఓట్లు దాదాపు సమానంగా రావడంతో పలుమార్లు రీకౌంటింగ్ చేసి విజేతను తేల్చారు.
బక్సర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న రామ్‌గఢ్ వినియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు సాగింది. దీంతో, అభ్యర్థుల సుదీర్ఘ సమయం పాటు టెన్షన్ పడాల్సి వచ్చింది. నిజానికి కౌంటింగ్ జరిగిన పగటి సమయంలో సతీష్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగారు. అయితే, లెక్కింపు ముందుకు సాగుతున్నా కొద్దీ ఆయన మెజారిటీ క్రమంగా తగ్గుతూ వచ్చింది. దీంతో, ఉత్కంఠభరిత వాతావరణంలో కౌంటింగ్ కొనసాగింది. విజయం అటుఇటు దోబూచులాడడంతో బీఎస్పీ, బీజేపీకి చెందిన కార్యకర్తలు టెన్షన్‌కు గురయ్యారు.
Read Also- Bihar Election Results: బీహార్ ఫలితాలపై ఎట్టకేలకు రాహుల్ గాంధీ స్పందన.. అనూహ్య వ్యాఖ్యలు
చివరకు కౌంటింగ్ పూర్తయిన తర్వాత సతీష్ యాదవ్‌కు గరిష్ఠంగా 72,689 ఓట్లు పడ్డాయి. రెండవ స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి అశోక్ కుమార్ సింగ్‌కు 72,659 ఓట్లు వచ్చాయి. దీంతో, సతీష్ కుమార్ కేవలం 30 ఓట్ల తేడాతో గెలిచారు. దీంతో, ఆయన ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. బీఎస్పీ కార్యకర్తలు పండుగ చేసుకున్నారు. ఇక ఈ స్థానంలో పోటీ చేసిన ఆర్జేడీ అభ్యర్థి అజిత్ కుమార్‌కు 41,480 ఓట్లు పడ్డాయి. దీంతో, ఆయన మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన సురాజ్ పార్టీ అభ్యర్థి 4,426 ఓట్లు సాధించారు. ఎన్నికల అఫిడవిట్ వివరాల ప్రకారం, లక్కీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ యాదవ్ వయసు 39 సంవత్సరాలే. విద్య విషయానికి వస్తే, ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వ్యవసాయం, బిజినెస్, పలు రంగాలలో అనుభవం ఉందని ఆయన పేర్కొన్నారు.
Read Also- Narendra Modi: బీహార్ ఘన విజయంతో బీజేపీలో ఫుల్ జోష్.. నెక్స్ట్ టార్గెట్ బెంగాల్ అంటూ..!
ఎవరూ ఊహించని విజయం
రామ్‌గఢ్ శాసనసభ నియోజకవర్గంలో వచ్చిన ఈ ఫలితాన్ని ఎవరూ పెద్దగా అంచనా వేయలేకపోయారు. ఈ సీటు ఆర్జేడీకి కంచుకోటగా ఉండేది. 2005 నుంచి గణాంకాలను గమనిస్తే, ఆర్జేడీ, లేదా బీజేపీ మధ్యే విజేతలు ఉంటున్నారు. గత 2020 అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఇక్కడి పరిస్థితిలో మార్పు మొదలైంది. గత ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి ఇక్కడ కేవలం 189 ఓట్ల తేడాతో ఆర్జేడీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఇక, 2024 ఉప ఎన్నిక జరగగా బీజేపీ అభ్యర్థి కంటే కేవలం 1,284 ఓట్ల తేడాతో బీఎస్పీ అభ్యర్థి వెనుకబడ్డారు.
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా బీహార్‌లో బీఎస్పీ కేవలం ఒక్క సీటు మాత్రం గెలుపొందింది. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చైన్‌పూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిపై బీఎస్పీ అభ్యర్థి మొహద్ జమా ఖాన్ గెలిచారు. అయితే, ఆ తర్వాత ఆయన జంప్ అయ్యారు. జామా ఖాన్ బీఎస్పీ నుంచి జేడీయూలో చేరి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రివర్గంలో మంత్రి కూడా అయ్యారు. మరి, ఈసారి బీఎస్పీ నుంచి ఎమ్మెల్యే అయిన సతీష్ కుమార్ యాదవ్ ఏం చేస్తారో చూడాలి.
