Air India Crash: ఈ ఏడాది జూన్ నెలలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం ఓ మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కుప్పకూలిన (Air India Crash) ఘటనలో ప్యాసింజర్లు, హాస్టల్ విద్యార్థులు కలిపి మొత్తం 260 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే రెండు ఇంజిన్‌లకు ఇంధన సరఫరా ఆగిపోయిందంటూ జులైలో విడుదలైన ప్రాథమిక నివేదిక తర్వాత, పైలెట్-ఇన్-కమాండ్ సుమీత్ సబర్వాల్ తప్పిదం కారణంగానే ప్రమాదం జరిగిందంటూ నిర్ధారణ కాని విశ్లేషణలు వ్యక్తమయ్యాయి. ఈ ఆరోపణలను తప్పుబడుతూ పైలెట్ తండ్రి, 91 ఏళ్ల పుష్కరాజ్ సబర్వాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం (నవంబర్ 7) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Read Also- Cancer Awareness: పిల్లల్లో వచ్చే క్యాన్సర్ పెద్దల దానికంటే ఎందుకు భిన్నంగా ఉంటుందో తెలుసా?
ఫ్యూయల్ కట్-ఆఫ్ చేశారా? అని ఒక పైలట్ అడిగారని, చేయలేదని మరొకరు సమాధానం చెప్పారని జస్టిస్ కాంత్ ప్రస్తావించారు. ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించిందంటూ పుష్కరాజ్ తరఫు న్యాయవాది ప్రస్తావించారు. ‘‘విదేశీ నివేదికలను తాము పట్టించుకోబోం. అలాగైతే మీ పరిష్కారం విదేశీ కోర్టుల వద్ద ఉండాలా?. అది కేవలం దురుద్దేశపూరితమైన రిపోర్టింగ్’’ అని జస్టిస్ కాంత్ సమాధానం ఇచ్చారు. ఆ రిపోర్టులో ఒక భారతీయ అంశాన్ని ప్రస్తావించడంపై తాము ఆందోళన చెందుతున్నట్టు న్యాయవాది స్పందించారు.
Read Also- Women Health: క్యాన్సర్ దూరంగా ఉంచే స్మార్ట్ లైఫ్‌స్టైల్.. ప్రతి మహిళ తప్పక పాటించాల్సిన చిట్కాలు
‘‘ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం. కానీ, మీ కొడుకు తప్పిందం కారణంగా ఎయిరిండియా విమానం కుప్పకూలిందని భారతదేశంలో ఎవరూ అనుకోవడం లేదు. అవమానంగా భావించి మీలో మీరు కుమిలిపోతూ ఏడవకండి’’ అంటూ పెద్దాయనకు సుప్రీంకోర్టు ధైర్యం చెప్పింది. ప్రమాదం విషయంలో ఎవరూ సుమీత్ సబర్వాల్‌ను నిందించడంలేదని స్పష్టం చేసింది. ఈ ప్రమాదానికి పైలట్ కారణమని భారతదేశంలో ఎవరూ నమ్మడం లేదని జస్టిస్ సూర్య కాంత్ వ్యాఖ్యానించారు. ప్రాథమిక నివేదికలో పైలట్లపై ఎటువంటి ఆరోపణలు లేవని స్పష్టం చేసింది. ప్రాథమిక దర్యాప్తులో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను మాత్రమే పొందుపరిచారని, కానీ, వారి వల్ల ప్రమాదం జరిగినట్టు ఎక్కడా పేర్కొనలేదని వివరించారు. ప్రాథమిక నివేదిక ఎవరినీ నిందించదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. విషాదకరమైన ఈ ప్రమాదానానికి కారణం ఏదైనప్పటికీ, పైలట్ మాత్రం కారణం కాదని జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
కాగా, ఏఏఐబీ దర్యాప్తు స్వతంత్రమైనది కాకపోవడంతో ప్రమాదంపై స్వతంత్ర న్యాయ కమిటీ దర్యాప్తు చేయాలని పైలట్ తండ్రి తరపు న్యాయవాది గోపాల్ శంకరనారాయణ్ సుప్రీంకోర్టుకు విన్నవించారు. స్వతంత్ర దర్యాప్తు అవసరమని చెప్పారు. అయితే, ఇదే తరహాలో మరో పిటిషన్ దాఖలైందని, డీజీసీఏ, ఏఏఐబీ (Aircraft Accident Investigation Bureau) లకు నోటీసులు పంపించిన తర్వాత, ఈ రెండు పిటిషన్లపైనా నవంబర్ 10న విచారణ చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
