AV Ranganath: చెరువుల అభివృద్ధి అంటే అందాలు అద్దడం కాదని, వాటి పునరుద్దరణ పూర్తి స్థాయిలో జరిగితేనే అసలైన అభివృద్ది అని, దాంతోనే వరదల నివారణ సాధ్యమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాధ్ క్లారిటీ ఇచ్చారు. చెరువులు, కుంటలు వంటి వాటి అవసరాలు నెరవేరే విధంగా వాటిని తీర్చిదిద్దాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. సకల జీవ కోటికీ ప్రాణాధారంగా వాటిని రూపొందించాలన్నారు. చెరువుల్లో ఆక్రమణలను, పోసిన మట్టితో పాటు కొన్నేళ్లుగా పేరుకుపోయిన పూడికను, దుర్గంధాన్నితొలగించిన తర్వాతే మిగతా హంగులు, ఆర్బాటాలపై దృష్టి సారించాలని సూచించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్ ఆర్) నిధులతో చెరువులను అభివృద్ధి చేస్తున్న వ్యక్తులు గానీ, సంస్థలు గానీ ఈ విషయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు.’
Also Read: AV Ranganath: కబ్జాల పాలైన భూములను కాపాడటమే హైడ్రా లక్ష్యం : కమిషనర్ రంగనాధ్
సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలి
శిల్పకళావేదికలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం నిర్వహించిన సౌత్ ఇండియా సీఎస్ఆర్ సమ్మిట్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రసంగించారు. సీఎస్ ఆర్ నిధులు పూర్తి స్థాయిలో సద్వినియోగం అయ్యేలా ఆయా సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా చెరువుల పునరుద్ధరణను హైడ్రా ఎలా చేపట్టిందనేది పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటతో పాటు నగరంలో మొదటి విడతగా చేపట్టిన ఆరు చెరువుల పునరుద్ధరణ గురించి సవివరంగా వివరించారు. చెరువుల్లో వరద నీరు నిలిచేలా లోతు పెంచాల్సినవసరం ఉందని, అలాగే ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లు సరిగా ఉండేలా చూడాలన్నారు. చెరువుల్లోకి మురుగు నీరు చేరకుండా హైడ్రా తీసుకున్న చర్యలను కూడా వివరించారు.
చెరువులతో పాటు నాలాల అభివృద్ధి
గొలుసుకట్టు చెరువులకు ప్రాణాధారమైన నాలాలను కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని హైడ్రా కమిషనర్ అభిప్రాయపడ్డారు. అప్పడే నగరంలో వరదలను పూర్తి స్థాయిలో నివారించగలమని వెల్లడించారు. చెరువుల ఆవశ్యకతను వివరిస్తూ ఒక ఎకరం పరిధిలో మీటరు లోతులో 4 మిలియన్ లీటర్ల నీటిని ఆపగలమన్నారు. ఈ లెక్కన వరదలను నివారించడానికి చెరువులు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ భూములు, చెరువుల, నాలాలు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను పరిరక్షించడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కోడానికి రాష్ట్ర ప్రభుత్వం మహా సంకల్పంతో హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు. ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి వైపరీత్యాల నుంచి చాలా వరకు బయటపడగలమన్నారు.
చెరువులు దాదాపు 61 శాతం కనుమరుగు
నగరంలో చెరువులు దాదాపు 61 శాతం కనుమరుగయ్యాయని, వాటిని వీలైనంతవరకు పునరుద్ధరించేందుకు హైడ్రా కృషి చేస్తోందన్నారు. కార్పొరేట్ సంస్థలు కూడా ఇందు కోసం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. చెరువులు శాశ్వత ఆస్తులుగా పరిగణించి ముందు తరాలవారికి వాటిని భద్రంగా అప్పగించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. చెరువుల చెంత. పిల్లలు ప్రశాంతమైన వాతావరణంలో ఆడుకునేలా, అక్కడ అన్ని వయసులవారు సేదదీరే విధంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందన్నారు. సీఎస్ ఆర్ సమ్మిట్ ముఖ్య ఉద్దేశాలను ఎమ్మెల్సీ ప్రొ. కోదండరామ్ వివరించారు. హైడ్రాకు తమవంతు సహకారం అందిస్తామని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఖైరతాబాద్ ఛైర్మన్ ప్రొ . డా. రమణ నాయక్ ఈ సమ్మిట్ లో తెలిపారు.
Also Read: MLA Kadiyam Srihari: మొంథా ఎఫెక్ట్ పై జిల్లాస్ధాయి సమీక్ష.. కీలక అంశాలపై ఎమ్మల్యే కడియం చర్చ
