Red Fort Blast: దిల్లీ కారు పేలుడు ఘటనకు సంబంధించి ముమ్మర దర్యాప్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. తాజాగా అందుతున్న అప్ డేట్ ప్రకారం.. దిల్లీలో నాలుగు కార్లతో వరుస పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. పేలుడు జరిగిన హ్యుందాయ్ i20 (Hyundai i20) కారు తరహాలోనే మరో మూడు కారుల్లో పేలుడు పదార్థాలను తీసుకువెళ్లేల్లా ప్లాన్ చేసినట్లు దర్యాప్తు వర్గాలు గుర్తించాయి.
డిసెంబర్ 6న పేలుళ్లకు కుట్ర
ఎర్రకోట వద్ద పేలుడు జరిగిన హ్యుందాయ్ i20 కారుతో పాటు మరో మూడు కార్లు మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuka Brezza), మారుతి స్విఫ్ట్ డిజైర్ (Maruti Swift Dzire), ఫోర్డ్ ఎకోస్పోర్ట్ (Ford EcoSport) కూడా పేలుడు పదార్థాలను తీసుకువెళ్లేలా సిద్ధం చేశారని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. వాటితో డిసెంబర్ 6న దిల్లీ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర చేసినట్లు దర్యాప్తులో తేలింది. 16వ శతాబ్దంలో సరిగ్గా అదే రోజున (డిసెంబర్ 6) బాబ్రీ మసీదును కూల్చివేసినందుకు గాను ఈ దాడులతో ప్రతీకారం తీర్చుకోవాలని ఉగ్రవాదులు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. దిల్లీలోని మెుత్తం 6 ప్రదేశాల్లో ఈ కార్లను ఉపయోగించి పేలుళ్లకు తెగబడాలని కుట్ర పన్నినట్లు భద్రతా బలగాల దర్యాప్తులో బయటపడింది.
సుజుకి బ్రెజ్జా ముమ్మర గాలింపు
అయితే పేలుళ్లకు ఉపయోగించాలని భావించిన కార్లన్ని పాతవేనని అధికారులు తెలిపారు. ఆ కార్లను పలుమార్లు అమ్మడం, కొనడం జరిగిందని చెప్పారు. దీంతో అసలు యజమానిని గుర్తించడం కష్టంగా మారుతోందని స్పష్టం చేశారు. దర్యాప్తు వర్గాలు ప్రస్తుతం మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuka Brezza) కారు కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ కారు ఫరిదాబాద్ లోని అల్ – ఫలాహ్ యూనివర్సిటీ ప్రాంగణంలో చివరి సారిగా కనిపించడంతో దానిపైన భద్రతా బలగాలు దృష్టిసారించాయి. దిల్లీ పేలుడుకు సూత్రదారులుగా భావిస్తున్న వైద్యులు ఆ యూనివర్శిటీలోనే పట్టుబడిన నేపథ్యంలో బ్రెజ్జా కారులోనూ పేలుడు పదార్థాలు ఉండొచ్చని దర్యాప్తు వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: Jagan on Chandrababu: చంద్రబాబు ‘క్రెడిట్ చోరీ స్కీం’.. వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
బలగాల అదుపులో మరో రెండు కార్లు
మరోవైపు ‘DL 10 CK 0458’ రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ (Ford EcoSport) కారును బుధవారం రాత్రి ఫరిదాబాద్ బయట పోలీసులు గుర్తించారు. కారు వెనుక సీటులో నిద్రిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు డిజైర్ కారును సోమవారమే దర్యాప్తు వర్గాలు స్వాధీనం చేసుకున్నాయి. అందులో ఒక అసాల్ట్ రైఫిల్, తుపాకీ గుండ్లు లభించాయి. కాగా దిల్లీలోని ఎర్రకోట సమీపంలో హ్యుందాయ్ i20 కారు పేలిన ఘటనలో ఇప్పటివరకూ 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. పేలుడుకు కారణమైన కారులో శక్తివంతమైన అమ్మోనియం నైట్రేట్ ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. అల్ ఫలాహ్ యూనివర్శిటీ వైద్యుల నుంచి స్వాధీనం చేసుకున్న 2,900 కిలోల పేలుడు పదార్థం కూడా అమ్మోనియం నైట్రేటే కావడం గమనార్హం.
Also Read: Nara Lokesh: గుడ్ న్యూస్ చెప్పిన లోకేశ్.. రూ.82,000 కోట్ల భారీ పెట్టుబడి.. రెన్యూ పవర్ వచ్చేస్తోంది!
