Gadwal District: దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని నేతలు చెబుతుండగా అదే గ్రామపంచాయతీలు నిధుల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పైసా కూడా పంచాయతీలకు ఇవ్వకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోంది. పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు జరగక పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం కూడా నిధులకు బ్రేక్ వేసింది. పంచాయతీలకు ప్రధాన ఆర్థిక వనరు అయిన పన్నులు కూడా వసూలు గాక ఆదాయం సమకూరడం లేదు.
పంచాయతీల పరిధిలోని వాణిజ్య దుకాణాలు
పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో పంచాయతీల పరిధిలోని వాణిజ్య దుకాణాలు, కార్పొరేట్ సెక్టార్ సంస్థల నుంచి రావాల్సిన రాయల్టీ సైతం జమ కావడం లేదు. పాలకవర్గాలు లేక అడిగే వారు లేక పట్టించుకునేవారు అంతకన్నా లేక పంచాయతీలు దిక్కులేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. వ్యాపార లైసెన్స్ ఫీజు, భవన నిర్మాణాల అనుమతులు, ఇంటి పన్ను రూపేన వచ్చే ఆదాయాన్ని సైతం ప్రభుత్వం ఖాతాలలో ఫ్రీజ్ చేయడంతో గ్రామాలలో కనీస అవసరాలకు పంచాయతీ కార్యదర్శులు చెక్కును సైతం డ్రా చేసుకునే పరిస్థితి లేకపోవడంతో గ్రామ పంచాయతీల నిర్వహణ కష్టతరం అవుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో 13 మండలాలకు గాను 255 గ్రామాలు ఉండగా 5.04 లక్షల ఓటర్లు ఉన్నారు.
పేరుకుపోతున్న సమస్యలు
గ్రామ పంచాయతీల భారమంతా కార్యదర్శుల పైనే పడుతోంది. నిధులు లేక పోవడంతో వారు కూడా పంచాయతీల నిర్వహణ తమ వల్ల కాదని చేతులెత్తేసే పరిస్థితి దాపురిస్తోంది. ఏకంగా గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాలని కొందరు గ్రామ పెద్దలు అడగగా మీకే తీర్మానిస్తాం పనులు చేయండి అనే పరిస్థితి పంచాయతీ కార్యదర్శులు అనే పరిస్థితి వచ్చింది. కనీసం గ్రామాలలో తాగునీటి సమస్య కోసం చేతి పంపులు రిపేర్లు చేయించాలని కార్యదర్శులపై ఒత్తిడితేగా ఇప్పటికే పలుమార్లు చేయించామని ఇక మా వల్ల కాదని మీరే చేయిస్తే తీర్మానం ఇస్తామని జల్లాపురం గ్రామానికి చెందిన కార్యదర్శి ఫిర్యాదుదారునికే సూచించారు.
ఇంతకాలం చిన్నచిన్న ఖర్చులకు జేబులో నుంచి వెచ్చించిన పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి తిప్పలు పడుతున్నామని వాపోతున్నారు. ఫలితంగా గ్రామాలలో సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకు పోతున్నాయి. ముఖ్యంగా మౌలిక వసతులైన డ్రైనేజీలో పూడికతీత, రోడ్ల పరిశుభ్రత, వీధి దీపాల నిర్వహణ, చెత్త సేకరణకు ట్రాక్టర్లకు డీజిల్ వేయించలేని పరిస్థితి వస్తోందని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు.. కనీసం సంబంధిత షాపులో నుంచి సామాగ్రిని క్రెడిట్ ఇచ్చేందుకు సైతం షాప్ నిర్వాహకులు నిరాకరిస్తున్నారని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు.
ఆర్థిక సంఘ నిధులకు బ్రేక్
గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడం లేదు. గ్రామపంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర నిధులు విడుదల చేయలేమంటూ కేంద్రం చేతులెత్తేసింది.సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఉంటే కేంద్రం నిధులు సక్రమంగా విడుదలై ఉండేవి. పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిసి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా ఆదిశగా ఎన్నికలు నిర్వహించలేక పోతుంది. దీనికి ప్రధాన కారణం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం జరుగుతున్న ప్రక్రియలో జాప్యమే. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తేనే 15వ ఆర్థిక సంఘం ద్వారా నిధులను విడుదల చేస్తామని కేంద్రం షరతు పెట్టడంతో ఆ నిధులపై ఆశలు వదులుకోవాల్సి వస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కింద నిధులను విడుదల చేయలేక పోవడంతో గ్రామాల్లో నిధుల కొరత తీవ్ర రూపం దాలుస్తోంది గ్రామ పంచాయతీలు జమ చేసుకున్న ఫండ్ ను కూడా వాడుకోలేని పరిస్థితి ఉండడంతో ఇటు ప్రజలకు అధికారులకు సమాధానం చెప్పుకునే పరిస్థితి దాపురిస్తోందన్నారు.
Also Read: Gadwal District: మగవాళ్లకు పౌష్టికాహారంపై అవగాహన అవసరం: కలెక్టర్ బి.ఎం సంతోష్
