Narendra Modi: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ(Modhi) ఇప్పుడు తమ తదుపరి లక్ష్యం పశ్చిమ బెంగాల్(West Bengal) అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిహార్ ప్రజలు అభివృద్ధి, సుపరిపాలన పట్ల తమ నమ్మకాన్ని పునరుద్ఘాటించారని కొనియాడారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన విజయోత్సవాలలో మోదీ సన్మానం అందుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా(Amit Shah), రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) కలిసి మోదీని సత్కరించారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ విజయం పట్ల పార్టీ నాయకత్వాన్ని, కార్యకర్తలను ప్రధాని అభినందించారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో ప్రధాని బెంగాల్‌లోని దీదీ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘బిహార్‌లో ఒకప్పుడు జంగల్ రాజ్‌ను ఎదుర్కొన్న చరిత్ర మనకుంది. అయితే, ప్రజల మద్దతుతో ఆ చీకటి రోజులు ముగిశాయి. ఇప్పుడు బెంగాల్‌లో కూడా అదే తరహా జంగల్ రాజ్ నడుస్తోంది. ప్రజలు అక్కడ అభద్రతాభావంతో ఉన్నారు. బిహార్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేసిన విధంగానే, బెంగాల్‌లో కూడా శాంతిభద్రతలను పునరుద్ధరించి, సుపరిపాలన అందిస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఇప్పుడు బెంగాల్ ప్రజలు కూడా మార్పును కోరుకుంటున్నారు. బిహార్‌లో ఏ విధంగా అయితే అభివృద్ధిని తీసుకురాగలిగామో, అదే ఉత్సాహంతో, అదే పట్టుదలతో బెంగాల్‌లో కూడా జంగల్ రాజ్‌ను కూకటివేళ్లతో పెకిలించి తీరుతాం’ అని మోదీ ప్రకటించారు.
పరాన్నజీవి పార్టీ!
బిహార్ విజయం బీజేపీకి కేవలం ప్రాంతీయ విజయం కాదని, తూర్పు భారత్‌లో పార్టీ విస్తరణకు కొత్త ప్రేరణనిచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. త్వరలో జరగబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ విజయం ఒక బలమైన పునాది అవుతుందని పార్టీ శ్రేణుల్లో ఆయన ఆత్మవిశ్వాసాన్ని నింపారు. రాబోయే ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు కూడా అభివృద్ధి రాజకీయాలకే ఓటు వేస్తారనే నమ్మకాన్ని ప్రధాని వ్యక్తం చేశారు. విపక్ష పార్టీలపై విమర్శలు కొనసాగిస్తూ, కాంగ్రెస్ పార్టీని ‘పరాన్నజీవి పార్టీ’గా అభివర్ణించారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో తన మిత్రపక్షాలకు హాని చేస్తుందని, అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ముందు మిత్రపక్షాలు రెండుసార్లు ఆలోచించుకోవాలని మోదీ గట్టిగా హెచ్చరించారు. ‘కాంగ్రెస్ తన వ్యతిరేక రాజకీయాలలో అందరినీ ముంచివేస్తోందని ఆ పార్టీ మిత్రపక్షాలు కూడా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాయి. అందుకే బీహార్ ఎన్నికల సమయంలో నేను చెప్పాను. కాంగ్రెస్ నామ్‌దార్‌ను మునిగిపోవడానికి, ఇతరులను ముంచడానికి చెరువులో స్నానం చేయడాన్ని సాధన చేస్తున్నారు. కాంగ్రెస్ మిత్రపక్షాల ఓటు బ్యాంకును మింగేసి తిరిగి పుంజుకోవాలని చూసే పరాన్నజీవి అని నేను గతంలోనే హెచ్చరించాను. కాంగ్రెస్ పార్టీ ముస్లిం–మావోయిస్ట్ కాంగ్రెస్‌గా మారింది. ఆ పార్టీ ఎజెండా ఇప్పుడు ఈ ప్రభావాల చుట్టూ కేంద్రీకృతమై ఉంది. కాంగ్రెస్ అనుసరిస్తున్న ఈ ప్రతికూల రాజకీయ శైలి పట్ల ఆ పార్టీలోని ఒక వర్గం అసౌకర్యంగా ఉంది. ఈ అంతర్గత అసౌకర్యం చివరకు పార్టీలో మరో చీలికకు దారితీయవచ్చు’ అని మోదీ హెచ్చరించారు.
Also Read: Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ ఎన్నికల కౌంటింగ్.. షాకింగ్ కామెంట్స్ చేసిన కవిత
ఈసీకి ధన్యవాదాలు..
ఎన్డీఏ కూటమి చారిత్రక విజయం సాధించిన నేపథ్యంలో, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) గతంలో చేసిన ఓటు చోరీ ఆరోపణలను ప్రధాని దీటుగా తిప్పికొట్టారు. ఈ విజయం, ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతను మరోసారి నిరూపించిందన్నారు. పారదర్శకమైన ఎన్నికల ప్రక్రియను నిర్వహించినందుకు ఎన్నికల సంఘంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ రోజు ఈ వేదిక నుంచి ఎన్నికల సంఘానికి, సిబ్బందికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొందరు వ్యక్తులు గతంలో పెద్దపెద్ద అబద్ధాలు చెప్పారు. ఓటు చోరీ జరిగిందని, ఈవీఎం(EVM)లను మోసం చేయవచ్చని వారు దేశాన్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారు. కానీ, బిహార్ ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు, ఆ ఆరోపణలను, అబద్ధాలను పూర్తిగా తోసిపుచ్చింది. దేశ ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఈ బిహార్ ఫలితాలు మరింత పెంచాయి. ప్రతిపక్షాలు తమ పరాజయానికి ఈవీఎంలను లేదా ఎన్నికల ప్రక్రియను నిందించడం మానేసి, ప్రజలు ఎందుకు తమను తిరస్కరించారో ఆత్మపరిశీలన చేసుకోవాలి’ అని మోదీ హితవు పలికారు.
తెగించి రండి.. చూసుకుందాం!
మోదీ ప్రకటనపై అధికార తృణమూల్ కాంగ్రెస్ మాత్రం తోసిపుచ్చుతూ దీటుగా స్పందించింది. తెగించి రండి.. చూసుకుందాం అంటూ బీజేపీకి టీఎంసీ నేతలు సవాల్ విసిరారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ కేవలం మాటలతో ప్రచారం చేసుకోవడం మాని, నిజమైన పోరాటానికి సిద్ధపడాలని ఆ పార్టీ నేతలు ఎద్దేవా చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నాయకత్వంపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని టీఎంసీ నాయకులు ఉద్ఘాటించారు. బిహార్ ఎన్నికల ఫలితాలు బెంగాల్‌పై ఎలాంటి ప్రభావం చూపలేవని, బెంగాల్ ప్రజలు తమ సొంత రాజకీయ చరిత్రను, సంస్కృతిని బట్టి ఓటు వేస్తారని వారు స్పష్టం చేశారు. బెంగాల్‌లో బీజేపీకి అధికారం దక్కడం కలేనని, బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా దీదీ నాయకత్వాన్ని బెంగాల్ ప్రజలు తిరస్కరించరని టీఎంసీ ధీమా వ్యక్తం చేసింది. మొత్తమ్మీద, బిహార్ విజయం బీజేపీకి ఆత్మవిశ్వాసాన్ని పెంచగా, టీఎంసీ మాత్రం తమ కోటను కాపాడుకోవడానికి పూర్తిగా సన్నద్ధమైనట్లు ప్రకటించింది. రాబోయే బెంగాల్ ఎన్నికలు రెండు పార్టీల మధ్య తీవ్రమైన రాజకీయ సమరానికి వేదిక కానున్నాయి.
