Jammu And Kashmir Blast: జమ్మూ -కాశ్మీర్‌లోని నౌగాం ప్రాంతంలో శుక్రవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటికీ తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుడు సంభవించిన సమయంలో అక్కడ పోలీసులు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) అధికారులు పరిశీలన చేస్తున్నారు.
ఈ పేలుడు గత వారం ఫరీదాబాద్‌లో బ్లాస్ట్ చేసిన టెరర్ మాడ్యూల్ కేసుతో సంబంధం ఉండే అవకాశాలు ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ANI రిపోర్ట్ ప్రకారం, అధికారులు పరిశీలిస్తున్న పేలుడు పదార్థాలు ఇటీవలే ‘వైట్ కాలర్’ టెరర్ మాడ్యూల్ కేసులో స్వాధీనం చేసినవే.
ఈ ఘటనకు ముందు ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో హ్యూండాయ్ i20 కారులో జరిగిన బ్లాస్ట్‌లో 10 మంది మృతి చెందారు. ఆ ఘటనపై జరిగిన దర్యాప్తులో డ్రైవర్ ఉమర్-ఉన్ నబీగా గుర్తించారు. ఆయన జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన వైద్యుడు. ఢిల్లీ బ్లాస్ట్, ఫరీదాబాద్ రైడ్స్ రెండింటికీ సంబంధాలు ఉన్నట్లు విచారణ అధికారులు నిర్ధారించారు. ఫరీదాబాద్ ఆపరేషన్‌లో సుమారు 2,900 కిలోల అమ్మోనియం నైట్రేట్ సహా భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసిన విషయం తెలిసిందే.
నౌగాం పోలీస్ స్టేషన్ పరిసరాల్లో బ్లాస్ట్ తర్వాత భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. జమ్మూ-కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్, సీఆర్పీఎఫ్ ఐజీ పవన్ కుమార్ శర్మ శనివారం ఉదయం ఘటనాస్థలానికి వెళ్ళి అక్కడి పరిస్థితులు చూశారు. పేలుడులో మరణించిన వారిని గుర్తిస్తున్నారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులే ఉన్నారని సమాచారం. వారిని శ్రీనగర్‌లోని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది.
