CM Revanth Reddy: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతూ వస్తున్నది. గతంలో పోల్చితే లీడ్ పెరిగినట్లు అంతర్గత సర్వేల్లో గుర్తించింది. ప్రధానంగా ఎర్రగడ్డలో ఊహించని మెజార్టీ తేలినట్లు సర్వేల్లో నిర్ధారించారు. ఏకంగా పది శాతం హైక్ వచ్చినట్లు గుర్తించారు. మిగతా డివిజన్లలోనూ ఈ స్థాయిలో పెరగాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించినట్లు తెలిసింది. ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు ఇచ్చిన గత వారానికి సంబంధించిన సర్వేలు, రిపోర్టులను సీఎం పరిశీలించారు. దీనిపై గురువారం మంత్రులతో ప్రత్యేక రివ్యూ నిర్వహించారు. అన్ని డివిజన్లలో గ్రాఫ్ మరింత పెరగాలని ఆదేశించారు. గతంలో పోల్చితే బెటర్‌గా ఉన్నామని, గెలుపు మనదే అయినప్పటికీ, మెజార్టీ కూడా కీలకమేనని సీఎం వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్‌లో గెలవబోతున్నామని సంకేతాలు ఇస్తూనే, ఎప్పటికప్పుడు అలర్ట్‌గా కూడా ఉండాలని నొక్కి చెప్పారు.
మూడు రోజులపాటు ప్రతీ గంట ముఖ్యమే..
ఎన్నికల ప్రచారానికి కేవలం మూడు రోజులు మాత్రమే ఉన్నదని, దీంతో ప్రతీ గంట పార్టీకి ముఖ్యమేనని సీఎం వ్యాఖ్యానించారు. ఇన్‌ఛార్జ్ మంత్రులు, చైర్మన్లు, పార్టీ కమిటీలు, క్షేత్రస్థాయి కార్యకర్తలంతా నియోజకవర్గాన్ని రౌండప్ చేయాలన్నారు. ప్రతీ గడప టచ్ అయ్యేలా విస్తృతంగా పర్యటించాలని చెప్పారు. ప్రధానంగా ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారులు, మహిళా ఓటర్లను టార్గెట్ చేయాలన్నారు. ఈ రెండు వర్గాల ద్వారా అత్యధిక ఓట్లు సాధించవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది.
పోలింగ్ పెరిగితే మనకే బెటర్
పోలింగ్ శాతం పెరిగితే కాంగ్రెస్‌కే బెటర్ అని నివేదికలు స్పష్టం చేస్తున్నాయని సీఎం వివరించినట్లు తెలిసింది. దీంతో లీడర్లంతా ఆ దిశగా పని చేయాలని సూచించారు. 407 పోలింగ్ బూత్‌లలో ప్రత్యేకంగా మానిటరింగ్ చేయాలన్నారు. ఇందుకు కమిటీలు ఫోకస్ పెట్టాలని తెలిపారు. టార్గెటెడ్ ఓటర్లను బూత్‌ల వరకు తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. బస్తీ ఓటర్లకు అవగాహన పెంచాలని, బూత్‌లలో తప్పులు చేయకుండా ముందే ఓట్ వేసే విధానంలో అవగాహన కల్పించాలన్నారు. దీని వలన ఓట్లు తొలగిపోకుండా ఉంటాయని పేర్కొన్నారు.
పోల్ మేనేజ్‌మెంట్‌పై ఫోకస్
గడిచిన పది రోజులుగా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లీడ్‌లోనే ఉన్నారని, గ్రాఫ్ ఎక్కడా తగ్గలేదని సీఎం వివరించారు. గెలుపు పక్కా అయినప్పటికీ, ఫోల్ మేనేజ్‌మెంట్‌పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని సీఎం సూచించారు. డివిజన్ల వారీగా ముఖ్య లీడర్లకు ఈ బాధ్యతలు అప్పగించాలన్నారు. బస్తీల్లోని ప్రజలను ఎక్కువగా ఆశ్రయించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రతి వంద మంది ఓటర్లకు ఒక సమన్వయ కర్త ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఓట్ వేసిన తర్వాత కూడా ఇళ్లకు పంపించే బాధ్యతలు తీసుకునేలా వ్యవహరించాలని సూచించారు. దీని వలన మిస్ కమ్యూనికేషన్‌కు చెక్ పెట్టవచ్చన్నారు. కార్యకర్తలంతా సంయమనం పాటించేలా ఆదేశాలివ్వాలని మంత్రులకు సూచించారు.
సోషల్ మీడియా స్టంట్స్‌కు చెక్ పెట్టాలి
బీఆర్ఎస్, కాంగ్రెస్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో వార్ కొనసాగుతున్నదని, బీఆర్ఎస్ టీమ్స్ అడ్డగోలుగా ప్రభుత్వం, పార్టీ, అభ్యర్థిని బద్నాం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాయని, ఆ విష ప్రచారాలను సోషల్ మీడియా వేదికగానే తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నదని సీఎం అన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రజలను గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నదన్నారు. ఫేక్ ప్రచారాలు, అసత్య ఆరోపణలను అడ్డుకోవాలని సూచించారు. సోషల్ మీడియా టీమ్స్, పార్టీ ఐటీ విభాగాలు ఈ మూడు రోజుల పాటు అలర్ట్‌గా పని చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు, అభ్యర్థి పాజిటివ్ అంశాలను జనాల్లోకి చొచ్చుకు వెళ్లేలా వ్యూహాలు రచించాలని చెప్పారు. ఈ మూడు రోజుల పాటు పార్టీ విజయం కోసం కృషి చేయాలని కోరారు. ప్రతీ ఓటర్‌కు ప్రభుత్వం సందేశం స్పష్టంగా చేరేలా సోషల్ మీడియా పని చేయాలని సీఎం స్పష్టం చేశారు.
Also Read: Bigg Boss Telugu 9: సీక్రెట్ రెబల్.. హౌస్‌లో అసలు సిసలు బిగ్ బాస్ ఆట మొదలైంది

