GHMC: జీహెచ్ఎంసీకి రెండో ప్రధాన ఆర్థిక వనరైన టౌన్ ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కొరత నెలకొన్నది. పదకొండేళ్ల క్రితం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా జీహెచ్ఎంసీకి ఆదాయాన్ని సమకూర్చే టౌన్ ప్లానింగ్ విభాగంలో అవసరానికి తగిన విధంగా సిబ్బందిని నియమించడంలో పాలకులు విఫలమవుతూనే ఉన్నారు. సమైక్యాంధ్ర నుంచి పీడిస్తున్న ఈ సమస్య కనీసం స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాతనైనా పరిష్కారమవుతుందని అధికారులు భావించారు. కానీ, వారి అంచనాలన్నీ తారుమారయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత టౌన్ ప్లానింగ్ విభాగంలో వివిధ క్యాటగిరీల కింద సుమారు 410 మంది సిబ్బంది అవసరం కాగా, ప్రస్తుతం వంద మందిలోపే ఉద్యోగులు వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.
Also Read: GHMC: ఫుటోవర్ బ్రిడ్జిలపై అధ్యయనం.. స్టడీ చేసి నివేదికలను సమర్పించాలని ఆదేశం
అంతస్తు భవనాల నిర్మాణాలు జోరు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వేగంగా పట్టణీకరణ జరుగుతున్నా, బహుళ అంతస్తు భవనాల నిర్మాణాలు జోరుగా సాగుతున్నా, వాటి నిర్మాణానికి అనుమతులు జారీ చేస్తున్న టౌన్ ప్లానింగ్ విభాగంలో సిబ్బంది సంఖ్య ఏ మాత్రం పెరగడం లేదు. అసలు పెంచే దిశగా సర్కారు గానీ ఉన్నతాధికారులు గానీ ఎలాంటి చొరవ చూపడం లేదు. ఫలితంగా భవన నిర్మాణ అనుమతుల జారీతో పాటు రోడ్డు విస్తరణ పనులు, ముఖ్యంగా కొత్త ప్రాజెక్టులకు అవసరమైన స్థల సేకరణ ప్రక్రియలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లకపోవడంతో కమిషనర్లు తలలు పట్టుకుంటున్నారు.
రూ.7038 కోట్లతో ఐదు ప్యాకేజీలు
ప్రస్తుత సర్కారు కూడా సిటీలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టి, సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు రూ.7038 కోట్లతో ఐదు ప్యాకేజీలుగా 23 ప్రాజెక్టులను ప్రతిపాదించి ఏడాది గడుస్తున్నా, ఒక్క ప్రాజెక్టు పనులు కూడా ముందుకు సాగడం లేదు. ఈ వ్యవహారంపై ప్రస్తుత కమిషనర్ సైతం అసంతృప్తిగానే ఉన్నట్లు సమాచారం. దీనికి తోడు నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలు, డీవియేషన్స్ కలిగిన భవనాలకు సంబంధించిన లీగల్ కేసులకు కూడా టౌన్ ప్లానింగ్ సిబ్బంది హాజరు కావాల్సి వస్తున్నందున, ఆశించిన స్థాయిలో ప్లానింగ్ విభాగం పని చేయలేకపోతుందన్న వాదనలున్నాయి. ప్లానింగ్ విభాగంలో సిబ్బంది సంఖ్య అంతంతమాత్రంగా ఉండగా, కొత్త ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడంతో సమన్వయంతో పని చేయాల్సిన ప్రాజెక్టులు, స్థల సేకరణ విభాగాలతో పాటు ప్లానింగ్ విభాగాల మధ్య సమన్వయం కుదరడం లేదన్న విమర్శలు సైతం ఉన్నాయి.
జీహెచ్ఎంసీకి సరికొత్త స్టాఫ్
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు ప్రసాదరావు కమిటీ జీహెచ్ఎంసీకి సరికొత్త స్టాఫ్ ప్యాటర్న్‌ను రూపకల్పన చేసింది. దీని ప్రకారం టౌన్ ప్లానింగ్ విభాగంలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించేందుకు సుమారు 226 మంది సిబ్బంది అవసరమని కమిటీ కూడా సిఫార్సులు చేసినా, నేటికీ ఆ సిఫార్సు అమలు కావడం లేదు. ఫలితంగా రోజురోజుకు సిబ్బంది తగ్గుతూ ప్లానింగ్ విభాగానికి పని భారం పెరుగుతున్నది. ఇటీవలే ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తించిన అడిషనల్ చీఫ్ సిటీ ప్లానర్, కూకట్‌పల్లి జోనల్ ప్లానర్లు రిటైర్డు కాగా, వారి స్థానంలో వేరే అధికారులకు ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగించారు. వీరు తమ రొటీన్ విధులతో పాటు జోనల్ సీపీ, అడిషనల్ చీఫ్ సిటీ ప్లానర్ విధులను కూడా నిర్వర్తించాల్సి వస్తుంది.
యూనియన్ల వినతులు బుట్ట దాఖలు
టౌన్ ప్లానింగ్ విభాగానికి అవసరమైన సంఖ్యలో సిబ్బందిని నియమించాలని టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల సంఘాలు ఇప్పటి వరకు పలు సార్లు కమిషనర్, సర్కారుకు చేసిన వినతులన్నీ బుట్ట దాఖలు అయ్యాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో అతి పెద్ద స్థానిక సంస్థ అయిన జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్‌లోని సుమారు కోటిపై చిలుకు జనాభాకు అవసరాలకు తగిన విధంగా అభివృద్దితో పాటు అత్యవసర సేవలందిస్తుంది.
విచక్షణాధికారంతో కమిషనర్ నోటిఫికేషన్ జారీ
ఈ కార్పొరేషన్ కు అవసరమైన స్థాయిలో సిబ్బందిని నియమించుకునే విచక్షణాధికారం కమిషనర్లకు ఉన్నా, ఇప్పటి వరకు ఏ ఒక్క కమిషనర్ నేరుగా సిబ్బందిని నియమించుకునే సాహసం చేయలేదు. తమ విచక్షణాధికారంతో కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేసి సిబ్బందిని నియమించుకునే అవకాశముందని పలువురు అధికారులే బాహాటంగా చెబుతున్నారు. కానీ అలా చేస్తే సర్కారు నుంచి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనన్న భయమే ఇందుకు ప్రధాన కారణమని తెలిసింది. ప్రస్తుత కమిషనర్ కర్ణన్ కూడా తాజాగా టౌన్ ప్లానింగ్‌లో కనీసం తొలుత 60 మంది సిబ్బందిని కేటాయించాలని సర్కారుకు ప్రతిపాదనలు పంపగా, సర్కారు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) నుంచి కేవలం ఆరుగురు ప్లానింగ్ ఆఫీసర్లను కేటాయించినట్లు తెలిసింది.
Also Read: GHMC: హైదరాబాద్ వరద కష్టాలకు శాశ్వత పరిష్కారం.. జీహెచ్ఎంసీ డ్రెయిన్ల మ్యాపింగ్ ప్రక్రియ షురూ
