Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లా (Gadwal District)లో ధాన్యం కొనుగోళ్లలో ఆయా సీజన్లలో అవకతవకలు యథేచ్ఛగా సాగుతున్నాయని, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల విజిలెన్స్ అండ్ ఎయిర్ ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టడంతో జిల్లా కేంద్రంలోని పలు మిల్లుల్లో జరిగిన అవకతవకలపై కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మరికొన్ని చోట్ల కూడా ఇదే తీరుగా అక్రమ కొనుగోళ్లు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.
కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలింపు, బ్యాగింగ్, అలాగే ధాన్యం నిల్వల లెక్కలపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి తనిఖీలు చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గతంలో, రబీ సీజన్‌లో నాగలదిన్నె, పులికల్, మేడికొండ కొనుగోలు కేంద్రాలలో వేరే ప్రాంతాల నుంచి ధాన్యాన్ని తెచ్చి విక్రయించిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. సన్న రకానికి రూ. 500 బోనస్ వస్తుండటంతో, పక్క రాష్ట్రాల నుంచి లేదా జిల్లాల నుంచి ధాన్యాన్ని తీసుకువచ్చి స్థానిక రైతుల పేర్లతో విక్రయాలు కొనసాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలను అరికట్టేందుకు జిల్లాలో ఇటీవల ఏడు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసినప్పటికీ, కొనుగోలు కేంద్రాలపైన పటిష్ట నిఘా పెంచాల్సిన అవసరం ఉంది.
పేరుకే మహిళా సంఘాలు..
జిల్లాలో ప్రస్తుత వరి ధాన్యం కొనుగోలు కోసం మహిళా సంఘాలకు 63, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 13, మెప్మా ఆధ్వర్యంలో 5 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల నిర్వహణకు మహిళా సంఘాల పేరు మాత్రమే ఉన్నా, తెరవెనుక రాజకీయ నాయకుల పెత్తనం కొనసాగుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో ధాన్యం తూకం, తరుగు పేరిట దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్‌లో రెండు కేజీలకు బదులు ఐదు కేజీల వరకు తరుగు తీశారని రైతులు వాపోతున్నారు.
నిర్వాహకులపై చర్యలు లేక
గత కొన్నేళ్లుగా కొనుగోలు కేంద్రాల నిర్వహకులు మిల్లర్లతో కలిసి తరుగు పేరిట రైతుల కష్టాన్ని దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. చాలా సందర్భాలలో నిర్వాహకులపై ఫిర్యాదులు వచ్చినా, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రాజకీయ పలుకుబడి ఉన్న నాయకులు కావడంతో స్థానిక అధికారులు సైతం చర్యలు తీసుకోలేకపోతున్నారని తెలుస్తుంది. గతంలో, గద్వాల నియోజకవర్గ పరిధిలోని ధరూర్ మండలం రేవులపల్లి గ్రామ వరి కొనుగోలు కేంద్రం నిర్వహణ కాలపరిమితి ముగిసినా, వారే కొనసాగుతూ అవినీతికి పాల్పడుతున్నారని ఇటీవల బాధితులు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు.
పరిస్థితులకు అనుకూలంగా దోపిడీ
ప్రస్తుతం వానాకాలం సీజన్‌లో వడ్ల కొనుగోలు ప్రారంభమైన నేపథ్యంలో, అకాల వర్షాల కారణంగా తేమ శాతం పెరగడాన్ని నిర్వాహకులు, మిల్లర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ పరిస్థితులను సాకుగా చూపి, తరుగు పేరుతో రెండు నుంచి ఐదు కేజీల వరకు కోత పెడుతూ రైతులను నష్టపోయేలా చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా సాగిస్తేనే రైతులకు న్యాయం జరిగి, ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని, ప్రజాధనం వృథా కాకుండా ఉంటుందని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.
Also Read: Gadwal District: గట్టు ఎత్తిపోతల పూర్తయ్యేనా? 1.32 నుంచి 5 టీఎంసీల సామర్థ్యంపెంపుకు అంగీకారం!
