Jagan on Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం రాష్ట్రవాప్తంగా 3 లక్షల గృహ ప్రవేశాలను కూటమి ప్రభుత్వం నిర్వహించిన నేపథ్యంలో పలు ప్రశ్నలను జగన్ సంధించారు. మీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న క్రెడిట్ చోరీ స్కీం చాలా బాగుందంటూ సెటైర్లు వేశారు. వైసీపీ హయాంలో నిర్మించిన ఇళ్లను తామే కట్టినట్లు చంద్రబాబు చెప్పుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఒక్క పట్టా ఇవ్వలేదు’
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా చంద్రబాబు ప్రభుత్వం సేకరించలేదని వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. గతంలో వైసీపీ సాంక్షన్ చేయించిన ఇళ్లనే తమ హయాంలో నిర్మించినట్లుగా చంద్రబాబు అబద్దాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల కష్టాన్ని గొప్పతనంగా చెప్పుకునేవారిని నాయకుడు అనరని.. నాటకాల రాయుడు అంటారని ఆరోపించారు. మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,00,092 ఇళ్లలో ఒక్క ఇంటిపట్టా కూడా చంద్రబాబు ఇవ్వలేదని జగన్ ఆరోపించారు. ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయించ లేదని విమర్శించారు.
వాస్తవాలు కళ్ల ముందే ఉన్నా..
రాష్ట్రంలో గృహప్రవేశాలు జరిగిన వాటిలో 1,40,010 ఇళ్లు తమ హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నాయని వైఎస్ జగన్ గుర్తుచేశారు. మరో 87,380 ఇళ్లు శ్లాబ్ లెవల్ వరకూ కట్టించామని అన్నారు. శ్లాబ్ కంటే కింద స్థాయిలో మరో 66,845 ఇళ్లు ఉన్నాయని గుర్తుచేశారు. అక్టోబరు 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లలో గృహప్రవేశాలు నిర్వహించి తమ ప్రభుత్వ చరిత్ర సృష్టించిందని జగన్ గుర్తుచేశారు. ఇన్ని వాస్తవాలు కళ్ళముందే ఉన్నా గత వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా.. మీరే అన్నీ చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.
Also Read: Nara Lokesh: గుడ్ న్యూస్ చెప్పిన లోకేశ్.. రూ.82,000 కోట్ల భారీ పెట్టుబడి.. రెన్యూ పవర్ వచ్చేస్తోంది!
‘ఇది అత్యంత హేయం’
‘మా హయాంలో 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి వారి పేరుమీదే రిజిస్ట్రేషన్ చేయించాం. 21.75 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయించి 9 లక్షలకుపైగా ఇళ్లను మా హయాంలోనే పూర్తిచేశాం. మిగిలిన ఆ 10 లక్షల ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి పూనుకోకుండా ఆ ఖాళీ స్థలాలను లాక్కునే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేస్తోంది. మీరు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడ్డం అత్యంత హేయం.
ఒకరి కష్టాన్ని కొట్టేయడంలో ఒకరి ఐడియాను మీదిగా చెప్పుకోవడంలో మీకు మీరే సాటి’ అంటూ చంద్రబాబుపై జగన్ ఫైర్ అయ్యారు.
చంద్రబాబుగారూ… మీ కథ, స్క్రీన్, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న “క్రెడిట్ చోరీ స్కీం’’ చాలా బాగుంది.
పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా..
ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా…
దీనికోసం ఒక్కపైసా కూడా ఖర్చుచేయకుండా……— YS Jagan Mohan Reddy (@ysjagan) November 13, 2025
2029 నాటికి పేదవాడికి సొంతిల్లు
ఏపీలో 3 లక్షల ఇళ్ల గృహప్రవేశాల నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు బుధవారం మాట్లాడారు. సొంతిళ్లు అనేది ప్రజల భవిష్యత్తుకు నాంది అని పేర్కొన్నారు. గృహాలను 1986లో ఎన్టీఆర్ ప్రారంభించినట్లు గుర్తుచేశారు. కూడు గూడు గుడ్డ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశమని చంద్రబాబు అన్నారు. 2029 లోపు ప్రతి పేదవాడికి సొంత ఇళ్లు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
