Jubliee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఓటర్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. స్వాతంత్రం నాటి నుంచి జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలవలేదన్న ఆయన.. ఈసారి తమకు ఓటు వేసి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సారి కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉందని.. బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని అన్నారు. ప్రస్తుతం వెలువడుతున్న సర్వేలను తాను విశ్వసించని.. నమ్మకమైన సంస్థలు ఏవి కూడా జూబ్లీహిల్స్ పై ఎలాంటి సర్వే రిపోర్టు విడుదల చేయలేదని అన్నారు. జూబ్లీహిల్స్ లో తిరుగుతుంటే దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయన్న కిషన్ రెడ్డి.. రాత్రి అయితే ఆ ప్రాంతం అంధకారాన్ని తలపిస్తోందని విమర్శించారు.
ఎన్నికల హామీలు ఎక్కడ?
జూబ్లీహిల్స్ లో వైఫల్యాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే బాధ్యత వహించాలని కిషన్ రెడ్డి సూచించారు. డ్రైనేజీ నీటిలోనే పాదయాత్ర చేయాల్సి వస్తోందని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ ఏ విధంగా పరిష్కరిస్తారో చెప్పాలని అన్నారు. ‘2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. రెండేళ్లు గడుస్తుంది.. ఉద్యోగాలేవి?. తులం బంగారం, మహిళలకు రూ.2,500 స్కీమ్ ఎటు పోయింది. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదు. మేనిఫెస్టో హామీలు అమలు చేస్తారా? చెయ్యరా?. జూబ్లీహిల్స్ ఓట్లయ్యకపోతే సన్న బియ్యం, ఉచిత బస్సు ఆగిపోతుందని సీఎం చెబుతున్నారు. సన్న బియ్యం స్కీమ్ కు కేంద్రం రూ.42 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 15 రూపాయలు ఇస్తోంది. సన్నబియ్యాన్ని రేవంత్ రెడ్డి ఏ రకంగా నిలిపివేస్తారో చెప్పాలి’ అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
‘బీఆర్ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదు’
జూబ్లీహిల్స్ ఎన్నికను తాము రెఫరెండంగా భావించడం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తన పార్లమెంటు పరిధిలోకి వచ్చే నియోజకవర్గం కాబట్టి ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు స్ఫష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఒకరు కొట్టినట్టు, మరొకరు తిట్టినట్టూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. భవిష్యత్ లో బీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుటుంబ పార్టీలేనని విమర్శించారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంపై మాట్లాడుతూ.. గత రెండేళ్లలో ఎందుకు గుర్తుకురాలేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ కచ్చితంగా గెలుస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Bigg Boss Telugu: చిచ్చుపెట్టిన బిగ్ బాస్.. ఇమ్మూ, రీతూ మధ్య భారీ ఫైట్.. గొడవతో దద్దరిల్లిన హౌస్!
‘రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నా’
మరోవైపు తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు కిషన్ రెడ్డి స్ఫష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో తన పాత్రకు తాను కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ పదే పదే తనపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ‘దేశంలో రాష్ట్రాలన్నీ మాకు సమానం. ఏ రాష్ట్రంపై చిన్న చూపు ఉండదు. గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధుల డేటాను బయటపెట్టాలి’ అని కిషన్ రెడ్డి నిలదీశారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ గురించి పదే పదే చెబుతున్నారని.. రాష్ట్రంలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లను కేంద్రం అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.
