Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లా (Gadwal District)లోని పలు ప్రాంతాల్లోని స్కానింగ్ సెంటర్లలో ధరల నియంత్రణ కొరవడటంతో ప్రజలు దోపిడీకి గురవుతున్నారనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఒక్కో స్కానింగ్ సెంటర్‌లో పరీక్షలకు ఒక్కో రకంగా ఫీజులు వసూలు చేయడంతోపాటు, రెఫరల్ డాక్టర్లకు భారీ కమిషన్లు ఇస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యాధికారులు తనిఖీలు చేపట్టకపోవడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది.
Also Read: Gadwal District: సెటిల్మెంట్లు అక్రమ వసూళ్లకు కేరాఫ్‌గా కేటిదొడ్డి పోలీస్ స్టేషన్.. ఎక్కడంటే..!
జోరుగా అక్రమ దందా
గద్వాల పట్టణంతో పాటు ఐజ, శాంతినగర్, అలంపూర్, ఎర్రవల్లి తదితర ప్రాంతాలలో ఈ దందా జోరుగా సాగుతుంది. గర్భిణులతో పాటు చెస్ట్, గ్యాస్ట్రో, లివర్ వంటి సమస్యలున్న రోగులకు వైద్యులు స్కానింగ్‌లను, గాయాలు, తలనొప్పి, నరాల సమస్యలున్న రోగులకు ఎక్స్-రే, సిటీ స్కాన్, ఎంఆర్‌ఐలను రెఫర్ చేస్తున్నారు.
అధిక ఫీజుల వసూలు
స్కానింగ్ సెంటర్లలో రోగుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు.. ఎక్స్-రే కోసం ₹500 నుంచి ₹1200 వరకు. సాధారణ స్కానింగ్‌కు ₹800 నుంచి ₹2000 వరకు. సిటీ స్కాన్, ఎంఆర్‌ఐల విషయానికి వస్తే ఫీజులు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. సెంటర్ల నిర్వాహకులు పేరుకు మాత్రమే ధరల బోర్డు ప్రదర్శిస్తూ ఇష్టారీతిన వసూలు చేస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.
కమిషన్ల కోసం రెఫరల్ దందా
జిల్లాలో కొందరు సీనియర్ వైద్యులు అవసరం లేకుండానే ప్రతి చిన్న సమస్యకు ఎక్స్-రే, సిటీ స్కాన్, స్కానింగ్‌లు రాస్తూ ‘రెఫరల్ దందా’ నిర్వహిస్తున్నారని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. కొన్ని మేనేజ్‌మెంట్ ఆస్పత్రుల్లోని వైద్యులు ఈ రెఫరల్స్ ద్వారా ప్రతి ₹1000 ఫీజుకు ₹300 చొప్పున కమిషన్లు తీసుకుంటున్నట్లు సమాచారం.
జూనియర్లతోనే నిర్వహణ
ఎక్స్-రే, స్కానింగ్, సిటీ స్కాన్ నిర్వహణకు డీఎంఐటీ కోర్సు చేసిన అర్హత, అనుభవం ఉన్న టెక్నీషియన్ అవసరం. కానీ, ప్రైవేట్ ఆస్పత్రులు, సెంటర్ల నిర్వాహకులు టెక్నీషియన్లకు అధిక వేతనాలు (₹30 వేల నుంచి ₹45 వేలు) ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో, జూనియర్లకు ₹20 వేల లోపు జీతాలు ఇచ్చి నిబంధనలకు విరుద్ధంగా సెంటర్లను నడుపుతున్నారు. జూనియర్లు ఇచ్చే స్కానింగ్ రిపోర్టులో తేడా వస్తే ఎవరు బాధ్యత వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల ఐజ సెంటర్‌లో ఒక గర్భిణికి నిర్వహించిన పరీక్ష ఫలితం ఒకలాగా, గద్వాలలో మరో సెంటర్‌లో తీసిన ఫలితం ఇంకోలా రావడంతో బంధువులు తీవ్ర అయోమయానికి గురైన సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు ప్రజల ప్రాణాలను రక్షించే అంశంలో రాజీ లేకుండా, ఈ హాస్పిటళ్లు, స్కానింగ్ సెంటర్ల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ, నిఘా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
Also Read: Gadwal District: గట్టు ఎత్తిపోతల పూర్తయ్యేనా? 1.32 నుంచి 5 టీఎంసీల సామర్థ్యంపెంపుకు అంగీకారం!
