National Education Day 2025: ప్రతి ఏడాది నవంబర్ 11న భారతదేశంలో జాతీయ విద్యా దినోత్సవం (National Education Day) జరుపుకుంటారు. ఈ రోజు భారత తొలి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన సేవలకు స్మారకంగా నిలిచింది. ఆయన విద్యను ఒక సమాజ నిర్మాణ శక్తిగా భావించి, దేశ అభివృద్ధికి బాటలు వేశారు.
జాతీయ విద్యా దినోత్సవం 2025
2025లో జాతీయ విద్యా దినం నవంబర్ 11, మంగళవారం జరుపుకుంటారు. ఈ తేదీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినం. ఆయన 1947 నుండి 1958 వరకు భారత తొలి విద్యా మంత్రిగా సేవలందించారు.
చరిత్ర
భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ప్రస్తుతం విద్యా మంత్రిత్వ శాఖ) 2008లో నవంబర్ 11ను జాతీయ విద్యా దినంగా ప్రకటించింది. భారత విద్యా వ్యవస్థ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన అమోఘ కృషిని గుర్తు చేసుకుంటుంది. ఆయన ఆధ్వర్యంలోనే UGC (University Grants Commission), IITలు, AICTE వంటి ప్రముఖ విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. 14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత, తప్పనిసరి విద్య అందించే దిశగా ఆయన పునాది వేశారు. విజ్ఞాన, సాంకేతిక , సాంస్కృతిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు దేశంలోని ప్రతి ప్రాంతానికి విద్య చేరాలనే దృష్టితో పనిచేశారు.
ఎందుకు జాతీయ విద్యా దినోత్సవాన్ని నవంబర్ 11న జరుపుకుంటారు?
భారత విద్యా వ్యవస్థకు బలమైన పునాది వేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పుట్టిన రోజు గుర్తుగా దేశం మొత్తం ఈ రోజును జాతీయ విద్యా దినంగా జరుపుకుంటుంది. ఆయన కేవలం స్వాతంత్ర్య సమరయోధుడే కాకుండా, లోతైన ఆలోచనలు కలిగిన విద్యావేత్త కూడా. ఆయన అభిప్రాయం ప్రకారం.. “విద్యే దేశ నిర్మాణానికి మూలం.” ఆయన దృష్టిలో ఉన్న సార్వత్రిక విద్య, శాస్త్రీయ అభివృద్ధి, సాంస్కృతిక ఐక్యత నేటి భారత విద్యా విధానాల పునాది అయ్యాయి.
జాతీయ విద్యా దినోత్సవం ప్రాధాన్యం
జాతీయ విద్యా దినోత్సవం కేవలం మౌలానా ఆజాద్ స్మరణకే కాకుండా, విద్య అనే గొప్ప శక్తితో దేశాన్ని ఎలా మార్చవచ్చో గుర్తు చేసే రోజు కూడా.
ఈ రోజు ప్రధానంగా ఈ అంశాలను ప్రతిబింబిస్తుంది
ప్రతి పౌరుడికి సమాన విద్యా అవకాశాలు కల్పించడం. దేశ నిర్మాణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల పాత్ర కీలక పాత్ర వహిస్తారు. సాంకేతికత, సమానత్వం, సృజనాత్మకతకు అనుగుణంగా విద్యా విధానాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు ఈ సందర్భంగా సెమినార్లు, వ్యాసరచన పోటీలు, చర్చలు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తాయి. విద్య ప్రాముఖ్యతను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే దీని ఉద్దేశ్యం.
