Delhi Blast: యావత్ దేశం ఉలిక్కిపడేలా, సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎట్రకోటకు సమీపంలో నడిరోడ్డుపై జరిగిన భారీ పేలుడు ఘటనపై (Delhi Blast) ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నాయి. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకోగా, వారిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. పేలుడు ఘటనతో సంబంధం ఉందనే అనుమానంతో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన కొందరిలో ఒకడైన తారీఖ్ అహ్మద్ మాలిక్‌కు సంబంధించి కొంత సమాచారం బయటపడింది. పేలుడుకు ఉపయోగించిన కారును చివరిసారిగా కొన్న వ్యక్తి అహ్మద్ మాలిక్ కావడంతో, పేలుడు కుట్రలో భాగస్వామిగా ఉన్నాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జమ్మూ కశ్మీర్‌లోని ఓ బ్యాంకుకు భద్రత కల్పించే సెక్యూరిటీ గార్డుగా అహ్మద్ మాలిక్ పనిచేస్తున్నట్టు తేలింది. ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనలో ఇతడి ప్రమేయం ఉందనే అనుమానాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లోని సాంబురా గ్రామంలో అరెస్టు చేశారు. అతడి వయసు 44 సంవత్సరాలు అని గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేయగా, అందులో ఐదుగురిని జమ్మూ కశ్మీర్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారిలో కొందర్ని శ్రీనగర్ తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నార. ప్రస్తుతం ఈ కేసుపై ఎన్ఐఏ, ఎన్ఎస్‌జీతో పాటు సహా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. కాగా, ఢిల్లీ పేలుడుకు ఉపయోగించిన హ్యుందాయ్ ఐ20 కారు తొలుత మహ్మద్ సల్మాన్ అనే వ్యక్తి దగ్గర ఉండగా, అతడి నుంచి తారిఖ్ చేతికి వచ్చింది. తారీఖ్ నుంచి ఆత్మాహుతి బాంబర్‌గా అనుమానిస్తున్న ఉమర్ మొహమ్మద్ చేతికి చేరిందని పోలీసులు గుర్తించారు.
క్షణాల్లో పేలుడు
ఎప్పటిమాదిరిగానే సోమవారం సాయంత్రం కూడా ఢిల్లీలోని రహదారులు చాలా రద్దీగా ఉన్నాయి. ప్రఖ్యాత ఎర్రకోట సమీపంలో, ఓ కారు పేలిపోతుందనే ఊహ కూడా ఎవరికీ లేదు. పేలిన తెలుపు రంగు హ్యుందాయ్ ఐ20 కారు.. రెడ్ సిగ్నల్ వద్ద ఆగిన కొన్ని క్షణాల్లోనే పేలిపోయింది. ఆ శబ్ధానికి చుట్టుపక్కల వాహనాలు కూడా తునాతునకలు అయ్యాయి. సమీపంలోని ఇళ్ల అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోయింది. 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కారును నడిపిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ ఆత్మాహుతి బాంబర్‌గా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీ పేలుడులో తారిఖ్ అహ్మద్ మాలిక్, అమీర్ రషీద్, ఉమర్ రషీద్ అనే వ్యక్తులపై ప్రస్తుతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరు ముగ్గురూ జమ్మూ కశ్మీర్‌కు చెందినవారు కాగా, తారీఖ్, అమీర్‌లను శ్రీనగర్‌కు తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు. అయితే, ఉమర్ రషీద్ మాత్రం ఇంకా పంపోర్‌లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఢిల్లీ పేలుడు ఘటనపై పోలీసు చీఫ్ సతీష్ గోల్చా స్పందిస్తూ, ఓల్డ్ ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే సుభాష్ మార్గ్‌లోని రెడ్ లైట్ వద్ద తెలుపు రంగు హ్యుందాయ్ ఐ20 కారు పేలిందని తెలిపారు. ఈ పేలుడు ధాటికి దానికి సమీపంలోని 22 వాహనాలు కూడా కాలిపోయాయన్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఏకంగా 15 ఫైరింజన్లను ఉపయోగించాల్సిన వచ్చిందని, మంటలు ఆర్పడానికి అరగంట సమయం పట్టిందని వివరించారు.
